Telugu Global
Sports

కెప్టెన్ గా రోహిట్మాన్ రికార్డుల మోత!

అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ కు హిట్ మ్యాన్ అన్న ముద్దుపేరుంది. అంతేకాదు..వైట్ బాల్ క్రికెట్లో డాషింగ్ ఓపెనర్ గా, విజయవంతమైన భారత కెప్టెన్ గాను రికార్డు ఉంది.

కెప్టెన్ గా రోహిట్మాన్ రికార్డుల మోత!
X

క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారత కెప్టెన్ గానూ ఓ సూపర్ హిట్ రికార్డు సాధించాడు. భారత పూర్తిస్థాయి కెప్టెన్ గా 10వ ద్వైపాక్షిక సిరీస్ విజయంతో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా స్వదేశీగడ్డపై భారత్ కు తొలి టీ-20 సిరీస్ ట్రోఫీ అందించాడు....

అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ కు హిట్ మ్యాన్ అన్న ముద్దుపేరుంది. అంతేకాదు..వైట్ బాల్ క్రికెట్లో డాషింగ్ ఓపెనర్ గా, విజయవంతమైన భారత కెప్టెన్ గాను రికార్డు ఉంది.

2021 టీ-20 ప్రపంచకప్ తర్వాత...విరాట్ కొహ్లీ నుంచి భారతజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకొన్న రోహిత్..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు వరుసగా 10 సిరీస్ విజయాలు అందించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఉన్న అత్యధిక విజయాల రికార్డును సైతం రోహిత్ అధిగమించగలిగాడు.

ప్రపంచ మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత్ ను 2-1తో విజేతగా నిలిపాడు. భారతగడ్డపై సఫారీలపై తనజట్టుకు సిరీస్ విజయం అందించిన సారధిగా రోహిత్ రికార్డుల్లో చేరాడు.

10 నెలల్లో...10 సిరీస్ లు....

రోహిత్ నాయకత్వంలో భారతజట్టు గత 10 మాసాల కాలంలో మొత్తం 10 ద్వైపాక్షిక సిరీస్ ల్లో విజయాలు నమోదు చేసింది. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 3-0తో స్వీప్ చేసిన భారత్ ..ఆ తర్వాత వెస్టిండీస్ పైన సైతం వన్డే, టీ-20 ఫార్మాట్లలో 3-0తో క్లీన్ స్వీప్ విజయాలు సాధించింది.

శ్రీలంకతో టీ-20 సిరీస్ ను 3-0, టెస్టు సిరీస్ ను 2-0తో సొంతం చేసుకొన్న భారతజట్టు..ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై ఓడించడం ద్వారా 2-1తో టీ-20, వన్డే సిరీస్ లు కైవసం చేసుకోగలిగింది.

వెస్టిండీస్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 4-1తోను, ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాలతో జరిగిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లను 2-1తోనూ నెగ్గడం ద్వారా ప్రపంచకప్ సన్నాహాలను పూర్తి చేసింది.

సఫారీలపై తొలి సిరీస్ విజయం...

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా భారతగడ్డపై జరిగిన టీ-20 సిరీస్ లో విజేతగా నిలవడం భారత్ కు ఇదే మొదటిసారి. 2015 సిరీస్ లో భారత్ 0-2 తో పరాజయం పాలయ్యింది. 2019లో సిరీస్ ను డ్రాగా ముగించింది. 2022 జూన్ లో జరిగిన సిరీస్ సైతం డ్రా గానే ముగిసింది. ప్రస్తుత 2022 సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా సొంతగడ్డపై తొలి సిరీస్ ట్రోఫీని అందుకోగలిగింది.

ధోనీని మించిన రోహిత్...

ఓ క్యాలెండర్ ఇయర్ లో భారతజట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మహేంద్రసింగ్

ధోనీ సారథ్యంలో భారత్ 2016 సీజన్లో 15 టీ-20ల్లో విజయం సాధించగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2022 సీజన్లో భారత్ 17 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో తొలి టీ-20 విజయంతో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.

మరోవైపు.. రోహిత్ శర్మ 2022లో 23 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీల తో సహా మొత్తం 500కు పైగా పరుగులు సాధించాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో 500 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. దీంతో, ఒక క్యాలెండర్ ఇయర్‌లో 500కు పైగా పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ద్వైపాక్షిక సిరీస్ ల్లో సాధించిన విజయాలు, జైత్రయాత్రను...ఐసీసీ టోర్నీల్లో సైతం కొనసాగించాలని అభిమానులు కోరుకొంటున్నారు.

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరుగనున్న 2022 టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు హిట్ మ్యాన్ నాయకత్వంలోనే టైటిల్ వేటకు దిగుతోంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్...భారత్ కు సైతం ప్రపంచకప్ ను అందించాలని బీసీసీఐ కోరుతోంది.

First Published:  5 Oct 2022 1:00 PM IST
Next Story