Telugu Global
Sports

శాఫ్ కప్ సాకర్ సెమీస్ లో భారత్!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టోర్నీ సెమీఫైనల్స్ కు ఆతిథ్య భారత్ అలవోకగా చేరుకొంది.

శాఫ్ కప్ సాకర్ సెమీస్ లో భారత్!
X

శాఫ్ కప్ సాకర్ సెమీస్ లో భారత్!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టోర్నీ సెమీఫైనల్స్ కు ఆతిథ్య భారత్ అలవోకగా చేరుకొంది. గ్రూప్ లీగ్ లో రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ విజయాలు నమోదు చేసింది...

బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగాజరుగుతున్న 8 దేశాల 2023 శాఫ్ కప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్స్ కు ఎనిమిదిసార్లు విన్నర్ భారత్ చేరుకొంది.

నాలుగు ( నేపాల్, పాకిస్థాన్, కువైట్, భారత్ ) జట్ల గ్రూప్ - ఏ లీగ్ మొదటి రెండురౌండ్ల పోటీలలో విజయాలు నమోదు చేయటం ద్వారా భారత్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్...రెండోరౌండ్లో మాత్రం నేపాల్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 2-0తో విజేతగా నిలవడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 6కు పెంచుకోగలిగింది.

సునీల్ ఛెత్రీ నాలుగో గోల్...

భారత కెప్టెన్, 38 సంవత్సరాల స్ట్ర్రయికర్ సునీల్ ఛెత్రీ వరుసగా రెండోమ్యాచ్ లో సైతం గోల్ సాధించగలిగాడు. పాకిస్థాన్ తో ముగిసిన లీగ్ ప్రారంభమ్యాచ్ లో మూడుగోల్స్ తో హ్యాట్రిక్ నమోదు చేసిన సునీల్ ఛెత్రీ..నేపాల్ తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ 61వ నిముషంలో తనజట్టుకు తొలిగోలు అందించాడు. దీంతో సునీల్ ఛెత్రీ.రెండుమ్యాచ్ ల్లో 4 గోల్సు చేయటం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఆట 70వ నిముషంలో మహేశ్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆట ముగిసే వరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకొన్న భారత్ 2-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.

భారత్ తరపున సునీల్ ఛెత్రీ గోల్స్ 91కి చేరింది. ఆసియా ఫుట్ బాల్ చరిత్రలో తమ దేశం తరపున అత్యధిక గోల్స్ సాధించిన రెండో ఫుట్ బాలర్ గా సునీల్ రికార్డుల్లో చేరాడు.

ఇరాన్ స్టార్ ప్లేయర్ అలీ దాయ్ 148 మ్యాచ్ ల్లో 109 గోల్స్ తో అత్యుత్తమ ఆసియా ఫుట్ బాలర్ గా చరిత్ర సృష్టించాడు.

కువైట్ తో భారత్ ఆఖరి గ్రూప్ లీగ్ మ్యాచ్...

గ్రూప్ -ఏ లీగ్ ఆఖరి రౌండ్ పోరులో కువైట్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం రాత్రి 7-30కి ఈ కీలక పోరు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టే గ్రూప్ విజేతగా శనివారం జరిగే సెమీఫైనల్స్ నాకౌట్ పోరులో పాల్గోనుంది.

గ్రూపులీగ్ దశ నుంచే నేపాల్, పాకిస్థాన్ నిష్క్ర్రమించడంతో..కువైట్, భారత్ నాకౌట్ రౌండ్ చేరాయి.

1993 నుంచి 2021 వరకూ జరిగిన మొత్తం 13 శాఫ్ కప్ టోర్నీలలో భారత్ 12సార్లు ఫైనల్స్ చేరడంతో పాటు ఎనిమిదిసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్ గా నిలిచింది. రికార్డుస్థాయిలో 13వసారి ఫైనల్ చేరాలని, 9వసారి విజేతగా నిలవాలని వెటరన్ సునీల్ ఛెత్రీ నాయకత్వంలోని భారత్ తహతహలాడుతోంది.

అంతర్జాతీయ సాకర్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం 101వ ర్యాంక్ లో ఉన్న భారత్..తనకంటే దిగువ ర్యాంకుల్లో ఉన్నజట్లతో శాఫ్ కప్ కోసం పోటీపడుతోంది.

First Published:  26 Jun 2023 5:59 PM IST
Next Story