ప్రపంచ చాంపియన్ జట్టుకు సచిన్ సత్కారం!
బుధవారం సాయంత్రం 6-30 గంటలకు జరిగే ఈ సత్కారకార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ టెండుల్కర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రారంభ ఐసీసీ అండర్ -19 బాలికల ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టును మాస్టర్ సచిన్ టెండుల్కర్ సత్కరించనున్నాడు. బీసీసీఐ ఈ సత్కార కార్యక్రమం నిర్వహిస్తోంది..
దక్షిణాప్రికా వేదికగా ఐసీసీ నిర్వహించిన అండర్ -19 తొలి బాలికల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతజట్టు సభ్యులపై కానుకల వర్షం కురుస్తోంది.
ఆల్ రౌండర్ షెఫాలీవర్మ నాయకత్వంలో పాల్గొన్న భారత బాలికలజట్టు ఫైనల్లో ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించి ఐసీసీ తొలిట్రోఫీని అందుకొంది.
బీసీసీఐ 5 కోట్ల నజరానా..
భారత అండర్- 19 బాలికల జట్టు , సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నజరానాగా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు. విజేత జట్టు కోసం ఓ సత్కారకార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న ఆఖరి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ అభినందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్ చేరిన విజేత జట్టు..
గత రెండువారాలుగా దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ అండర్ -19 క్రికెట్ టోర్నీలో పాల్గొని విజేతగా నిలిచిన భారతజట్టు సభ్యులు కేప్ టౌన్ నుంచి భారత్ కు చేరుకొన్నారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో బీసీసీఐ నిర్వహించనున్న సత్కారకార్యక్రమంలో పాల్గోనున్నారు.
బుధవారం సాయంత్రం 6-30 గంటలకు జరిగే ఈ సత్కారకార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ టెండుల్కర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు. ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన భారత బాలికల జట్టును సచిన్ సత్కరించనున్నాడు.
ఐసీసీ బాలుర అండర్ -19 ప్రపంచకప్ ను ఇప్పటికే పలుమార్లు గెలుచుకొన్న భారతజట్టు ..బాలికల విభాగంలోనూ విశ్వవిజేతగా నిలవడం భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచిపోనుంది.
మహిళా క్రికెట్ ను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయటానికి ఐసీసీ పలురకాల కార్యక్రమాలు రూపొందించి వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. అందులో భాగంగానే 19 సంవత్సరాల లోపు బాలికలకు ప్రత్యేకంగా ప్రపంచకప్ నిర్వహించడం మొదలు పెట్టింది. ప్రస్తుత 2023 ప్రపంచకప్ నుంచి రెండేళ్లకోసారి టోర్నీని నిర్వహించనున్నారు.