Telugu Global
Sports

ఐపీఎల్ వేలంలో కరెన్ , గ్రీన్ కమాల్!

IPL 2023 Auction: ఐపీఎల్ 2023 వేలంలో యువఆల్ రౌండర్ల పంట పండింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరెన్, ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కాసుల పంట పండించుకొన్నారు.

IPL 2023 Auction
X

ఐపీఎల్ వేలంలో కరెన్ , గ్రీన్ కమాల్!

ఐపీఎల్ 2023 వేలంలో యువఆల్ రౌండర్ల పంట పండింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరెన్, ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కాసుల పంట పండించుకొన్నారు.

ఐపీఎల్ వేలం చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు..

ఐపీఎల్ 2023 సీజన్ టోర్నీ ప్రారంభంకాకముందే రికార్డుల మోత మోగింది. వేలం దశలోనే సరికొత్త రికార్డు నమోదయ్యింది. ఇంగ్లండ్ టీ-20 ప్రపంచకప్ లో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ సామ్ కరెన్ కు రికార్డుస్థాయిలో 18 కోట్ల రూపాయల 50 లక్షల రూపాయల ధర పలికింది.

కంగారూ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 17 కోట్ల 50 లక్షల రూపాయలతో కరెన్ తర్వాతిస్థానంలో నిలిచాడు.

పరిమిత బడ్జెట్ తో అపరిమిత రేటు...

కొచ్చీ వేదికగా తొలిసారిగా నిర్వహించిన 2023 సీజన్ వేలం లో మొత్తం 10 ఫ్రాంచైజీ యాజమాన్యాలు పరిమితమైన నిధులతోనే బరిలో నిలిచినా తమ అవసరాలకు తగిన ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూలేనంత మొత్తాలను వెచ్చించాయి.

ఇంగ్లండ్ లెఫ్టామ్ పేస్ ఆల్ రౌండర్ కరెన్ కోసం బెంగళూర్, ముంబై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. బేస్ ప్రైజ్‌ రూ.2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన కరెన్‌ను రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కరెన్ రికార్డు నెలకొల్పాడు. కనీస వేలం ధర రూ.2 కోట్లు కంటే కరెన్ కు దాదాపు 9 రెట్లు ఎక్కువ పలకడం విశేషం.

కరెన్‌ను..ఐపీఎల్ 2019లో తొలిసారిగా పంజాబ్ కింగ్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో మరోసారి వేలంలో నిలిచాడు.చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గాయం కారణంగా గతేడాది మెగా వేలానికి దూరంగా ఉన్నాడు.

సామ్ కరెన్ ఇటీవలే ముగిసిన 2022 టీ-20 ప్రపంచ కప్‌లోని ఆరు మ్యాచ్‌లలో 6.52 ఎకానమీతో 13 వికెట్లు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు. ఫైనల్‌లోనూ 12 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ అద్భుతం. ఇదే కారణంతోనే ఈ మినీ వేలంలో అందరిచూపు కరెన్ పైనే పడింది.

క్రిస్ మోరిస్ రికార్డు తెరమరుగు..

ఈ రోజు వేలం ప్రారంభానికి ముందు వరకూ అత్యధిక ధర పలికిన ఆటగాడి రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ పేరుతోనే ఉంది. క్రిస్ మోరిస్ పేరిట ఉన్న రూ. 16.25 కోట్లుఈ రికార్డును సామ్ కరెన్ మాత్రమే కాదు..కామెరాన్ గ్రీన్ సైతం తెరమరుగు చేయగలిగారు.

ఐపీఎల్‌ గత సీజన్ వరకూ మొత్తం 32 మ్యాచులు ఆడిన కరెన్ 337 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు.

సామ్ కరెన్ ను పంజాబ్ కింగ్స్ జట్టు సొంతం చేసుకోగలిగింది. కామెరాన్ గ్రీన్ ను ముంబై ఫ్రాంచైజీ దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్, హారీ బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకొన్నాయి. స్టోక్స్ కు 16 కోట్ల 25 లక్షల రూపాయలు, హారీ బ్రూక్ కు 13 కోట్ల 25 లక్షల రూపాయల ధర పలికింది.

మొత్తం 10 మంది ఆటగాళ్లకు 10 కోట్ల రూపాయలకు పైగా ధర దక్కింది.

ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 2 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకోగలిగింది.

ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 20 లక్షల రూపాయల కనీస ధరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.

First Published:  23 Dec 2022 6:18 PM IST
Next Story