ఐపీఎల్ లో అద్భుతం..రింకూ దెబ్బకు గుజరాత్ డింకీలు!
ఐపీఎల్ చరిత్రలో ఓ అపూర్వ విజయం.ఆఖరి ఆరు బంతుల్లో 29 పరుగులు సాధించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో ఓ అపూర్వ విజయం.ఆఖరి ఆరు బంతుల్లో 29 పరుగులు సాధించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించింది....
ఐపీఎల్ -16వ సీజన్ పోటీలు రోజు రోజుకూ ఉత్కంఠను పెంచుతూ సాగిపోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను కదిపి కుదిపేసింది.
నైట్ రైడర్స్ జోరు..టైటాన్స్ బేజారు..
బాదుడే బాదుడుగా..దంచికొట్టుడుగా సాగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయటం ద్వారా ప్రత్యర్థి కోల్ కతా ఎదుట 205 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.
హోంగ్రౌండ్లో జరిగిన ఈ మూడోరౌండ్ పోరులో కెప్టెన్ హార్థిక్ పాండ్యా అస్వస్థత కారణంగా..లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ స్టాండిన్ కెప్టెన్ గా ఆతిథ్య గుజరాత్ బరిలోకి దిగింది.
ఓపెనర్లు సాహా, శుభ్ మన్ గిల్ భారీస్కోర్లు సాధించడంలో విఫలం కావడంతో..గుజరాత్ బ్యాటింగ్ బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్, విజయ శంకర్ తీసుకొన్నారు. విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అదిరిపోయే అర్ధశతకం నమోదు చేసుకోగా.. సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
విజయ్ శంకర్, సాయి సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీలతో గుజరాత్ భారీ స్కోర్ సాధించగలిగింది. వృద్ధిమాన్ సాహా(17) ఔటయ్యాక శుభ్‌మన్ గిల్(39), సాయి సుదర్శన్(53)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.ఈజోడీ రెండో వికెట్‌కు 67 పరుగులు జత చేసింది. అభినవ్ మనోహార్(14) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్‌లో విజయ్ శంకర్ చెలరేగిపోయాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని..ఆ తర్వాత హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. 20 పరుగులు దండుకోడంతో గుజరాత్ 204 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు, సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
వెంకటేశ్- నితీష్ పోరాటం...
205 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కోల్ కతా రెండు టాపార్డర్ వికెట్లు నష్టపోడం ద్వారా ఎదురీత మొదలు పెట్టింది. అయితే..ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్- కెప్టెన్ నితీష్ రాణా మూడో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో తమ జట్టుకు గట్టి పునాది వేశారు. గెలుపుబాట పట్టించారు.
వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. కెప్టెన్ నితీశ్ రాణా (29 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో తనవంతుగా రాణించాడు.
ఈ ఇద్దరు బ్యాటర్లు రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అతను ఔటయ్యే సరికి కోల్‌కతా స్కోర్.. 154. నైట్ రైడర్స్ విజయం సాధించాలంటే ఆఖరి 25 బంతుల్లో 51 పరుగులు కావాలి. అదే సమయంలో గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.
రింకూసింగ్ విశ్వరూపం....
ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బౌలింగ్ కు దిగిన కెప్టెన్ రషీద్ ఖాన్ మూడు వరుస బంతుల్లో ఆండ్రూ రస్సెల్(1), సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్‌ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో అందరూ..కోల్‌కతా ఓటమి ఖాయమనే అనుకున్నారు. కానీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన పాకెట్ డైనమైట్ రింకూ సింగ్ తన కెరియర్ లోనే అత్యుత్తమ, అసాధారణ ఇన్నింగ్స్ తో అసాధ్యాన్ని సుసాధ్య చేశాడు.
కోల్‌కతా విజయానికి ఆఖరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో.. రింకూ వీరబాదుడు విధ్వంసక బ్యాటింగ్ తో సిక్సర్ల మోత మోగించాడు.
అందిన బంతిని అందినట్లుగా బాది కేవలం 21 బంతుల్లోనే 6 సిక్సర్లు, సింగిల్ బౌండ్రీతో 48 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
చివరి ఏడు బంతుల్లో 40 పరుగులు సాధించడం ద్వారా రింకూసింగ్.. గుజరాత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రింకూ వీరవిహారం ముందు..
విజయ్ శంకర్ సునామీ హాఫ్ సెంచరీ,రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వెలవెలబోయాయి.
రింకూ సింగ్ ఎదుర్కొన్న తన చివరి ఏడు బంతుల్లో ( 6,4,6,6,6,6,6) ఆరు సిక్సర్లు, ఓ బౌండ్రీ బాదటం మరో రికార్డుగా మిగిలిపోతుంది.యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్‌లో రింకూ సునామీ సృష్టించాడు.రింకూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు.
చివరకు కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో 3 వికెట్ల విజయం సొంతం చేసుకోగలిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు సంచలన విజయం అందించిన రింకూ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రింకూ పుణ్యమా అంటూ కోల్ కతా ప్రస్తుత 16వ సీజన్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేయగలిగింది. కాగా మొదటి రెండురౌండ్లలో అలవోక విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ కు ప్రస్తుత సీజన్లో ఇదే తొలి ఓటమి కావడం విశేషం.