డేవిస్ కప్ టెన్నిస్ కు ఇక రోహన్ గుడ్ బై!
భారత డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న డేవిస్ కప్ టెన్నిస్ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు.
భారత డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న డేవిస్ కప్ టెన్నిస్ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. తన ఆఖరిమ్యాచ్ ను బెంగళూరు వేదికగా ఆడాలని ఉబలాటపడుతున్నాడు....
ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్ నుంచి భారత ప్రధాన ఆటగాళ్లు ఒకరి తరువాత ఒకరుగా తప్పుకొంటున్నారు. గతంలో మహేశ్ భూపతి, లియాండర్ పేస్..ఇప్పుడు డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న అదే నిర్ణయం తీసుకొన్నాడు.
2002లో డేవిస్ కప్ అరంగేట్రం...
బెంగళూరుకు చెందిన రోహన్ బొపన్న 43 సంవత్సరాల వయసులో డేవిస్ కప్ జట్టు నుంచి తప్పుకొని నవతరం ఆటగాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించాడు.
2002 నుంచి గత 21 సంవత్సరాలుగా భారత డేవిస్ కప్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
సింగిల్స్ తో పాటు డబుల్స్ లోనూ భారత్ కు పలు మ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వహించిన రోహన్ కు ప్రపంచ పురుషుల డబుల్స్ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరుంది.
ప్రొఫెషనల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ , పురుషుల డబుల్స్ విభాగాలలో పలు టైటిల్స్ సాధించిన రికార్డు సైతం రోహన్ కు ఉంది.
లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాల తరువాత అత్యధిక ప్రో టైటిల్స్ సాధించిన మొనగాడు రోహన్ మాత్రమే. సెప్టెంబర్లో మొరాకోతో జరుగనున్న
డేవిస్ కప్ అర్హత పోటీలలో తన చివరిమ్యాచ్ ఆడాలని రోహన్ నిర్ణయించాడు.
యూపీనా..బెంగళూరా?
డేవిస్ కప్ మాజీ ఫైనలిస్ట్ భారత్ ప్రస్తుతం ప్రపంచ గ్రూప్ -2 స్థాయికి పడిపోయింది. గ్రూప్ -1లో చోటు కోసం మొరాకోజట్టుతో జరుగనున్న గ్రూప్-2 అర్హత పోటీల వేదికగా ఉత్తరప్రదేశ్ ను ఎంపిక చేశారు. అయితే..రోహన్ బొపన్న మాత్రం తన చిట్టచివరి డేవిస్ కప్ మ్యాచ్ ను సొంతనగరం బెంగళూరు వేదికగా ఆడాలని భావిస్తున్నాడు.
భారతజట్టులోని మిగిలిన సభ్యులంతా బెంగళూరు వేదికగా ఆడటానికి సానుకూలంగా ఉన్నారని..మరి అఖిల భారత టెన్నిస్ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచిచూల్సిందేనని చెప్పాడు.
భారత్ తరపున 32 డేవిస్ కప్ మ్యాచ్ లు..
21 సంవత్సరాల క్రితం భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా 22 ఏళ్ల వయసులో తన తొలిమ్యాచ్ ఆడిన రోహన్ గత సీజన్ వరకూ మొత్తం 32మ్యాచ్ లు ఆడాడు.
భారత్ కు గత రెండు దశాబ్దాలుగా డేవిస్ కప్ ఆడుతున్న తాను తన చివరి మ్యాచ్ ను బెంగళూరు వేదికగా ఆడితే తన అభిమానులందరికీ చూసే అవకాశం ఉంటుందని, ఇదే విషయమై భారతజట్టు కెప్టెన్ తో కూడా సంప్రదించినట్లు రోహన్ వివరించాడు.
ప్రస్తుతం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలో చురుకుగా పాల్గొంటున్న రోహన్ 43 సంవత్సరాల వయసులోనూ డేవిస్ కప్ ఆడటాన్ని మించిన అదృష్టం మరొకటి లేదని తెలిపాడు.
భారత్ తరపున గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్ నెగ్గిన నలుగురు ప్లేయర్లలో రోహన్ కూడా ఒకడు కావటం విశేషం. భారత టెన్నిస్ కు ఎంతో సేవచేసిన రోహన్ బొపన్న లాంటి మేటి ఆటగాడికి తన చివరి డేవిస్ కప్ మ్యాచ్ ను కోరుకొన్న వేదికలో ఆడే అవకాశం ఇవ్వటం సబబుగా ఉంటుందని టెన్నిస్ ప్రముఖులు సైతం అంటున్నారు.
మరోవైపు భారత టెన్నిస్ సంఘం ప్రధాన కార్యదర్శి మాత్రం..మొరాకోతో డేవిస్ కప్ మ్యాచ్ వేదికగా ఉత్తరప్రదేశ్ ను ఇప్పటికే ఖాయం చేశారని వివరించారు.
12 సింగిల్స్, 10 డబుల్స్ విజయాలు..
భారత్ తరపున తన డేవిస్ కప్ కెరియర్ లో 32 సింగిల్స్, డబుల్స్ మ్యాచ్ లు ఆడిన రోహన్ 12 సింగిల్స్, 10 డబుల్స్ విజయాలు సాధించాడు. భారత్ తరపున అత్యధిక డేవిస్ కప్ మ్యాచ్ లు ( 58) ఆడిన రికార్డు లియాండర్ పేస్ పేరుతో ఉంది.
జైదీప్ ముఖర్జీ 43, రామనాథన్ కృష్ణన్ 43, ప్రేమ్ జిత్ లాల్ 41, ఆనంద్ అమృత్ రాజ్ 39, మహేశ్ భూపతి 35 మ్యాచ్ లతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
విజయ్ అమృత్ రాజ్, రోహన్ బొపన్న చెరో 32 మ్యాచ్ లతో సమంగా ఉన్నారు. అయితే..మొరాకో ప్రత్యర్థిగా సెప్టెంబర్లో తన చివరి డేవిస్ కప్ మ్యాచ్ ఆడటం ద్వారా విజయ్ అమృత్ రాజ్ 32 మ్యాచ్ ల రికార్డును రోహన్ అధిగమించనున్నాడు.
కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్ 42 సంవత్సరాల వయసులో సిన్ సినాటీమాస్టర్స్ టైటిల్ నెగ్గిన అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా నెలకొల్పిన రికార్డును.43 సంవత్సరాల వయసులో ఇండియన్ వెల్స్ ఏటీపీ టూర్ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా రోహన్ బొపన్న తెరమరుగు చేశాడు.
ప్రస్తుతం ప్రపంచ పురుషుల డబుల్స్ లో 11వ ర్యాంకర్ గా ఉన్న రోహన్ టాప్ -10 ర్యాంకుల్లో నిలిచే అవకాశం ఉంది.
తాను డేవిస్ కప్ నుంచి విరమించుకొంటున్నా..ఏటీపీ టూర్ టెన్నిస్ లో మాత్రం ఆడుతూనే ఉంటానని రోహన్ స్పష్టం చేశాడు.
డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్ రౌండ్లో డెన్మార్క్ చేతిలో 2-3తో పరాజయం పొందిన భారత్..ప్రపంచ గ్రూప్ -2కు పడిపోయింది. గత ఆరు డేవిస్ కప్ పోటీలలో భారత్ 4 పరాజయాలతో సతమతమవుతోంది.
తనకంటే దిగువ ర్యాంకుల్లో ఉన్న పాకిస్థాన్, కజకిస్థాన్ లాంటి జట్లను చిత్తుచేసిన భారత్ కు..న్యూఢిల్లీ గ్రాస్ కోర్టులు వేదికగా జరిగిన పోరులో మాత్రం డెన్మార్క్ చేతిలో పరాజయం తప్పలేదు.