Telugu Global
Sports

రంజీట్రోఫీ చరిత్రలో ముంబై 'టెయిల్ ఎండర్ల' సరికొత్త రికార్డు!

భారత అత్యంత పురాతన క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఆఖరి వికెట్ కు ముంబైజోడీ ఈ ఘనత సాధించారు.

రంజీట్రోఫీ చరిత్రలో ముంబై టెయిల్ ఎండర్ల సరికొత్త రికార్డు!
X

భారత అత్యంత పురాతన క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఆఖరి వికెట్ కు ముంబైజోడీ ఈ ఘనత సాధించారు.

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా పరుగులు సాధించేది, సాధించగలిగేదీ టాపార్డర్ ఆటగాళ్లే అనుకొంటే అంతకుమించిన పొరపాటు మరొకటి లేదని ముంబైలోయర్ ఆర్డర్ బ్యాటర్లు నిరూపించారు. దేశవాళీ రంజీట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యుత్తమ రికార్డు నమోదు చేశారు.

టెయిల్ ఎండర్ల ధూమ్ ధామ్ బ్యాటింగ్...

బ్యాటింగ్ ఆర్డర్ ఆఖరి రెండుస్థానాలలో ఆటగాళ్లు నామమాత్రంగానే పరుగులు సాధించడం మనకు తెలుసు. ఎందుకంటే బ్యాటింగ్ లో అంతగా ప్రావీణ్యం లేని, స్పెషలిస్ట్ బౌలర్లు మాత్రమే 10, 11 స్థానాలలో బ్యాటింగ్ కు దిగుతూ ఉంటారు. అయితే..ముంబై రంజీజట్టులోని టెయిల్, ఎండర్లు మాత్రం టాపార్డర్ బ్యాటర్లను మించిపోయి బ్యాటింగ్ చేయడం ద్వారా అరుదైన రికార్డు సాధించారు.

2024 రంజీసీజన్ క్వార్టర్ ఫైనల్ పోరులో బరోడాపై ముంబై జోడీ తుషార్ దేశ్ పాండే- తనుశ్ కోటియాన్ చరిత్ర సృష్టించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీట్రోఫీలో రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.

ఆఖరి వికెట్ కు 232 పరుగుల భాగస్వామ్యం..

ముంబై టెయిల్ ఎండర్లు తుషార్- తనుశ్ ఆఖరి వికెట్ కు 232 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ముంబై 606 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది. 10వ వికెట్ కు తనుశ్- తుషార్ జోడీ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో వారేవ్వా అనిపించుకొన్నారు.

ఆఫ్ స్పిన్నర్ తనుశ్ 115 బంతుల్లో శతకం సాధిస్తే..ఫాస్ట్ బౌలర్ తుషార్ 112 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరూ కలసి 232 పరుగులు జోడించడం ద్వారా రంజీట్రోఫీ చరిత్రలోనే 10వ వికెట్ కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డుల్లో చోటు సంపాదించారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీట్రోఫీలో 10వ వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్య రికార్డు ఢిల్లీ జోడీ అజయ్ శర్మ- మనిందర్ సింగ్ ల పేరుతో ఉంది. 1992లో ముంబై ప్రత్యర్థిగా ఢిల్లీ జోడీ అత్యధిక పరుగుల రికార్డు సాధించగలిగారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 10వ వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యం, ప్రపంచ రికార్డు సాధించిన ఘనత అలన్ కిప్పాక్స్- హాల్ హుకర్ జోడీ పేరుతో ఉంది. ఆస్ట్ర్రేలియా దేశవాళీ క్రికెట్లో భాగంగా 1928లో విక్టోరియాతో జరిగిన పోటీలో న్యూసౌత్ వేల్స్ తరపున అలన్- హుకర్ జోడీ ఆఖరి వికెట్ కు సాధించిన 307 పరుగుల భాగస్వామ్యమే నేటికి ప్రపంచ రికార్డుగా కొనసాగుతోంది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆఖరి వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసిన ఆరవజోడీగా తుషార్- తనిశ్ జంట రికార్డుల్లో చేరారు. ఈ జోడీ బ్యాటింగ్ ప్రతిభతో ముంబైజట్టు రంజీట్రోఫీ సెమీస్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో తమిళనాడుతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  28 Feb 2024 8:55 AM IST
Next Story