మిణుకు మిణుకుమంటున్న రాజస్థాన్ ప్లే-ఆఫ్ ఆశలు!
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ దశను గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. ఆఖరి రౌండ్ పోరులో పంజాబ్ ను 4 వికెట్ల తేడాతో అధిగమించడం ద్వారా ప్లే-ఆఫ్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ దశను గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. ఆఖరి రౌండ్ పోరులో పంజాబ్ ను 4 వికెట్ల తేడాతో అధిగమించడం ద్వారా ప్లే-ఆఫ్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.....
ఐపీఎల్ -2023 సీజన్ లీగ్ ను విజయాలతో మొదలు పెట్టి మిడిల్ రౌండ్లలో పాలపొంగులా చల్లారి పోయిన గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్..తన ఆఖరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించింది.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 14వ రౌండ్ మ్యాచ్ లో భారీతేడాతో నెగ్గాల్సి ఉండగా..ప్రత్య్రర్థి పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల విజయం మాత్రమే సాధించగలిగింది.
నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోడంలో రాజస్థాన్ రాయల్స్ ఆశించిన స్థాయిలో సఫలం కాలేకపోయింది. మొత్తం 14 రౌండ్లలో 14 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ ఐదోస్థానంలో నిలిచింది.
ముంబై, బెంగళూరు ఓడితేనే....
ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తమ ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో పరాజయాలు పొందితేనే..రాజస్థాన్ రాయల్స్ కు ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశం ఉంది.
పంజాబ్ తో జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే సాధించింది.
భారీస్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్ట్ తన బౌలింగ్ లోనే పట్టిన సూపర్ రిటర్న్ క్యాచ్‌కు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) ఇన్నింగ్స్ ముగిసింది.కెప్టెన్ శిఖర్ ధవన్ (17) సైతం కుదురుకోలేకపోయాడు. అథర్వ తైడె (19), లియామ్ లివింగ్‌స్టోన్ (9) సైతం వెంట వెంటనే అవుట్ కావడంతో పంజాబ్ 50 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
చివరి 12 బంతుల్లో 43 పరుగులు.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ సామ కరన్, జితేశ్ శర్మ దూకుడుగా ఆడి తమ జట్టును ఆదుకున్నారు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కరన్ ఆరంభంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినా ఆ తర్వాత బ్యాట్ ఝళిపించాడు. మరో బ్యాటర్ జితేశ్ శర్మ భారీషాట్లతో చెలరేగిపోయాడుయ పంజాబ్ బ్యాటర్లు చివరి రెండో ఓవర్లలో 43 పరుగులు దండుకోగలిగారు.
లెగ్ స్పిన్నర్ చాహల్ వేసిన 19వ ఓవర్లో ఈ ఇద్దరూ 4,6,6,6,4 రాబట్టగా.. బౌల్ట్ వేసిన 20 ఓవర్‌లో షారుక్ 4,6,4 తో మోత మోగించాడు. వీరిద్దరూ అజేయమైన ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 73 పరుగులు సాధించారు.
సామ్ కరన్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జితేశ్ శర్మ (28 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షారుక్ ఖాన్ (23 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 187 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో పేసర్ నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు, జంపా, బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
19.4 ఓవర్లలో 189 పరుగులు...
మ్యాచ్ నెగ్గాలంటే 189 పరుగులు చేయాల్సిన రాయల్స్ కు ప్రారంభ ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది.ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రెండో ఓవర్లోనే వీరబాదుడు ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్ నష్టపోయింది.
తొలి ఓవర్‌లో యశస్వి మూడు బౌండ్రీలతో చెలరేగినా... రెండో ఓవర్‌లో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (0) డకౌటయ్యాడు. దీంతో పడిక్కల్‌తో కలిసి జైస్వాల్ రెండో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ధనాధన్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించిన పడిక్కల్ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకొని వెనుదిరిగాడు. కెప్టెన్ శాంసన్ (2) వెంటనే అవుటయ్యాడు.
యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటగా.. హెట్‌మైర్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. ఆఖర్లో జురేల్ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ రబడ 2 వికెట్లు పడగొట్టాడు. కరెన్, ఎలిస్, అర్షదీప్, రాహుల్ చహార్ తలో వికెట్ సాధించారు. రాజస్థాన్ చివరకు 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులతో 4 వికెట్ల విజయం సాధించింది.
దేవదత్ పడిక్కల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే డబుల్ హెడర్‌లో ఢిల్లీతో చెన్నై, కోల్‌కతాతో లక్నో తలపడనున్నాయి.