Telugu Global
Sports

రాజస్థాన్ రాయల్స్ రివర్స్ గేర్!

ఐపీఎల్ మొదటి ఐదురౌండ్లలో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో డీలా పడింది

రాజస్థాన్ రాయల్స్ రివర్స్ గేర్!
X

ఐపీఎల్ మొదటి ఐదురౌండ్లలో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో డీలా పడింది. బెంగళూరు చేతిలో 7 వికెట్ల పరాజయం చవిచూసింది..

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచె మొదటి ఐదురౌండ్ల పోటీలలో నాలుగు విజయాలతో అదరగొట్టిన గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్..వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన 7వ రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో హోరాహోరీగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ లో చతికిలపడి 7 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.

డూప్లెసీ- మాక్స్ వెల్ బాదుడే బాదుడు...

ఈ కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య బెంగళూరు 20 ఓవర్లలో 189 పరుగుల భారీస్కోరు సాధించింది. స్టార్ ఓపెనర్ విరాట్ కొహ్లీ తొలిబంతికే డకౌట్ కాగా..కెప్టెన్ డూప్లెసిస్- ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ మెరుపు హాఫ్ సెంచరీలతో మ్యాచ్ విన్నింగ్స్ స్కోరు అందించారు.

గత ఆరుమ్యాచ్ ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీ..మ్యాచ్ తొలి ఓవర్ తొలిబంతికే రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ కు ఎల్బీగా చిక్కి పెవీలియన్ దారి పట్టాడు. మొత్తం 7 మ్యాచ్ ల్లో కొహ్లీ 4 అర్థశతకాలతో 279 పరుగులు సాధించాడు.

ప్రస్తుత సీజన్ మొదటి ఏడుమ్యాచ్ ల్లో విరాట్ డకౌట్ కావడం ఇది మూడోసారి కావడం విశేషం. అయితే డూప్లెసీ 39 బంతుల్లో 62, మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులు సాధించడంతో బెంగళూరు ప్రత్యర్థి ఎదుట 190 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

హర్షల్ పేస్..రాయల్స్ క్లోజ్...

190 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్..తొలి ఓవర్లోనే సూపర్ ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్ నష్టపోయింది. బట్లర్ ను బెంగళూరు స్టార్ పేసర్ సిరాజ్ డకౌట్ గా పడగొట్టాడు.

మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 47, వన్ డౌన్ దేవదత్ పడిక్కల్ 52 పరుగులతో 98 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా..రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ సంజు శాంసన్ 22, మిడిలార్డర్ బ్యాటర్ జురెల్ 34, అశ్విన్ 12 పరుగులతో పోరాడినా 7 పరుగుల పరాజయం తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో మీడియం పేసర్ హర్షల్ పటేల్ 3 వికెట్లు సాధించాడు.

బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇప్పటి వరకూ జరిగిన 7 రౌండ్లలో రాజస్థాన్ రాయల్స్ కు ఇది మూడో ఓటమి కాగా..బెంగళూరుకు మూడు ఓటమిల తర్వాత వరుసగా రెండో గెలుపు.

First Published:  24 April 2023 10:58 AM IST
Next Story