Telugu Global
Sports

లేటువయసులో సానియాజోడీ ఘాటు గెలుపు!

భారతజోడీ రోహన్ బొపన్న- సానియా మీర్జా ప్రస్తుత సీజన్ గ్రాండ్ స్లామ్ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించారు.

Sania Mirza at a young age is a bitter victory!
X

లేటువయసులో సానియాజోడీ ఘాటు గెలుపు!

భారతజోడీ రోహన్ బొపన్న- సానియా మీర్జా ప్రస్తుత సీజన్ గ్రాండ్ స్లామ్ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించారు. గ్రాండ్ స్లామ్ ట్రోఫీతో సానియా తన కెరియర్ ను ముగించడం ఖాయంగా కనిపిస్తోంది...

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తన కెరియర్ ను ఘనంగా ముగించడానికి రంగం సిద్ధం చేసుకొంది. 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తో తాను రిటైర్ కాబోతున్నట్లు కొద్దివారాల క్రితమే ప్రకటించింది.

మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ బరిలో నిలిచిన సానియాకు ..మహిళల డబుల్స్ లో వైఫల్యం ఎదురైనా..

భారత డేవిస్ కప్ డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొప్పన జోడీగా మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా సంచలనం సృష్టించింది.

7వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో..

తన కెరియర్ లో సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో ఎన్నో అపూర్వ విజయాలు సాధించిన సానియా..7వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో రిటైర్ కావాలని భావిస్తోంది.

వేర్వేరు భాగస్వాములతో ఇప్పటికే మూడు మిక్సిడ్ డబుల్స్, మూడు మహిళల డబుల్స్ టైటిల్స్ సాథించిన సానియా...2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా పోటీకి దిగింది.

క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వే- జపాన్ జోడీ ఏరియల్, మకాటో నినోమియాలను 6-4, 7-6తో అధిగమించడం ద్వారా సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. ఆ వెంటనే జరిగిన సెమీఫైనల్లో మూడోసీడ్ జోడీ నీల్ స్కుపిస్కీ ( గ్రేట్ బ్రిటన్ )- డేసిరే క్రావస్కీ ( అమెరికా )ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 7-6, 6-7, 10-6 విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొన్నారు.

సానియా 36- రోహన్ 42

రోహన్ బొపన్న వయసు 42, తన వయసు 36 .అయినా టెన్నిస్ ఆడుతూ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరడం ఆశ్చర్యంగా, ఓ కలలా ఉందని విజయానంతరం సానియా చెప్పింది.

సెమీఫైనల్లో ప్రత్యర్థిజోడీతో విజయం కోసం గంటా 52 నిముషాలపాటు పోరాడటం ఎంతో సంతృప్తినిచ్చిందని పొంగిపోయింది. తనవయసు 14 ఏళ్లు ఉన్న సమయంలో 20 సంవత్సరాల రోహన్ తో కలసి తాను తొలిసారిగా మిక్సిడ్ డబుల్స్ పోరుకు దిగానని..ఇప్పుడు 36, 42 సంవత్సరాల వయసుతో ఆడటం అద్భుతమని చెప్పింది.

గత 18 సంవత్సరాలుగా తాను టెన్నిస్ కెరియర్ ను కొనసాగించి శారీరకంగా, మానసికంగా అలసిపోయానని, వచ్చేనెలలో దుబాయ్ వేదికగా జరిగే టోర్నీతో ఆట నుంచి వీడ్కోలు తీసుకొంటానని మరోసారి వివరించింది.

2009లో మహేశ్ భూపతితో జంటగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ట్రోఫీ అందుకొన్నానని, అదే తన కెరియర్ లో తొలిగ్రాండ్ స్లామ్ ట్రోఫీ అని గుర్తు చేసుకొంది.

టెన్నిస్ మూడు విభాగాలలోనూ మొత్తం 43 టైటిల్స్ సాధించిన సానియా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ సమరం తర్వాత ఆట నుంచి పూర్తిగా విరమించుకోనుంది.

వయసు మీద పడటం, గాయాలు, కుటుంబ బాధ్యతలతో తాను టెన్నిస్ ను కొనసాగించే పరిస్థితిలో లేనని గత నెలలోనే ఓ ప్రకటన ద్వారా మీడియా ద్వారా తన అభిమానులకు సానియా తెలిపిన సంగతి తెలిసిందే.

మహిళల సింగిల్స్ సెమీస్ లో రిబకినా...

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు కజకిస్థాన్ ప్లేయర్ ఎలెనా రిబకినా చేరుకొంది. గతేడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గడం ద్వారా అగ్రశ్రేణి ప్లేయర్ల సరసన నిలిచిన రిబకినా క్వార్టర్ ఫైనల్లో లాత్వియాకు చెందిన 17వ సీడ్ ప్లేయర్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ విజేత జెలెనా ఒస్టాపెంకోను 6-2, 6-4తో అలవోకగా ఓడించింది.

22వ సీడ్ గా బరిలోకి దిగిన రిబకినా..సెమీస్ బెర్త్ తో మురిసిపోతోంది. తాను సెమీస్ వరకూ రాగలనని భావించలేదని చెప్పింది.

జెస్సికా పెగ్యూలా- విక్టోరియా అజరెంకోల పోరులో నెగ్గిన ప్లేయర్ తో ఫైనల్లో చోటు కోసం రిబకినా తలపడాల్సి ఉంది.

First Published:  25 Jan 2023 5:15 PM IST
Next Story