పంత్ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కు రిపబ్లిక్ డే సత్కారం!
ఈనెలలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బస్సు డ్ర్రైవర్ సుశీల్ మాన్, కండక్టర్ పరంజీత్ లను సత్కరించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు.
కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ ను ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన హర్యానా రోడ్డు రవాణాసంస్థకు చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్లను ఘనంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది....
మంటల్లో చిక్కుకొని పల్టీలు కొడుతున్న కారు నుంచి భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను కాపాడిన హర్యానా రోడ్డు రవాణాసంస్థకు చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్లను ఘనంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనెలలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బస్సు డ్ర్రైవర్ సుశీల్ మాన్, కండక్టర్ పరంజీత్ లను సత్కరించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు.
ప్రాణాలు పణంగా పెట్టి....
ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి వేడుకలు చేసుకొని డిసెంబర్ 30న డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నసమయంలో రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొంది.
అత్యంత ఖరీదైన మెర్సిడెస్ కారును రిషభ్ పంత్ డ్రైవ్ చేస్తూ వచ్చాడు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఆ కారు డివైడర్ ను బలంగా ఢీ కొట్టి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగాయి.
అదే సమయంలో హరిద్వార్ వైపు వెళుతున్న హర్యానా రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ సుశీల్ మాన్, కండక్టర్ పరంజీత్..పల్టీలు కొడుతూ మంటల్లో చిక్కుకొన్న కారును చూసి ఆగారు. ప్రాణాలకు తెగించి మరీ..ఆ కారు వద్దకు వెళ్లి..అద్దాలు పగుల కొట్టి.. తీవ్రగాయాలతో రక్తసిక్తమైన రిషభ్ పంత్ ను బయటకు తీసుకు వచ్చారు.
25 సంవత్సరాల ఆ యువకుడు భారత క్రికెటర్ రిషభ్ పంత్ అని గుర్తించలేకపోయారు.
అప్పటికి స్పృహలోనే ఉన్న రిషభ్ మాత్రం ..తాను భారత క్రికెటర్ నని, తన తల్లికి ఫోను చేయాలంటూ డ్రైవర్ సుశీల్ ను కోరాడు. ఆ వెంటనే సమీపంలోని రూర్కీ ఆస్పత్రిలో పంత్ కు ప్రాథమిక చికిత్స చేసి..డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రయివేటు రూమ్ లో పంత్..
నుదిటి భాగం నుంచి కాలివేలు వరకూ పలురకాల గాయాలతో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ కు..ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీతో సహా పలు రకాలుగా చికిత్స అందించారు.
గత కొద్దిరోజులుగా ఐసీయులో ఉన్న పంత్ ను..కొద్దిగంటల క్రితమే ప్రయివేటు రూమ్ కు మార్చారు.
గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి రిషభ్ పంత్ కు 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు..సందర్శకులతో చికిత్స పొందుతున్న పంత్ కు తగిన విశ్రాంతే లేకుండా పోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కేవంల 25 సంవత్సరాల వయసుకే క్రికెటర్ గా 80 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన రిషభ్ పంత్ ను మృత్యువాత నుంచి బయట పడేసిన ఘనత మాత్రం హర్యానా బస్సు డ్ర్రైవర్, కండక్టర్ సుశీల్, పరంజీత్ లకు మాత్రమే దక్కుతుంది.
ఇప్పటికే ఈ ఇద్దరినీ హర్యానా రోడ్డు రవాణాసంస్థ అభినందించింది. ఈనెలలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం ఈ ఇద్దరినీ ఘనంగా సత్కరించనుంది.
తమదారిన తాము పోకుండా..బస్సును ఆపి మరీ..మంటల్లో చిక్కుకొన్న కారు నుంచి రిషభ్ పంత్ ను కాపాడిన డ్రైవర్, కండక్టర్ లపై పలు వర్గాల నుంచి అభినందనలు, ప్రశంసల వర్షం కురుస్తోంది.
రిషభ్ పంత్ లాంటి అత్యంత విలువైన, బంగారుభవిష్యత్ కలిగిన యువఆటగాడు ప్రాణాలతో మిగిలాడంటే..అది కేవలం బస్సు డ్రైవర్ సుశీల్ మాన్, పరంజీత్ ల పుణ్యమేనని చెప్పక తప్పదు.