Telugu Global
Sports

ఛేద‌న సాధ్య‌మే.. ఛేదిస్తే రికార్డే.. - టీమ్ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి

చివ‌రిరోజు 280 ప‌రుగులు చేయ‌డం క‌ష్టం కాద‌ని చెప్పారు. అది సాధ్య‌ప‌డే విష‌య‌మేన‌ని తెలిపారు. భార‌త్ వికెట్ల‌ను కాపాడుకుని ల‌క్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం.. ఇది ప్రపంచ రికార్డు ఛేజింగ్ అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఛేద‌న సాధ్య‌మే.. ఛేదిస్తే రికార్డే.. - టీమ్ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి
X

ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో చివ‌రి రోజైన ఆదివారం ఉత్కంఠ‌భ‌రిత పోరు జ‌ర‌గ‌నుంది. విజేత‌ను తేల్చేందుకు చివ‌రి రోజు ఆట కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతం 3 వికెట్లు న‌ష్ట‌పోయి 164 ప‌రుగుల‌తో ఉన్న భార‌త్‌.. మ‌రో 280 ప‌రుగులు చేస్తే ప్ర‌పంచ చాంపియ‌న్‌గా నిలుస్తుంది. ఇదే క్ర‌మంలో ఏడు వికెట్ల‌ను ప‌డ‌గొడితే ఆస్ట్రేలియాకు చాంపియ‌న్‌షిప్ ద‌క్కుతుంది.

ఈ క్ర‌మంలో టీమ్ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. చివ‌రిరోజు 280 ప‌రుగులు చేయ‌డం క‌ష్టం కాద‌ని చెప్పారు. అది సాధ్య‌ప‌డే విష‌య‌మేన‌ని తెలిపారు. భార‌త్ వికెట్ల‌ను కాపాడుకుని ల‌క్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం.. ఇది ప్రపంచ రికార్డు ఛేజింగ్ అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆదివారం తొలి సెషన్‌ని కాచుకుంటే చాలని, ఎందుకంటే పిచ్ పరిస్థితి అలా ఉంద‌ని చెప్పారు. నాలుగో రోజు ఆటలో రోహిత్ శర్మ, పుజారా తమ తప్పిదాల వల్లే పెవిలియన్‌కు చేరారని వివ‌రించారు.

గెలుపు మ‌న‌దే : ష‌మీ

ఈ మ్యాచ్‌లో గెలుపు మ‌న‌దేనంటూ పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ స్పందించాడు. ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ వందశాతం నమ్మకంతో ఉండాలని, తప్పకుండా మనం విజయం సాధిస్తామ‌ని తెలిపాడు. ప్రపంచంలోని అన్ని మైదానాల్లో మంచి ప్రదర్శనే ఇస్తున్నామ‌ని, అందుకే మనం ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని చెప్పాడు. బంతి తర్వాత బంతి ఆడుకుంటూ పోతే 280 పరుగులు చేయడం కష్టం కాదని తెలిపాడు. భారీ టార్గెట్ ఉందని కంగారుపడకుండా నెమ్మ‌దిగా ఆడితే స‌రిపోతుందని చెప్పాడు.

ఆశే శ్వాస‌గా భార‌త అభిమానులు..

ఈ మ్యాచ్‌లో క్రీజులో విరాట్ కోహ్లి, రహానె ఉండటంతో భార‌త్‌తో పాటు భారత అభిమానులు కూడా గెలుపుపై ఆశ‌తోనే ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, శార్దూల్ ఠాకూర్‌తో పాటు శ్రీ‌క‌ర్ భ‌ర‌త్ కూడా ఉండ‌టంతో ఛేదన క‌ష్ట‌మేమీ కాద‌ని భావిస్తున్నారు. భార‌త అభిమానుల ఆశ‌లు ఫలించాల‌నే కోరుకుందాం.

First Published:  11 Jun 2023 3:30 PM IST
Next Story