Telugu Global
Sports

ఓపెనర్ గా రోహిత్ 2వేల పరుగుల రికార్డు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్టు లీగ్ లో 2వేల పరుగులు సాధించిన భారత ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

ఓపెనర్ గా రోహిత్ 2వేల పరుగుల రికార్డు!
X

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్టు లీగ్ లో 2వేల పరుగులు సాధించిన భారత ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు....

ఐసీసీ గత నాలుగేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెస్టు లీగ్ లో భారత కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణించడం ద్వారా ఓ అరుదైన రికార్డు సాధించాడు.

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో శతకం బాది..రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో 80 పరుగులు చేయటం ద్వారా 2వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

2019 నుంచి జరుగుతున్న టెస్టు లీగ్ లో భారత ఓపెనర్ గా 2వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

గవాస్కర్ ను అధిగమించిన రోహిత్..

యువఆటగాడు యశస్వి జైశ్వాల్ తో కలసి మొదటి వికెట్ కు బ్యాక్ టు బ్యాక్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రోహిత్..వరుసగా రెండోశతకం సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు.

36 సంవత్సరాల రోహిత్ మొత్తం 143 బంతులు ఎదుర్కొని 9 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 80 పరుగుల స్కోరుకు..శతకానికి 20 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

ఇప్పటి వరకూ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న 43 ఇన్నింగ్స్ లో 2 వేల పరుగుల రికార్డును రోహిత్ కేవలం 40 ఇన్నింగ్స్ లోనే అధిగమించగలిగాడు.

మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 39 ఇన్నింగ్స్ లోనే 2వేల పరుగుల మైలురాయిని చేరిన భారత తొలి ఓపెనర్ గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ నిలిచాడు.

ప్రస్తుత సిరీస్ లో భాగంగా డోమనికా వేదికగా ముగిసిన తొలిటెస్టులో యశస్వి జైశ్వాల్ తో కలసి మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రోహిత్..పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో 139 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. ఆసియా వెలుపల జరిగిన టెస్టు సిరీస్ లో అతిపెద్ద భాగస్వామ్యాలు నమోదు చేసిన ఓపెనర్ ఘనతను సైతం రోహిత్ సొంతం చేసుకోగలిగాడు.

1999 హోం సిరీస్ లో న్యూజిలాండ్ పై భారత ఓపెనింగ్ జోడీ సడగోపన్ రమేశ్- దేవాంగ్ గాంధీల జోడీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే..ఆ రికార్డును రోహిత్-యశస్వీ జోడీసమం చేయగలిగారు.

ధోనీ రికార్డు దాటేసిన రోహిత్...

ఈ క్రమంలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ల లో ధోనీ పేరుతో ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కలసి రోహిత్ 17281 పరుగులు సాధించడం ద్వారా..మాజీ కెప్టెన్ ధోనీ పేరుతో ఉన్న 17వేల 266 పరుగుల రికార్డును తెరమరుగు చేశాడు.

అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత బ్యాటర్ల వరుసలో రోహిత్ 5, ధోనీ 6 స్థానాలలో కొనసాగుతున్నారు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 664 మ్యాచ్ ల్లో 34వేల 357 పరుగులు సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. నయా రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 500 మ్యాచ్ ల్లో 25వేల 461 పరుగులు, ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ 24వేల 208 పరుగులతో మూడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీూ 18వేల 575 పరుగులతో నాలుగు స్థానాలలో ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుత సిరీస్ రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్ వరకూ భారత్ తరఫున 443 మ్యాచులు ఆడిన రోహిత్.. మొత్తం 17,298 పరుగులు చేశాడు. 42.92 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ మొత్తం 52 టెస్టుల్లో 3,620 పరుగులు, 243 వన్డేల్లో 9,825 పరుగులు చేశాడు. 148 టీ20ల్లో 3,853 పరుగులు చేశాడు. దీంతో ఎంఎస్ ధోనీని రోహిత్ అధిగమించాడు. ధోనీ 538 మ్యాచుల్లో 17,266 పరుగులు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ను కూడా రోహిత్ అధిగమించాడు. వార్నర్ 348 మ్యాచుల్లో 17267 పరుగులతో కొనసాగుతున్నాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ లో 2వేల పరుగులు సాధించిన తొలి ఓపెనర్ గా కూడా రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకొన్నాడు.

First Published:  22 July 2023 7:40 PM IST
Next Story