వీడ్కోలు టోర్నీకి లండన్ వెడలె ఫెదరర్...!
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 సంవత్సరాల కెరియర్ లో ఆఖరి ప్రో టోర్నీ కోసం లండన్ చేరుకొన్నాడు. యూరోప్, ప్రపంచ జట్ల మధ్య లేవర్ కప్ కోసం జరిగే టోర్నీతో ఫెదరర్ స్వస్తిపలుకనున్నాడు.
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 సంవత్సరాల కెరియర్ లో ఆఖరి ప్రో టోర్నీ కోసం లండన్ చేరుకొన్నాడు. యూరోప్, ప్రపంచ జట్ల మధ్య లేవర్ కప్ కోసం జరిగే టోర్నీతో ఫెదరర్ స్వస్తిపలుకనున్నాడు....
ప్రొఫెషనల్ టెన్నిస్ లో గత 24 సంవత్సరాలుగా డజన్ల కొద్దీ టోర్నీలు, వందలాది మ్యాచ్ లు ఆడిన ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ తన వీడ్కోలు టోర్నీ కోసం లండన్ చేరుకొన్నాడు.
అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఫెదరర్ తన కెరియర్ లో 2022 లేవర్ కప్ టోర్నీనే ఆఖరి ప్రొఫెషనల్ టోర్నీ అని ప్రకటించాడు.
రెండున్నర దశాబ్దాల తన టెన్నిస్ ప్రస్థానంలో 41 సంవత్సరాల రోజర్ ఫెదరర్ సాధించని ఘనతలు,రికార్డులు అంటూ ఏవీలేవు. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే 20 టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ఫెదరర్ మొత్తం 103 ఏటీపీ టూర్ టైటిల్స్ సాధించాడు. 1500కు పైగా మ్యాచ్ లు ఆడిన ఫెదరర్ గత మూడు సంవత్సరాలుగా తరచూ గాయాలబారిన పడుతూ పూర్తిస్థాయిలో ఆడలేకపోతున్నాడు.
ప్రపంచస్థాయి పోటీలలో పాల్గొనటానికి తన శరీరం ఏమాత్రం సహకరించని కారణంగా రిటైర్ కావాలని నిర్ణయించుకొన్నట్లు కొద్దిరోజుల క్రితమే ఫెదరర్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
హేమాహేమీలతో లేవర్ కప్...
యూరోప్, అమెరికా దేశాలకు చెందిన అత్యుత్తమ ఆటగాళ్లతో కూడినజట్లతో లేవర్ కప్ పోటీలను ఏటా ఏటీపీ నిర్వహిస్తూ వస్తోంది. ఆ పరంపరలో భాగంగా లండన్ వేదికగా 2022 లేవర్ కప్ పోటీలు జరుగనున్నాయి. ఇదే టోర్నీ ఫెదరర్ కెరియర్ లో ఆఖరి, వీడ్కోలు టోర్నీగా మిగిలిపోనుంది.
సెప్టెంబర్ 23 నుంచి 25 వరకూ జరిగే లేవర్ కప్ టోర్నీలో పాల్గొనే యూరోప్ జట్టులో రాఫెల్ నడాల్, నొవాక్ జోకోవిచ్, కాస్పర్ రూడ్, యాండీ ముర్రే, స్టెఫానోస్ సిటిస్ పాస్ల తో కలసి రోజర్ ఫెదరర్ పాల్గోనున్నాడు.
మరోవైపు అమెరికా దిగ్గజం జాన్ మెకెన్లో నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ఉన్న టీమ్ వరల్డ్ లో డియాగో ష్వార్జ్ మాన్, అలెక్స్ డీ మనూర్, ఫ్రాన్సిస్కో టైఫే, జాక్ సాక్, ఫెలిక్స్ అగ్యుర్, టేలర్ ఫ్రిట్జ్, టామీ పాల్ సభ్యులుగా ఉన్నారు.
యూరోప్- టీమ్ వరల్డ్ జట్లలో విజేతగా నిలిచిన జట్టుకు లేవర్ కప్ బహూకరిస్తారు. రోజర్ ఫెదరర్ కెరియర్ లో 2022 లేవర్ కప్ టోర్నీనే ఆఖరి సమరంగా మిగిలిపోనుంది.