Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లోనూ బెంగళూరుకు అదే బెంగ!

ఐపీఎల్ పురుషుల విభాగంలో మాత్రమే కాదు..మహిళల విభాగంలో సైతం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను వైఫల్యాలు వెంటాడుతున్నాయి.

మహిళా ఐపీఎల్ లోనూ బెంగళూరుకు అదే బెంగ!
X

మహిళా ఐపీఎల్ లోనూ బెంగళూరుకు అదే బెంగ!

ఐపీఎల్ పురుషుల విభాగంలో మాత్రమే కాదు..మహిళల విభాగంలో సైతం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఖరీదైన స్టార్ ప్లేయర్లున్నా వరుస పరాజయాలు తప్పడం లేదు....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పురుషుల, మహిళల విభాగాలలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పరిస్థితి ఒకేతీరుగా ఉంది. గత 15 సీజన్లుగా సాగిన పురుషుల ఐపీఎల్ లో మాత్రమే కాదు..ప్రస్తుత సీజన్లో ప్రారంభమైన తొలి మహిళా ఐపీఎల్ లో సైతం..పరిస్థితి సొమ్ము పోయే శనీ పట్టే అన్నచందంగా తయారయ్యింది. 901 కోట్ల రూపాయల భారీధరకు ఫ్రాంచైజీ హక్కులను దక్కించుకొన్న బెంగళూరు యాజమాన్యం పరిస్థితి దయనీయంగా మారింది.

ఖరీదైన ప్లేయర్లున్నా వెనకడుగే....

2008 నుంచి 2022 సీజన్ వరకూ ఐపీఎల్ పురుషుల విభాగంలో విరాట్ కొహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డూప్లెసిస్, షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్ వెల్ లాంటి అత్యంత ఖరీదైన, ప్రతిభావంతులైన ప్రపంచ మేటి ఆటగాళ్లున్నా..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయింది.

ప్రస్తుత 2023 సీజన్ నుంచే మహిళలకు సైతం ప్రారంభించిన ఐపీఎల్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మందన నాయకత్వంలో పోటీకి దిగిన బెంగళూరు పరాజయాల హ్యాట్రిక్ తో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయి దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.

బ్యాటింగ్ లో బ్యాడ్..బౌలింగ్ లో బ్యాడ్ బ్యాడ్!

ఐదుజట్ల మహిళా ఐపీఎల్ లో ఇప్పటి వరకూ జరిగిన మొదటి ఏడుమ్యాచ్ ల్లో కనీసం ఒక్క గెలుపు లేకుండా అత్యంత చెత్తజట్టుగా స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరుజట్టు అపఖ్యాతిని మూటగట్టుకొంది.

మహిళా ఐపీఎల్ తొలిసీజన్ వేలంలో 3 కోట్ల 40 లక్షల రూపాయల ధరతో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచిన డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తోంది. జట్టులోని ఇతర ప్రపంచ మేటి ప్లేయర్లలో ఆస్ట్ర్ర్రేలియా సూపర్ ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సోఫీ డివైన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ హీథర్ నైట్, భారత స్టార్ ప్లేయర్లు రిచా ఘోష్, రేణుకా సింగ్ ఉన్నారు. అయినా ..బెంగళూరుజట్టు వరుసగా మూడుమ్యాచ్ ల్లో ప్రత్యర్థిజట్లకు 200కు పైగా స్కోర్లు సాధించే అవకాశమిచ్చింది.

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు..బెంగళూరు ప్రత్యర్థికగా 200కు పైగాస్కోర్లు సాధించగలిగాయి. కోటీ 70 లక్షలతో కొనుగోలు చేసిన ఎల్సీ పెర్రీ, 50 లక్షల సోఫీ డివైన్, 40 లక్షల హీథర్ నైట్, 30 లక్షల ఎరిన్ బర్న్ తో పాటు 3 కోట్ల 40 లక్షల రూపాయల స్మృతి మందన సైతం జట్టుకే అలంకరణగా మిగిలిపోయారు.

స్మృతి కోసమే 28.33 శాతం...

బెంగళూరు ఫ్రాంచైజీ ..ప్లేయర్ల వేలం కోసం కేటాయించిన 12 కోట్ల రూపాయల బడ్జెట్ లో 28.33 శాతం మొత్తాన్ని కేవలం ఒక్క ప్లేయర్ (స్మృతి మందన )కోసమే ఖర్చు చేయటం విశేషం.

ఆటతో పాటు అందచందాలున్న స్మృతి మందన 3 కోట్ల 40 లక్షల రూపాయల రికార్డు ధరను దక్కించుకోడంతో పాటు..రాయల్ చాలెంజర్స్ జట్టు పగ్గాలు సైతం అందుకొంది. అయితే..రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు మ్యాచ్ ల్లోనూ బెంగళూరు సారథిగా విజయాలు అందించక పోగా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తోంది.

ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి మూడురౌండ్లలో అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో విఫలమైన బెంగళూరుజట్టు ఆట తీరు మిగిలిన రౌండ్లలో మెరుగు పడకుంటే పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా మిగిలిపోక తప్పదు.

First Published:  10 March 2023 1:49 PM IST
Next Story