Telugu Global
Sports

విరాట్ బ్యాటింగ్ లో అదే ఫైర్..అదే పవర్!

విరాట్ కొహ్లీ బ్యాటింగ్ అంటే ఫైర్, విరాట్ బ్యాటింగ్ అంటే పవర్. క్లిష్టమైన బంతులను సైతం అలవోకగా ఫోర్లు, సిక్సర్లకు బాదడంలో విరాట్ కు విరాట్ మాత్రమే సాటి.

విరాట్ బ్యాటింగ్ లో అదే ఫైర్..అదే పవర్!
X

స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ ఫామ్ మూడేళ్ల తర్వాత తిరిగి గాడిలో పడటంతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే ముగిసిన ఆసియాకప్, ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ ల్లో విరాట్ నిలకడగా రాణించడమే దానికి నిదర్శనం.....

అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల కోసం గత మూడేళ్లుగా నానాపాట్లు పడిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ తిరిగి గాడిలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియాకప్ టోర్నీ, ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ ల్లో విరాట్ సాధించిన పరుగులు, ఆటతీరే దానికి నిదర్శనమని చెబుతున్నారు.

అదే జోరు...అదే దూకుడు....

ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ గా పేరుపొందిన విరాట్ కొహ్లీ తన 13 సంవత్సరాల కెరియర్ లో గత మూడేళ్లుగా గడ్డు పరిస్థితినే ఎదుర్కొన్నాడు. 2019 నాటికే 70 అంతర్జాతీయ శతకాలు బాదిన విరాట్ ..తన 71వ సెంచరీ కోసం 1020 రోజులపాటు వేచిచూడాల్సి వచ్చింది.

టెస్టులు, వన్డేలు, టీ-20మ్యాచ్ లు, చివరకు ఐపీఎల్ లో సైతం విరాట్ వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతూ వచ్చాడు. అయితే..పలువురు దిగ్గజాల సలహాలు, సూచనల మేరకు కొద్దివారాలపాటు క్రికెట్ కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోడం ద్వారా తిరిగి పుంజుకోగలిగాడు. 2022 ఆసియాకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా విరాట్ నిలిచాడు.

పడిలేచిన కెరటంలా....

విరాట్ కొహ్లీ బ్యాటింగ్ అంటే ఫైర్, విరాట్ బ్యాటింగ్ అంటే పవర్. క్లిష్టమైన బంతులను సైతం అలవోకగా ఫోర్లు, సిక్సర్లకు బాదడంలో విరాట్ కు విరాట్ మాత్రమే సాటి. అయితే..తన బ్యాటింగ్ అమ్ముల పొది నుంచి మూడేళ్ల క్రితం కోల్పోయిన బ్యాటింగ్ ఫైర్, పవర్ ను విరాట్ చేజార్చుకొన్నాడు.

దుబాయ్ వేదికగా కొద్దివారాల క్రితం ముగిసిన ఆసియాకప్ టోర్నీలో విరాట్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. గ్రూప్ లీగ్, సూపర్-4 రౌండ్ మ్యాచ్ ల్లో విరాట్ ఓ శతకం, రెండు అర్థశతకాలతో 276 పరుగులు సాధించాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ లో 147. 59 స్ట్ర్రయిక్ రేట్ తో 92.00 సగటు నమోదు చేశాడు. ఆసియాకప్ టోర్నీలోనే అత్యంత పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా విరాట్ తిరిగి తన సత్తాను చాటుకోగలిగాడు.

విరాట్ బౌండ్రీలు, సిక్సర్లు బాదినతీరు చూస్తుంటే..అతనిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, గతంలో కనిపించిన జోరు, దూకుడే ఇప్పుడు కనిపిస్తోందని క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభివర్ణించాడు.


ఆసీస్ తో సిరీస్ లోనూ విరాట్ జోరు..

ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో సైతం విరాట్ తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్ లో 63 పరుగుల అత్యుత్తమ స్కోరుతో 76 పరుగులు సాధించాడు.25.33 సగటు నమోదు చేశాడు.

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగే విరాట్...రెండోడౌన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తో కలసి..ఆసియాకప్ తో పాటు ఆసీస్ తో సిరీస్ లో సైతం కళ్లు చెదిరే భాగస్వామ్యాలు నమోదు చేశాడు. సూర్య బ్యాటింగ్ తీరు, షాట్లు కొడుతున్న తీరును చూసి ఉత్తేజం పొందిన విరాట్..తన ఆటతీరును గణనీయంగా మెరుగుపరచుకోగలిగాడు.

విరాట్ తన పూర్వపుస్థాయిలో బ్యాటింగ్ చేస్తున్న కారణంగా..త్వరలో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ లో భారత బ్యాటింగ్ సమస్యలు తీరినట్లేనని భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ లో సైతం విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు.

సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం నోర్జే, రబడ, పార్నెల్ లను విరాట్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలడో..రానున్న మూడుమ్యాచ్ ల్లోనే తేలిపోనుంది.

First Published:  28 Sept 2022 1:00 PM IST
Next Story