నానాటికీ తీసికట్టు..హైదరాబాద్ రంజీజట్టు!
రెండుసార్లు రంజీ విజేత, ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లకు చిరునామా హైదరాబాద్ దేశవాళీ క్రికెట్లో వెలవెలబోతోంది. ప్రస్తుత రంజీ సీజన్లో పాతాళానికి పడిపోయింది.
రెండుసార్లు రంజీ విజేత, ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లకు చిరునామా హైదరాబాద్ దేశవాళీ క్రికెట్లో వెలవెలబోతోంది. ప్రస్తుత రంజీ సీజన్లో పాతాళానికి పడిపోయింది. కేవలం ఒకే ఒక్కపాయింటుతో ప్లేటు గ్రూపు స్థాయికి దిగజారిపోయింది..
భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహ్మద్ అజరుద్దీన్ నేతృత్వంలోని హైదరాబాద్ క్రికెట్ పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. భారత క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం, గుర్తింపు సంపాదించుకొన్న హైదరాబాద్ క్రికెట్ ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి.
ఎందరో దిగ్గజ క్రికెటర్లు....
హైదరాబాద్ క్రికెట్ అనగానే..మన్సూర్ అలీఖాన్ పటౌడీ, అబ్బాస్ అలీ బేగ్, జయంతిలాల్, ఎమ్ ఎల్ జైసింహా, సయ్యద్ అబీద్ అలీ, ఎమ్వీ నరసింహారావు, పిచ్చయ్య కృష్ణమూర్తి, గోవింద రాజ్, మహ్మద్ అజరుద్దీన్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి.
అయితే..గత దశాబ్దకాలంగా హైదరాబాద్ క్రికెట్ లో చోటు చేసుకొన్న రాజకీయాలు, ముఠాల కుమ్ములాటలతో క్రికెట్ ప్రమాణాలు దారుణంగా దిగజారిపోతున్నాయి.
వీవీఎస్ ల్క్ష్మణ్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, మహ్మద్ అజరుద్దీన్ లాంటి అపారఅనుభవం కలిగిన దిగ్గజాలు ఉండీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది.
రెండుసార్లు రంజీ విజేత...
జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీని రెండుసార్లు గెలుచుకొన్న ఘనత హైదరాబాద్ కు ఉంది. 1937-38, 1986-87 సీజన్లలో రంజీట్రోఫీని హైదరాబాద్ జట్టే అందుకొంది. ఆ తర్వాత 1999-2000 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. పలుమార్లు దేశంలోని మొదటి నాలుగు అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా నిలుస్తూ వచ్చినా..గత దశాబ్దకాలంగా ప్రమాణాలు అడుగంటిపోతూ వస్తున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ సంఘంలోని రాజకీయాలు తట్టుకోలేక అంబటి రాయుడు ఐపీఎల్ కే పరిమితమైతే..భారత టెస్టు బ్యాటర్ హనుమ విహారీ ఆంధ్రాకు పలాయనం చిత్త గించాడు. ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ ఉనికిని కాపాడుతున్న ఏకైక ఆటగాడు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రమే.
పతనానికి పరాకాష్ట....
ప్రస్తుత రంజీ సీజన్లో ఎలైట్ గ్రూపు జట్టుగా లీగ్ దశలో ఏడుమ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ ఆరు పరాజయాలు చవిచూసింది. కేవలం తమిళనాడుతో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా ఒకే ఒక్కపాయింటుతో సరిపెట్టుకొంది.
అగ్రశ్రేణిజట్ల ఎలైట్ గ్రూపు నుంచి ద్వితీయ శ్రేణిజట్ల ప్లేట్ గ్రూపుస్థాయికి పడిపోయింది. వచ్చే సీజన్ రంజీ టోర్నీలో హైదరాబాద్ ప్లేట్ గ్రూపు నుంచి ఆడాల్సి ఉంది.
తెలంగాణా రాష్ట్ర్రంలోని జిల్లాల కంటే కేవలం హైదరాబాద్ నగరానికే క్రికెట్ సంఘం, ఆటగాళ్లు పరిమితం కావడం ప్రస్తుత దుస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్ క్రికెట్ ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలో ఆలోచించకుండా క్రికెట్ సంఘంలోని ప్రత్యర్థి ముఠాను ఎలా దెబ్బతీయాలన్న ఆలోచనతోనే అధికారం చేపట్టిన వర్గాలు ప్రవర్తిస్తూ వస్తున్నాయి.
బీసీసీఐ నుంచి వివిధ రూపాలలో ఏడాదికి కోట్ల రూపాయలు నిధులు వస్తున్నా..క్రికెట్ ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారడం విమర్శలకు తావిస్తోంది.
గతంలో జూనియర్ స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన పలువురు క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ నుంచి తెరమీదకు వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు.
ఆటగాళ్లతో మ్యూజికల్ చెయిర్స్...
హైదరాబాద్ కు ప్రస్తుతం కుదురైన జట్టు అంటూ ఏదీలేదు. ప్రస్తుత సీజన్లో ఆడిన ఏడుకు ఏడుమ్యాచ్ ల్లోనూ ముగ్గురు మినహా మిగిలిన ఆటగాళ్లను మ్యాచ్ మ్యాచ్ కూ మారుస్తూనే రావడం అసలుకే ముప్పు తెచ్చింది.
కెప్టెన్ తన్మయ్ అగర్వాల్, రోహిత్‌రాయుడు మినహా ప్రతీ మ్యాచ్‌కు కొత్త ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకోడంతో ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం ఆవిరైపోతూ వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా 28 మంది ఆటగాళ్లతో తుది జాబితా తయారు చేసి.. ఆటు ఇటూ మార్చిన హెచ్‌సీఏ ఏకంగా 13 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది. సాధారణంగా అన్ని జట్లు 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తే..హైదరాబాద్ క్రికెట్ సంఘం మాత్రం 20మంది సభ్యులజట్టును ఎంపిక చేసినా..ఘోరపరాజయాలు తప్పడం లేదు.
మహ్మద్ సిరాజ్ అలా...ఈ ముగ్గురు ఇలా..
ప్రస్తుత హైదారాబాద్ క్రికెట్లో నాణ్యమైన క్రికెటర్లుగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాటర్లు తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, కార్తికేయ కాక్ మాత్రమే కనిపిస్తారు.
మహ్మద్ సిరాజ్ జాతీయజట్టులో కీలక బౌలర్ కావడంతో అందుబాటులో లేకుండా పోవడం హైదరాబాద్ ను దెబ్బతీస్తూ వస్తోంది.
మరోవైపు..బ్యాటింగ్ లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, కార్తికేయ మాత్రమే రాణిస్తూ రావడం జట్టు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
చివరిసారి 2010-11లో ప్లేట్ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్..2015-16లో 25వ స్థానానికి దిగజారిపోయింది. 2019-20 సీజన్‌లో నిరాశపరిచిన హైదరాబాద్..2021లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి ఎలైట్ గ్రూపులోకి వచ్చి చేరింది. అయితే.. ఒకే ఒక్క సీజన్ ముచ్చటగా ఎలైట్ పోరు ముగిసిపోయింది.
మహ్మద్ అజరుద్దీన్ లాంటి దిగ్గజ క్రికెటర్ అధ్యక్షుడిగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ ఇంతగా పతనం కావడం, దిగజారిపోవడం మరీ విషాదం.