ఓటమి బాధ.. రవీంద్ర జడేజాపై అక్కసు వెళ్లగక్కుతున్న ఆసీస్ మీడియా
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా జడేజాకు మద్దతుగా నిలిచాడు. క్రీమ్ రాయడం వల్ల బంతి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అనుకోవడం పెద్ద పొరపాటని అన్నాడు.
2021/22 సీజన్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు (డే/నైట్)లో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఓడిపోయింది. ఆనాడు ఆసీస్ మీడియా భారత జట్టును హేళన చేస్తూ వార్తలు గుప్పించింది. మరోవైపు దారుణ ఓటమిపై భారత మీడియాలో కూడా జట్టుకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. కానీ, భారత జట్టు ఆసీస్ మీడియా, ఫ్యాన్స్ చేస్తున్న అవహేళనను కూడా పక్కన పెట్టి ఆ సిరీస్‌ను 2-1తో గెలిచి గట్టి సమాధానం చెప్పింది.
సీన్ కట్ చేస్తే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరిగింది. భారత స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు కేవలం 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై సాధించిన భారీ ఇన్నింగ్స్ విజయాల్లో ఇది మూడోది. కాగా, భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ను మీడియాతో సహా కొంత మంది ఆసీస్ మాజీ క్రికెటర్లు కూడా పొగుడుతున్నారు. ఆసీస్ మీడియా మాత్రం భారత జట్టుపై బాల్ ట్యాంపరింగ్ నిందలు వేస్తోంది.
జట్టులోకి పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా.. బౌలింగ్ చేసే సమయంలో చేతులకు క్రీమ్ రాసుకున్నాడని.. అందుకే అతడు అన్ని వికెట్లు తీయగలిగాడని ఆసీస్ మీడియాలో కథనాలు రాశారు. పైగా డీఆర్ఎస్ సిస్టమ్ కూడా సరిగా పని చేయలేదని.. కొన్ని నాటౌట్లను కూడా అవుట్లుగా ఇచ్చేసిందని పనిలో పనిగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌పై ఆసీస్ జర్నలిస్టులు కథనాలు రాశారు. రవీంద్ర జడేజా వేళ్లకు క్రీమ్ రాసుకోవడం టీవీల్లో స్పష్టంగా కనపడిందని.. అయినా సరే అతడికి కేవలం 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టిందని కూడా ఆరోపించింది.
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ మాత్రం జడేజాను వెనుకేసుకొచ్చాడు. వేలికి వాపు ఉండటంతోనే అతడు మహ్మద్ సిరాజ్ నుంచి ఆయింట్‌మెంట్ తీసుకొని రాసుకున్నాడని... అతడు ఆ క్రీమ్‌ను బంతికి పూసినట్లు ఎక్కడా కనపడలేదని వాదించాడు. అతడు అంపైర్‌కు ముందుగా చెప్పకపోవడమే అతడు చేసిన తప్పని కూడా అన్నాడు.
ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా జడేజాకు మద్దతుగా నిలిచాడు. క్రీమ్ రాయడం వల్ల బంతి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అనుకోవడం పెద్ద పొరపాటని అన్నాడు. క్రికెట్ గురించి ఓనమాలు కూడా తెలియని నిరక్ష్యరాస్యులే ఇలాంటి చెత్త వాదలను చేస్తారని మండిపడ్డాడు. ఇదే పిచ్‌పై, ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ మర్ఫీ కూడా ఏడు వికెట్లు తీసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసీస్ ఓటమిని తట్టుకోలేకే వారి మీడియా ఇలాంటి అభాండాలు వేస్తోందని అన్నాడు. ఉపఖండంలోని జట్లపై తమ అక్కసు వెళ్లగక్కడం ఆసీస్ మీడియాకు పరిపాటే అని చెప్పుకొచ్చాడు.
If you look closely, there is a cream on Siraj's hand which stood out clear as day on the TV. Jadeja applied it to his finger, at no stage did he put it on the ball. No need for further discussion. #AUSvIND pic.twitter.com/to3xCMMm2a
— Brad Hogg (@Brad_Hogg) February 10, 2023