Telugu Global
Sports

నేడు శాఫ్ ఫైనల్స్ , 9వ టైటిల్ కు భారత్ గురి!

భారత్ 9వసారి శాఫ్ సాకర్ చాంపియన్ గా నిలుస్తుందో...లేదో తెలుసుకోవాలంటే మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

నేడు శాఫ్ ఫైనల్స్ , 9వ టైటిల్ కు భారత్ గురి!
X

నేడు శాఫ్ ఫైనల్స్ , 9వ టైటిల్ కు భారత్ గురి!

14వ శాఫ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. టైటిల్ పోరులో 8సార్లు విజేత భారత్ కు కువైట్ సవాలు విసురుతోంది...

బెంగళూరు వేదికగా గత రెండువారాలుగా సాగుతున్న 2023 దక్షిణాసియా (శాఫ్ కప్ ) ఫుట్ బాల్ చాంపియన్షిప్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. ఈ రోజు జరిగే టైటిల్ సమరంతో 14వ శాఫ్ కప్ కు తెరపడనుంది.

1993 నుంచి రెండేళ్లకోమారు జరుగుతున్న ఈ టోర్నీ పరంపరలో భాగంగా జరుగుతున్న 2023 చాంపియన్షిప్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో భారత్ తో సహా మొత్తం ఎనిమిది( కువైట్, లెబనాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, భూటాన్ ) దేశాలజట్లు తలపడుతున్నాయి.

హాట్ ఫేవరెట్ గా భారత్...

మొత్తం ఎనిమిదిజట్లు రెండుగ్రూపులుగా లీగ్ దశలో తలపడితే..సెమీఫైనల్స్ నాకౌట్ పోరులో లెబనాన్ ను 4-2తో ఓడించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్ ను ఒకే ఒక్క గోలుతో అధిగమించడం ద్వారా కువైట్ జట్లు టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.

గ్రూప్- ఏ లీగ్ లో పోటీపడిన భారత్, కువైట్ జట్లే టైటిల్ పోరులో సైతం ఢీ కొనబోతున్నాయి. లీగ్ దశ ఆఖరి రౌండ్లో ఈ రెండుజట్ల మధ్యనే జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.

భారత్ పూర్తిఆధిక్యం ప్రదర్శించినా ఆట ముగిసే క్షణాలలో భారత ఆటగాడు చేసిన సెల్ఫ్ గోల్ తో కువైట్ డ్రాతో గట్టెక్కగలిగింది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో మాత్రం భారత్ పూర్తిస్థాయిలో చెలరేగగలిగితేనే రికార్డుస్థాయిలో 9వసారి విజేతగా నిలువగలుగుతుంది.

సునీల్ ఛెత్రీ పైనే భారత్ భారం..

ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకూ ఆడిన లీగ్ కమ్ నాకౌట్ మ్యాచ్ ల్లో 5 గోల్స్ సాధించడం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచిన కెప్టెన్ సునీల్ ఛెత్రీపైనే భారత్ భారం మోపింది. అంతేకాదు భారత కెప్టెన్ సునీల్‌ ఛెత్రీ 38 సంవత్సరాల వయసులోనూ చెలరేగిపోతున్నాడు. భారత్ తరపున 92 గోల్స్‌ సాధించడం ద్వారా ప్రపంచ దిగ్గజాలు రొనాల్డో, మెస్సీల వరుసలో నిలిచాడు.

ప్రస్తుత ప్రపంచ ఫుట్ బాల్ లో పోర్చుగల్ తరపున క్రిస్టియానో రొనాల్డో (123), ఇరాన్ మాజీ ఆటగాడు అలీ దాయి (109), మెస్సీ (103)లు ఛెత్రీ కంటే ముందున్నారు.

సునీల్ 92 గోల్స్ తో దిగజ్జాల వరుస 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.

జట్టులోని ఇతర ప్రధాన ఆటగాళ్లు అబ్దుల్‌ సమద్‌, మహేశ్‌ సింగ్‌, ఉదాంత సింగ్‌.. గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ సంధు సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే భారత్ కు ఇక తిరుగే ఉండదు.

ఫిఫా తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం 100వ ర్యాంక్‌లో నిలిచిన భారత్ కు శాఫ్ ఫుట్ బాల్ చరిత్రలో ప్రత్యేక స్థానమే ఉంది.1993లో ప్రారంభమైన శాఫ్ కప్ సాకర్ 14 టోర్నీల చరిత్రలో 13సార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు భారత్ మాత్రమే. వరుసగా తొమ్మిదిసార్లు ఫైనల్స్ చేరిన ఒకే ఒకజట్టుగా కూడా భారత్ నిలిచింది.

2021 టోర్నీ వరకూ 12 ఫైనల్స్ ఆడిన భారత్ కు 8సార్లు విజేతగా నిలిచిన రికార్డు ఉంది. మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.2003 శాఫ్ కప్ లో మాత్రమే భారత్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది.

ఈ రోజు రాత్రి 7-30 గంటలకు జరిగే టైటిల్ సమరాన్ని వీక్షించడానికి 30వేల మందికి పైగా అభిమానులు తరలి రానున్నారు. భారత్ 9వసారి శాఫ్ సాకర్ చాంపియన్ గా నిలుస్తుందో...లేదో తెలుసుకోవాలంటే మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  4 July 2023 6:58 AM GMT
Next Story