కోల్ కతాపై రాజస్థాన్ 'రాయల్ ' విన్!
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ 12వ రౌండ్ పోరులో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అతిపెద్ద విజయం సాధించింది
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ 12వ రౌండ్ పోరులో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అతిపెద్ద విజయం సాధించింది. Kolkata Knight Riders ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది...
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ చివరి దశ పోటీలు మ్యాచ్ మ్యాచ్ కూ ఉత్కంఠను పెంచుతున్నాయి. లీగ్ టేబుల్ మొదటి నాలుగుస్థానాలలో ఆధిక్యత మారుతూ వస్తోంది.
ఇప్పటి వరకూ మూడోస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ను నాలుగోస్థానానికి నెట్టి రాజస్థాన్ ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరువయ్యింది.
గత మూడు రౌండ్ల మ్యాచ్ ల్లో వరుస పరాజయాలతో డీలా పడిన రాజస్థాన్ రాయల్స్..నెగ్గితీరాల్సిన 12వ రౌండ్ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించింది.
చహాల్, యశస్వి, సంజు షో....
భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక పోరు ఏకపక్షమే అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండ్ షోతో విశ్వరూపమే ప్రదర్శించింది.
150 పరుగుల లక్ష్యాన్ని మరో 41 బంతులు మిగిలిఉండగానే కేవలం ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్ నష్టానికే ( 13.1 ఓవర్లలోనే) సాధించడం ద్వారా విజేతగా నిలిచింది.
ఈ కీలక సమరంలో ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి కోల్ కతా నైట్ రైడర్స్ ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగుల స్కోరుకే పరిమితం చేసింది.
వెంకటేశ్ అయ్యర్ పోరాడినా...
హోంగ్రౌండ్ వేదికగా జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ గురితప్పని తమ బౌలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశారు.
కోల్ కతా టాపార్డర్లో వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీష్ రాణా మాత్రమే మెరుగైన స్కోర్లు సాధించారు. ఒకదశలో భారీస్కోరు సాధించగలదనుకొన్న కోల్ కతా 149 పరుగులు మాత్రమే చేయగలిగింది
డాషింగ్ ఓపెనర్లు జేసన్ రాయ్(10), రహ్మనుల్లా గుర్బాజ్(18)ను పేసర్ బౌల్ట్ పడగొట్టడంతో కోల్ కతా తేరుకోలేకపోయింది. పవర్ ప్లే ఓవర్లలోనే కోల్ కతా 29 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు నష్టపోయింది.
ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(57), కెప్టెన్ నితీశ్ రానా(22) ఆదుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ (42 బంతుల్లో 2 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అయితే మిడిల్ ఓవర్లలో కోల్ కతా దారుణంగా విఫలమయ్యింది.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ఓకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్(1) లను అవుట్ చేసి చావుదెబ్బ కొట్టాడు. చహాల్ తన ఆఖరి ఓవర్లో సూపర్ హిట్టర్ రింకూ సింగ్(16)ను సైతం పెవిలియన్ దారి పట్టించాడు.
దాంతో, కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో చహాల్ 4 వికెట్లు, బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, అసిఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
యశస్వి - సంజు బాదుడే బాదుడు!
కోల్ కతాను 149 పరుగుల స్కోరుకే పరిమితం చేయడంతోనే రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైపోయింది. 150 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ..తొలి ఓవర్లోనే సూపర్ ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్ ను రనౌట్ రూపంలో నష్టపోయింది. అయినా..యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఏమాత్రం తగ్గకుండా పవర్ హిట్టింగ్ తో పరుగుల మోత మోగించాడు.
కోల్ కతా కెప్టెన్ నితీశ్ రానా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వీ భారీషాట్లతో శివమెత్తిపోయాడు. వరుసగా 6,6,4,4,0,4 బాదాడు. దాంతో, 26 పరుగులు వచ్చాయి. హర్షిత్ రానా వేసిన రెండో ఓవర్లో సైతం అదేజోరు కొనసాగించాడు. ఫోర్, సిక్స్ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వీ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి కేవలం 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ రాజస్థాన్ ఓపెనర్ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు కేఎల్ రాహుల్ రికార్డును బద్ధలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు.
బౌలర్ ఎవరన్నది చూడకుండా సిక్సర్లు,బౌండ్రీలతో చెలరేగిపోయాడు. కేవలం 13 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ పేరుతో ఉన్న 14 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును యశస్వి తెరమరుగు చేశాడు. యశస్వి దెబ్బతో కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ పేర్లతో ఉన్న సంయుక్త రికార్డు (14 బంతుల్లో) చెదిరిపోయింది.
ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్న తేడా లేకుండా యశస్వి గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లు కొట్టాడు. కోల్ కతా బౌలింగ్ ఎటాక్ ను చెల్లాచెదురు చేసి..ఓ ఆటాడుకొన్నాడు.
యశస్వి హోరు- సంజు జోరు!
ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన యశస్వి జైశ్వాల్ (98 నాటౌట్ :47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) , కెప్టెన్ సంజూ శాంసన్(48 నాటౌట్ : 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రెండో వికెట్ కు అజేయ సెంచరీ భాగస్వామ్యంతో తమజట్టుకు కళ్లు చెదిరే విజయం అందించారు. 14వ ఓవర్ తొలిబంతినే బౌండ్రీ బాదడం ద్వారా రాయల్స్ కు విజయం ఖాయమయ్యింది.
రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసింది. యశస్వికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అత్యంత వేగంగా 150 పరుగుల లక్ష్యం..
ఐపీఎల్ 16సీజన్ల చరిత్రలో అత్యంత వేగంగా 150 పరుగుల విజయలక్ష్యం సాధించిన మూడోజట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
2008 సీజన్లో ముంబై ఇండియన్స్ పై డెక్కన్ చార్జర్స్ మరో 48 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరితే..2008 సీజన్లోనే చెన్నై ప్రత్యర్థిగా ముంబై 37 బంతుల్లోనే 150 పరుగుల విజయలక్ష్యం సాధించింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 41 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది.
ముంబై ఇండియన్స్ పై డెక్కన్ చార్జర్స్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ 47 బంతుల్లో 109 పరుగుల నాటౌట్ స్కోరు, కోల్ కతాపై యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 98 నాటౌట్, చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఓపెనర్ సనత్ జయసూర్య 48 బంతులలో 114 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడం విశేషం.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు జరిగే మరో కీలక పోరులో లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.