43 ఏళ్ల వయసులో రోహన్ ' గ్రాండ్ స్లామ్ ' టైటిల్ విన్!
భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 సంవత్సరాల వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 సంవత్సరాల వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు..
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన గ్రాండ్ స్లామ్ ( అమెరికన్ , ఆస్ట్ర్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ ) టెన్నిస్ చరిత్రలో మరే ఆటగాడికీ సాధ్యంకాని రికార్డును భారత డేవిస్ కప్ స్టార్, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న నెలకొల్పాడు.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 2024 సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్ నుంచి వరుస విజయాలతో రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన 43 సంవత్సరాల 225 రోజుల వయసున్న రోహన్ చివరకు టైటిల్ నెగ్గడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.
లేటు వయసులో గ్రాండ్ షో....
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల డబుల్స్ టైటిల్ పోరులో మాథ్యూ ఇబెడెన్ తో జంటగా రోహన్ వరుస సెట్ల విజయంతో తన కెరియర్ లో తొలి గ్రాండ్ స్లామ్ పురుషుల డబుల్స్ ట్రోఫీని అందుకోగలిగాడు.
ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లీ- యాండ్రియా వావాసోర్రీ జోడీని 7-6, 7-5తో రోహన్- మాథ్యూజంట అధిగమించారు. అమెరికన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్ కు 2013, 2023 సీజన్లలో ఫైనల్స్ చేరినా, 2017 సీజన్ లో ఫెంచ్ ఓపెన్ పైనల్స్ లో తలపడినా రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకొన్న రోహన్ ఎట్టకేలకు ఓ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ గెలుచుకోగలిగాడు.
గతంలో లియాండర్ పేస్- మహేశ్ భూపతి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గగా..ఆ తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతగా నిలిచిన మొనగాడిగా రోహన్ రికార్డుల్లో చేరాడు.
అంతేకాదు..డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన నాలుగో భారత ప్లేయర్ ఘనతను సైతం రోహన్ సాధించాడు. లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాల తరువాత టాప్ ర్యాంక్ సాధించిన ఆటగాడిగా రోహన్ నిలిచాడు.
ఈ విజయంతో రోహన్ బొపన్న జోడీకి 2,497,827 ఆస్ట్ర్రేలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వీన్ సబలెంకా
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను బైలో రష్యన్ స్టార్ అర్యానా సబలెంకా నిలుపుకొంది. ఫైనల్లో చైనా సంచలనం జెంగ్ క్విన్ వెన్ ను చిత్తు చేసింది.
ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో సబలెంకాకు ఎదురేలేకపోయింది. 6-3, 6-2తో జెంగ్ ను కంగుతినిపించి ..వరుసగా రెండో ఆస్ట్ర్రేలియన్ ట్రోఫీని అందుకొంది.
2013లో విక్టోరియా అజరెంకా తరువాత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలుపుకొన్న ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది.
సెమీస్ వరకూ సంచలన విజయాలతో దూసుకొచ్చిన చైనా ప్లేయర్ జెంగ్ టైటిల్ సమరంలో అదేస్థాయిలో రాణించలేకపోయింది. గత పదేళ్ల కాలంలో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన తొలి చైనా ప్లేయర్ గా నిలిచింది.12వ సీడ్ జెంగ్ ప్రత్యర్థి, టాప్ సీడ్ సబలెంకాకు ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.
ఈ విజయంతో సబలెంకాకు 3, 150, 000 డాలర్లతో పాటు 2వేల ర్యాంకింగ్ పాయింట్లు సైతం దక్కాయి. రన్నరప్ జెంగ్ 1, 750, 000 ఆస్ట్ర్రేలియన్ డాలర్ల ప్రైజ్ మనీతో పాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది.
గత సీజన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల ద్వారా 76.5 మిలియన్ ఆస్ట్ర్రేలియన్ డాలర్లు సంపాదించిన సబలెంకా ప్రస్తుత సీజన్ తొలి టోర్నీలోనే భారీ మొత్తం ప్రైజ్ మనీతో బోణీ కొట్టగలిగింది.