Telugu Global
Sports

ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ!

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ 50వ పుట్టినరోజు కానుకగా ముంబై క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాంఖడే స్టేడియంలో నిర్వహించారు.

ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ!
X

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ 50వ పుట్టినరోజు కానుకగా ముంబై క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాంఖడే స్టేడియంలో నిర్వహించారు.

భారత క్రికెట్ కే తలమానికంగా నిలిచే ముంబై వాంఖడే స్టేడియంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలువెత్తు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ముంబై క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది. భారత్- శ్రీలంకజట్ల నడుమ జరిగే ప్రపంచకప్ 7వ రౌండ్ మ్యాచ్ ప్రారంభానికి ముందే నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నాడు.

ముంబై క్రికెట్ సంఘం అపురూప కానుక!

భారత క్రికెట్ కు 22 సంవత్సరాలపాటు అసమాన సేవలు అందించి డజన్లకొద్దీ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన సచిన్ కు ఓ అపురూపకానుకను ఇవ్వాలని ముంబై క్రికెట్ సంఘం గత ఏడాదే నిర్ణయించింది.

తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను సంపాదించుకోడంతో పాటు భారత క్రికెట్ ఖ్యాతిని ఎవరెస్టు ఎత్తుకు చేర్చిన సచిన్ 50వ పుట్టినరోజు కానుక ఇవ్వటానికి ఏర్పాట్లు చేసింది.

సచిన్ జీవితంలో ప్రధాన భాగంగా, హోంగ్రౌండ్ గా ఉన్న ముంబై వాంఖడే స్టేడియంలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అహ్మద్ నగర్ కు చెందిన విఖ్యాత చిత్రకారుడు, శిల్పకారుడు ప్రమోద్ కాంబ్లీ...సచిన్ సలహాలు, సూచనల మేరకు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

ఆస్ట్ర్రేలియా స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ బౌలింగ్ లో మాస్టర్ సచిన్ ఓ షాట్ ఆడిన భంగిమను ఈ నిలువెత్తు విగ్రహంలో ప్రతిబింబించేలా రూపొందించారు.

ప్రముఖుల సమక్షంలో...

భారత్- శ్రీలంకజట్ల నడుమ జరిగే 7వ రౌండ్ మ్యాచ్ కు ముందే ముంబై వాంఖడే స్టేడియం లో సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ కార్యదర్శి జే షా, ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అశీష్ షెలార్, కార్యదర్శి అజింక్యా నాయక్, రాజ్యసభ సభుడు శరద్ పవార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

2013 నవంబర్ లో వాంఖడే స్టేడియం వేదికగా తన చిట్టచివరి అంతర్జాతీయ ( టెస్టు) మ్యాచ్ ఆడిన సచిన్ 22 సంవత్సరాలపాటు భారత క్రికెట్ మూలవిరాట్టుగా ఉన్నాడు.

తన కెరియర్ లో 200 టెస్టులు ఆడి 51 సెంచరీలతో పాటు 15వేల 921 పరుగులతో 53.79 సగటు నమోదు చేశాడు. 463 వన్డే మ్యాచ్ ల్లో 49 శతకాలతో సహా 18వేల 426 పరుగులతో 44.83 సగటు సాధించాడు.

ముంబై వేదికగా సచిన్ రికార్డులు...

తాను పుట్టిపెరిగిన ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 11 అంతర్జాతీయ వన్డేలు ఆడిన సచిన్ 455 పరుగులు సాధించాడు. ఓ సెంచరీతో సహా 41.36 సగటు నమోదు చేశాడు.

ఇక..వాంఖడే స్టేడియం వేదికగానే 11 టెస్టులు ఆడిన సచిన్ ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలతో సహా 921 పరుగులు సాధించాడు. 148 పరుగులు అత్యధిక స్కోరుతో 48. 47 సగటు నమోదు చేశాడు.

మాస్టర్ సచిన్ తన ఆఖరి వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ను సైతం ముంబై వాంఖడే స్టేడియం వేదికగానే ఆడాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో సచిన్ శ్రీలంకపై 14 బంతులు ఎదుర్కొని 18 పరుగుల స్కోరుకు లాసిత్ మలింగ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఫైనల్లో భారత్ 6 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలువగలిగింది.

22 అడుగుల ఎత్తున విగ్రహం...

షేన్ వార్న్ బౌలింగ్ లో సచిన్ ఆడిన లాఫ్టెడ్ షాట్ భంగిమతో 22 అడుగుల ఎత్తున కంచు విగ్రహాన్ని తీర్చిదిద్దారు. భారత క్రికెట్ కు 22 సంవత్సరాలపాటు మాస్టర్ సచిన్ చేసిన సేవకు తాము విగ్రహరూపంలో చిరుకానుక ఇస్తున్నట్లు ముంబై క్రికెట్ సంఘం ప్రకటించింది.

ఏప్రిల్ 24న 50వ పడిలోకి ప్రవేశించిన సచిన్ ను భారత ప్రభుత్వం..దేశఅత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' ఇచ్చి సత్కరించింది. రాజ్యసభ సభ్యుడిగా కూడా సచిన్ సేవలు అందించాడు.

ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంలో షేన్ వార్న్, విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియంలో సర్ సీకె నాయుడు, బార్బడోస్ లో సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సచిన్ సైతం విగ్రహాలు ఆవిష్కరించిన క్రికెట్ దిగ్గజాల జాబితాలో చేరిపోయాడు.

స్టేడియం కాదు...రెండో ఇల్లు- సచిన్..

ముంబై వాంఖడే స్టేడియం తనకు రెండో ఇల్లుతో సమానమని మాస్టర్ సచిన్ చెప్పాడు. తాను ఇంటిలో కంటే వాంఖడే స్టేడియంలోనే తన జీవితంలో ఎక్కువ భాగం గడిపినట్లు గుర్తు చేసుకొన్నాడు. హోంగ్రౌండ్ తో తనకు 25 సంవత్సరాల అనుబంధమని, స్టేడియంలో తనపేరుతో ఏర్పాటు చేసిన స్టాండ్ దగ్గరే విగ్రహాన్ని ఏర్పాటు చేయటం తన అదృష్టమని, తనకు ఈ అపురూప కానుకను ఇచ్చిన ముంబై క్రికెట్ సంఘానికి రుణపడి ఉంటానని సచిన్ ధన్యవాదాలు తెలిపాడు.

First Published:  2 Nov 2023 9:03 AM IST
Next Story