Telugu Global
Sports

ఆసియాకప్ లో రోహిత్ శర్మ రికార్డుల మోత!

ఆసియాకప్ వన్డే టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ తో రికార్డుల మోతమోగించాడు. తనజట్టు ఫైనల్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.

ఆసియాకప్ లో రోహిత్ శర్మ రికార్డుల మోత!
X

ఆసియాకప్ లో రోహిత్ శర్మ రికార్డుల మోత!

ఆసియాకప్ వన్డే టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ తో రికార్డుల మోతమోగించాడు. తనజట్టు ఫైనల్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.

వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న 2023-ఆసియాకప్ లీగ్ దశ నుంచి సూపర్ -4 రౌండ్ వరకూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల మోత మోగించాడు.

గ్రూప్ లీగ్ లో భాగంగో నేపాల్ తో జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ నుంచి సూపర్ -4 రౌండ్లో శ్రీలంకతో ముగిసిన పోరు వరకూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా 10వేల పరుగుల మైలురాయిని చేరాడు.

విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్..

పసికూన నేపాల్ పై అజేయ హాఫ్ సెంచరీతో పాటు..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకజట్లతో జరిగిన సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ల్లో సైతం రోహిత్ అర్థశతకాలు బాదాడు. ఓపెనర్ శుఫ్ మన్ గిల్ తో కలసి వరుసగా రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడం ద్వారా భారత్ ను పదోసారి

ఆసియాకప్ ఫైనల్స్ చేర్చాడు.

వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా 10వేల పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. కేవలం 240 ఇన్నింగ్స్ లోనే 30 శతకాలు, 51 అర్థశతకాలతో 10వేల పరుగులు పూర్తి చేశాడు.

ఇప్పటికే 10వేల పరుగులు సాధించిన భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండుల్కర్,సౌరవ్ గంగూలీ, విరాట్ కొహ్లీలతో పాటు..కంగారూ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన నిలిచాడు.

విరాట్ కొహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్ లోనే 10వేల పరుగులతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పితే..రోహిత్ 240 ఇన్నింగ్స్ తో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యధిక సిక్సర్ల మొనగాడు రోహిత్ శర్మ..

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ రెండు సిక్సర్లు బాదడం ద్వారా..పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

శ్రీలంక పేసర్ కసున్ రజిత బౌలింగ్ లో భారీసిక్సర్ బాదడం ద్వారా రోహిత్ 10వేల పరుగుల మైలురాయిని చేరడంతో పాటు షాహీద్ అఫ్రిదీ పేరుతో ఉన్న 26 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.

రోహిత్ మొత్తం 27 సిక్సర్లతో..ఆసియాకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలిచాడు.

భారత 3వ ఓపెనర్ రోహిత్...

వన్డే క్రికెట్లో 10వేల పరుగులు సాధించిన భారత మూడో ఓపెనర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. 10వేల పరుగుల క్లబ్ లో చేరిన భారత 6వ బ్యాటర్ ఘనతనూ రోహిత్ దక్కించుకొన్నాడు.

రోహిత్ కంటే ముందే 10 వేల పరుగులు సాధించిన భారత ఓపెనర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, దాదా సౌరవ్ గంగూలీ ఉన్నారు. 10వేల పరుగులు సాధించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలలో సచిన్ ( 18,426 పరుగులు), విరాట్ కొహ్లీ ( 13,027*), సౌరవ్ గంగూలీ ( 11,363 ), రాహుల్ ద్రావిడ్ ( 10,889 ), మహేంద్రసింగ్ ధోనీ (10,773)ల తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు.

2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్..గత 16 సంవత్సరాలలో 49 సగటుతో మూడు డబుల్ సెంచరీలతో సహా 30 శతకాలు, 51 అర్థశతకాలతో 10 వేల పరుగుల రికార్డు నమోదు చేశాడు.

విరాట్ నుంచి రోహిత్ వరకూ...

వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 10వేల పరుగులను విరాట్ కొహ్లీ 205 ఇన్నింగ్స్ లోనే సాధించాడు. రోహిత్ 241 ఇన్నింగ్స్ లోనూ, సచిన్ టెండుల్కర్ 259 ఇన్నింగ్స్ లోనూ, సౌరవ్ గంగూలీ 263 ఇన్నింగ్స్ లోనూ, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్ లోనూ నమోదు చేశారు.

వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మొనగాళ్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ ( 18,426 పరుగులు ), కుమార సంగక్కర ( 14,234 ), రికీ పాంటింగ్ ( 13,704 ), సనత్ జయసూర్య ( 13,430 ), విరాట్ కొహ్లీ ( 13,027* ), మహేల జయవర్థనే ( 12,650 ), ఇంజమాముల్ హక్ ( 11,739 ), జాక్ కలిస్ ( 11,579 ), సౌరవ్ గంగూలీ ( 11,363 ), రాహుల్ ద్రావిడ్ ( 10,889 ) మొదటి 10 స్థానాలలో కొనసాగుతున్నారు.

సచిన్ ప్రపంచ రికార్డును అధిగమించాలంటే విరాట్ కొహ్లీ మరో 5వేలకు పైగా పరుగులు సాధించాల్సి ఉంది.

First Published:  13 Sept 2023 4:00 PM IST
Next Story