ఓపెనర్ గా సంజు, భారత్ -దక్షిణాఫ్రికాజట్ల తొలివన్డే నేడే!
క్రికెట్ టాప్ ర్యాంకర్ భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఈరోజు రెండో అంచెకు తొలివన్డేతో తెరలేవనుంది.
క్రికెట్ టాప్ ర్యాంకర్ భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఈరోజు రెండో అంచెకు తొలివన్డేతో తెరలేవనుంది. జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా తొలిసమరం జరుగనుంది...
సఫారీగడ్డపై టాప్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా ఈ రోజు పోరు ప్రారంభంకానుంది.
రాహుల్ నాయకత్వంలో భారత్...
దక్షిణాఫ్రికా నెలరోజుల పర్యటనలో భాగంగా జరిగిన తొలి అంచె టీ-20 సిరీస్ ను 1-1తో సమం చేయడం ద్వారా శుభారంభం చేసిన ప్రపంచ నెంబర్ వన్ టీమ్ భారత్..వన్డే సిరీస్ లోనూ సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉంది.
సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా, షమీ అందుబాటులో లేకపోడంతో...వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ నాయకత్వంలో భారత్ పోటీకి దిగుతోంది.
మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికాజట్టుకు ఎడెన్ మర్కరమ్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఓపెనర్ గా సంజు శాంసన్ కు చాన్స్...
2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచి భారతజట్టులో చోటు కోల్పోయిన డాషింగ్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రస్తుత ఈ సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ చేయనున్నాడు.
మిడిలార్డర్ కు బదులుగా ఓపెనర్ గా సంజుతో ప్రయోగం చేయటానికి చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సిద్ధమయ్యారు. బంతిని బలంగా బాదడంలోనూ, భారీషాట్లు ఆడటంలోనూ తనకుతానే సాటిగా నిలిచే సంజు అంది వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
వచ్చే వన్డే ప్రపంచకప్ ప్రారంభం నాటికి రోహిత్ శర్మ స్థానంలో సంజును ఎటాకింగ్ ఓపెనర్ గా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో భారత్ టీమ్ మేనేజ్ మెంట్ ఉంది.
జట్టులోని ఇతర బ్యాటర్లలో రుతురాజ్ గయక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటీదార్, రింకూ సింగ్,శ్రేయస్ అయ్యర్ లతో పాటు కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ సైతం కీలకం కానున్నారు.
స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహాల్, పేసర్లు ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా వన్డేజట్టులో పాదుకోవాలని భావిస్తున్నారు.
పేస్ బౌలర్ల అడ్డా న్యూవాండరర్స్...
ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లతో పాటు షాట్ మేకర్లకు అనువుగా ఉండే వాండరర్స్ స్టేడియం పిచ్ పైన భారీస్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. రెండుజట్లలోనూ పలువురు సూపర్ హిట్టర్లు ఉండడంతో బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరుతో పరుగులు వెల్లువెత్తనున్నాయి.
ఇదే వేదికగా ముగిసిన టీ-20 పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ సాధించడం భారత వన్డే జట్టుకు సైతం సరికొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వన్డే సిరీస్ లోనూ సఫారీలకు కొరకరాని కొయ్య కానున్నాడు.
రాహుల్ నాయకత్వంలో భారతజట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే..ప్రపంచకప్ ఆఖరిలీగ్ పోరులో ఎదురైన ఓటమికి ప్రస్తుత సిరీస్ లో బదులుతీర్చుకోవాలన్న కసితో సఫారీ టీమ్ ఉంది.
మూడుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోవన్డేను డిసెంబర్ 19న, ఆఖరి వన్డేను డిసెంబర్ 21న నిర్వహించనున్నారు.