Telugu Global
Sports

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు గుండెపోటు.. పెర్త్ ఆసుపత్రికి తరలింపు

పాంటింగ్ ఛాతి భాగంలో అసౌకర్యంగా ఉంటున్నట్లు గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి వెళ్లినట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' రిపోర్ట్ చేసింది.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు గుండెపోటు.. పెర్త్ ఆసుపత్రికి తరలింపు
X

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గుండె పోటుకు గురయ్యారు. వెస్టిండీస్-ఆసీస్ మధ్య పెర్త్‌లో జరుగుతన్న తొలి టెస్ట్ మూడో రోజు (శుక్రవారం) లంచ్ సమయంలో పాంటింగ్ అనారోగ్యానికి గురయ్యారు. చానల్ 7 తరపున ఆయన మ్యాచ్ కామెంట్రీ చెబుతుండగా.. అస్వస్థతకు గురయ్యారు. తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పెర్త్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఫాక్స్‌ స్పోర్ట్స్ తెలిపింది.

పాంటింగ్ ఛాతి భాగంలో అసౌకర్యంగా ఉంటున్నట్లు గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి వెళ్లినట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' రిపోర్ట్ చేసింది. ఆయనకు గుండె పోటు రాలేదని.. ఒంట్లో నలతగా ఉండటంతో ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి స్వయంగా వెళ్లినట్లు సదరు మీడియా వెల్లడించింది. కాగా, రికీ పాంటింగ్ శనివారం కామెంట్రీని కొనసాగిస్తారో లేదో తెలియదని కూడా చెప్పింది.

ఆస్ట్రేలియా క్రికెట్‌కు గత రెండేళ్లుగా కష్టకాలం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్, రాడ్ మార్ష్ గుండెపోటు కారణంగానే మరణించారు. అలాగే 2020 సెప్టెంబర్‌లో డీన్ జోన్స్ హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయారు. ఆస్ట్రేలియా జట్టు మాజీ వికెట్ కీపర్ ర్యాన్ క్యాంప్‌బెల్ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో గుండెపోటుతో మరణించారు. వరుసగా గుండెపోటు కారణంగా మాజీ క్రికెటర్లు మరణిస్తుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేర్కొంటారు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్టులు ఆడి 13,378 పరుగులు చేశారు. ఇందులో 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 375 వన్డేలు ఆడిన పాంటింగ్ 42.03 సగటుతో 13,704 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 టీ20 మ్యాచ్‌లలో 401 పరుగులు చేసిన పాంటింగ్.. రెండు అర్థ సెంచరీలు సాధించారు.

ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచిన 1999, 2003, 2007లో ఆయన జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో 2003, 2007లో జట్టుకు కెప్టెన్‌గా రికీ పాంటింగే వ్యవహరించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కోచ్‌గా కూడా పని చేశారు.

First Published:  2 Dec 2022 4:34 PM IST
Next Story