Telugu Global
Sports

గౌహతివన్డేలో రికార్డుల మోత!

భారత్- శ్రీలంకజట్ల మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలివన్డేలో పరుగుల మోతతో పాటు పలు అరుదైన రికార్డులు సైతం నమోదయ్యాయి.

గౌహతివన్డేలో రికార్డుల మోత!
X

భారత్- శ్రీలంకజట్ల మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలివన్డేలో పరుగుల మోతతో పాటు పలు అరుదైన రికార్డులు సైతం నమోదయ్యాయి.

వన్డే క్రికెట్లో 4వ ర్యాంకర్ భారత్, 8వ ర్యాంకర్ శ్రీలంకజట్ల మధ్య గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా జరిగిన 2023 సిరీస్ తొలివన్డేలో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 373 పరుగుల భారీస్కోరు సాధిస్తే..374 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన శ్రీలంక 306 పరుగులు చేయగలిగింది. రెండుజట్లూ కలసి 679 పరుగులు చేయగలిగాయి.

భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వన్డేల్లో తన 45వ శతకం బాదితే...శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక 108 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

రోహిత్- గిల్ సెంచరీభాగస్వామ్యం..

భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ 83, శుభ్ మన్ గిల్ 70 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

అంతేకాదు..శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే క్రికెట్లో భారతజట్టు 300కు పైగా స్కోరును 22వసారి నమోదు చేయడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

ఉమ్రాన్ మాలిక్ మరో రికార్డు...

భారత యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంగా బంతులు విసరడంతో తన రికార్డును తానే మెరుగు పరచుకొంటూ వస్తున్నాడు. శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ లో 155 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేయడం ద్వారా భారత ఫాస్టెస్ట్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే..గౌహతీవన్డేలో ఉమ్రాన్ గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడం ద్వారా తన రికార్డును తానే తిరగరాయగలిగాడు. ఆట 14వ ఓవర్లో ఉమ్రాన్ వేసిన ఓ బంతి 156 కిలోమీటర్ల వేగంతో నమోదయ్యింది.

9500 పరుగుల రోహిత్ శర్మ...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ 83 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా వన్డేల్లో 9500 పరుగుల రికార్డును చేరుకోగలిగాడు. 3 సిక్సర్లు, 9 బౌండ్రీలతో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ఇప్పటికే 29 శతకాలు బాదిన రోహిత్ 30 శతకానికి 17 పరుగుల దూరంలో అవుటయ్యాడు. అయితే వన్డేలలో 47వ హాఫ్ సెంచరీ సాధించగలిగాడు.

వన్డేలలో 9500 పరుగుల మైలురాయిని చేరిన భారత ఆరో క్రికెటర్ గా రోహిత్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. రోహిత్ కంటే ఈ ఘనత ముందే సాధించిన భారత దిగ్గజ బ్యాటర్లలో సచిన్ టెండుల్కర్ ( 18వేల 426 పరుగులు ), విరాట్ కొహ్లీ ( 12వేల 584 ), సౌరవ్ గంగూలీ ( 11వేల 221 ), రాహుల్ ద్రావిడ్ ( 10వేల 768 ), మహేంద్ర సింగ్ ధోనీ ( 10వేల 599 ) ఉన్నారు. రోహిత్ 9వేల 537 పరుగులతో ఉన్నాడు.

రోహిత్ ప్రస్తుత గౌహతీ వన్డే వరకూ 236 మ్యాచ్ లు, 299 ఇన్నింగ్స్ లో 29 శతకాలు, 47 అర్థశతకాలతో 48.90 సగటుతో 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.

శ్రీలంకపై 94వ విజయం...

వన్డే క్రికెట్లో శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ కు అది 94వ విజయం.. ఇప్పటి వరకూ శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన మ్యాచ్ ల్లో భారత్ కు 57 పరాజయాలు సైతం ఉన్నాయి.స్వదేశీగడ్డపై శ్రీలంకతో ఆడిన 52 వన్డేల్లో భారత్ కు 75 శాతం విజయాల రికార్డు ఉంది. 37 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మొత్తం మీద..కొత్తసంవత్సరంలో వన్డే ప్రపంచకప్ సన్నాహాలను రెండుసార్లు భారత్ తొలిగెలుపుతో, రికార్డుల మోతతో జోరుగానే ప్రారంభించగలిగింది.

First Published:  11 Jan 2023 7:12 AM GMT
Next Story