Telugu Global
Sports

భారత్ ' సెల్ఫ్ గోల్' తో కువైట్ తో మ్యాచ్ డ్రా!

కువైట్ తో ఆఖరిరౌండ్ పోరులో విజయం అంచుల వరకూ వచ్చిన భారత్ 'సెల్ఫ్ గోల్' తో మ్యాచ్ ను 1-1తో డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్  సెల్ఫ్ గోల్ తో కువైట్ తో మ్యాచ్ డ్రా!
X

భారత్ ' సెల్ఫ్ గోల్' తో కువైట్ తో మ్యాచ్ డ్రా!

2023 శాఫ్ కప్ ఫుట్ బాల్ గ్రూప్- ఏ లీగ్ లో ఆతిథ్య భారత్ నెగ్గాల్సిన ఆఖరి రౌండ్ మ్యాచ్ ను డ్రాతో సరిపెట్టుకొంది. సెమీస్ లో లెబనాన్ తో తలపడనుంది.

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టోర్నీ శాఫ్ కప్-2023 టోర్నీ గ్రూప్ -ఏ లీగ్ లో ఆతిథ్య భారత్ రెండోస్థానంలో నిలవడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

కువైట్ తో ఆఖరిరౌండ్ పోరులో విజయం అంచుల వరకూ వచ్చిన భారత్ 'సెల్ఫ్ గోల్' తో మ్యాచ్ ను 1-1తో డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్ ను ముంచిన అన్వర్ అలీ

బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా గత వారం రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా లీగ్ దశలో తలపడుతున్నాయి.

గ్రూప్ - ఏ లీగ్ లో ఆతిథ్య భారత్ తో పాటు పాకిస్థాన్, నేపాల్, కువైట్ జట్లు పోటీకి దిగాయి.

లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్...రెండోరౌండ్ పోరులో నేపాల్ తో మ్యాచ్ ను 2-0తో నెగ్గడం ద్వారా 6 పాయింట్లతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

మరోవైపు..శాఫ్ టోర్నీలో ఆతిథ్యజట్టుహోదాలో తొలిసారిగా పాల్గొన్న కువైట్ తో జరిగిన గ్రూప్ లీగ్ ఆఖరిరౌండ్ పోరులో భారత్ పూర్తిఆధిపత్యం ప్రదర్శించినా విజేతగా మాత్రం నిలువలేకపోయింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో భారత్ కు స్టార్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ తొలిభాగంలోనే గోల్ అందించాడు. దీంతో రెండోభాగం చివరి వరకూ 1-0తో భారత్ ఆధిక్యమే కొనసాగింది. ఆట ముగిసే క్షణాలలో భారత ఆటగాడు అన్వర్ అలీ తనదిశగా వస్తున్న బంతిని నిలువరించబోయి..సొంతగోల్ లోకి బంతిని నెట్టడంతో భారత్ సెల్ఫ్ గోల్ తో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.

కువైట్ జట్టు గోల్ చేయకుండానే..భారత డిఫెండర్ తప్పిదంతో ఓటమినుంచి బయటపడడంతో పాటు సమఉజ్జీగా నిలిచింది. భారత్ కంటే మెరుగైన సగటు గోల్స్ కలిగిన కువైట్..6 పాయింట్లతో గ్రూప్- ఏ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది.

గత తొమ్మిది అంతర్జాతీయమ్యాచ్ ల్లో ప్రత్యర్థిజట్టుకు భారత్ ఇచ్చిన తొలిగోలు ఇదే కావడం విశేషం. ఆట మొదటి భాగం 35వ నిముషంలోనే భారత్ కు తొలిగోల్ చేసే అవకాశం దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

ఆట మొదటి భాగం ముగిసే క్షణాలలో భారత్ కు కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ అందించడం ద్వారా 1-0తో పైచేయి సాధించి పెట్టాడు.

సునీల్ ఛెత్రీ రికార్డు గోల్....

ప్రస్తుత టోర్నీ గ్రూపులీగ్ మూడుమ్యాచ్ ల్లోనూ గోల్స్ సాధించడం ద్వారా భారత కెప్టెన్ కమ్ ఎవర్ గ్రీన్ స్టార్ సునీల్ ఛెత్రీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ పై మూడుగోల్స్ తో హ్యాట్రిక్ సాధించిన సునీల్..రెండోమ్యాచ్ లో నేపాల్ పై 4వ గోల్ సాధించాడు. ఆఖరి రౌండ్ పోరులో కువైట్ పైన సైతం గోల్ సాధించడం ద్వారా..శాఫ్ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ మాల్దీవ్స్ మాజీ కెప్టెన్ అలీ పేరుతో ఉన్న 23 గోల్స్ రికార్డును సునీల్ ఛెత్రీ 24వ గోల్ తో తెరమరుగు చేశాడు. అంతేకాదు..భారత్ తరపున సునీల్ ఛెత్రీకి ఇది 93వ గోల్ కావడం కూడా మరో రికార్డు.

ఇప్పటి వరకూ ఆడిన 26 శాఫ్ ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో సునీల్ ఛెత్రీ 24వ గోల్ సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రస్తుత అంతర్జాతీయ ఫుట్ బాల్ లో తమ జాతీయజట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన సాకర్ గ్రేట్ల వరుసలో క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీల తర్వాతి స్థానంలో సునీల్ ఛెత్రీ నిలిచాడు.

కువైట్ తోమ్యాచ్ ను 1-1తో ముగించడం ద్వారా గ్రూపు రెండోస్థానంలో నిలిచిన భారత్ సెమీస్ కు చేరింది. గ్రూప్ -బీ లీగ్ టాపర్ తో భారత్ తలపడనుంది.

సెమీస్ లో భారత్ ప్రత్యర్థి లెబనాన్..

1993 లో ప్రారంభమైన శాఫ్ ఫుట్ బాల్ 14టోర్నీలలో భారత్ సెమీఫైనల్స్ చేరడం ఇది 13వసారి. గ్రూపు-బీ లీగ్ లో అగ్రస్థానంలో నిలిచిన లెబనాన్ తో జరిగే సెమీస్ సమరంలో భారత్ తలపడనుంది.

రెండో సెమీఫైనల్లో గ్రూప్- ఏ టాపర్ కువైట్ తో..బంగ్లాదేశ్ లేదా మాల్దీవ్స్ జట్ల పోరుల నెగ్గిన జట్టు పోటీపడుతుంది.

భారత్ - కువైట్ మ్యాచ్ సమయంలో భారత కోచ్ స్టిమాక్ తో సహా మొత్తం ముగ్గురికి రెడ్ కార్డ్ లు చూపారు. ఆట 81వ నిముషంలో రిఫరీతో వాగ్వాదానికి దిగినందుకు భారత కోచ్ కు, ఒకరితో ఒకరు తలపడినందుకు భారత ప్లేయర్ రహీం అలీ, కువైట్ ఆటగాడు అలీ ఖలాఫ్ లకు రెడ్ కార్డ్ ల శిక్ష పడింది.

First Published:  28 Jun 2023 6:00 AM GMT
Next Story