ప్రపంచకప్ ఫైనల్స్ కూ వానముప్పు!
మెల్బోర్న్ వేదికగా జరగాల్సిన ప్రపంచకప్ సూపర్ సండే టైటిల్ సమరానికి తీవ్రవానముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగితే కనీసం 10 ఓవర్ల మ్యాచైనా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది..
ప్రపంచ క్రికెట్ అభిమానులను గత మూడువారాలుగా అలరిస్తూ వచ్చిన టీ-20 ప్రపంచకప్ సమరం ముగింపు దశకు చేరింది.మాజీ చాంపియన్లు పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్స్ చేరడంతో టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అయితే.. మెల్బోర్న్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్స్ రోజున ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురవడం ఖాయమని ఆస్ట్రేలియా వాతావరణశాఖ హెచ్చరించింది. 95 శాతం వర్షం పడటం తథ్యమని ప్రకటించింది.
రిజర్వ్ డే రోజునా తప్పని వాన..
ఆదివారం జరగాల్సిన ఈమ్యాచ్ కు ఒకవేళ వర్షంతో అంతరాయం కలిగితే..రిజర్వ్ డేగా ప్రకటించిన సోమవారం మ్యాచ్ ను కొనసాగించడమో..లేదా తొలి బంతి నుంచి తిరిగి నిర్వహించే వెసలుబాటు ఉంది. అయినా రిజర్వ్ డే రోజున సైతం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, 25 మిల్లీమీటర్ల మేర వానపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.
మెల్బోర్న్ లో పిలిస్తే పలికే వాన..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రపంచకప్ ఫైనల్ తో పాటు మరో ఐదుమ్యాచ్ లకు వేదికగా ఎంపిక చేశారు. అయితే..భారతజట్టు ఆడిన రెండుమ్యాచ్ లూ సజావుగానే సాగాయి. రికార్డుస్థాయిలో లక్షా 70వేలమందికి పైగా ఈ రెండుమ్యాచ్ లకూ హాజరయ్యారు. సూపర్ -12 రౌండ్లో భాగంగా జరగాల్సిన మూడుమ్యాచ్ లు వానదెబ్బతో కనీసం ఒక్కబంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ మ్యాచ్ లు రద్దుకావడంతో ఆతిథ్య ఆస్ట్ర్లేలియాతో పాటు పలుజట్ల సెమీస్ అవకాశాలు తారుమారయ్యాయి.
ఫైనల్ రద్దయితే ఎవరు విజేత?
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్ లో విజేతను నిర్ణయించాలంటే కనీసం 10 ఓవర్లమ్యాచ్ జరిగితీరాలి. ప్రపంచకప్ టైటిల్ సమరం జరగాల్సిన ఆదివారం, రిజర్వ్ డేగా ప్రకటించిన ఆ మరుసటి రోజునా వర్షంతో మ్యాచ్ నిర్వహించలేకపోతే.. కనీసం 10 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది. అదీ సాధ్యపడక పోతే ..ఫైనల్ చేరిన ఇంగ్లండ్, పాక్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం జరగాల్సినమ్యాచ్ కొద్ది ఓవర్లపాటు సాగిన తర్వాత వర్షంతో నిలిచిపోతే..సోమవారం నిలిచిపోయిన బంతి నుంచి తిరిగి మ్యాచ్ ను కొనసాగించే అవకాశం సైతం ఉంది. కనీసం ఒక్క బంతి పడకుంటే.. విన్నర్, రన్నరప్ జట్లకు కలిపి ఇచ్చే 19 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ట్రోఫీతో పాటు రెండుజట్లూ సమానంగా పంచుకోనున్నాయి. 2007 నుంచి జరుగుతూ వస్తున్న ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇప్పటికే వరకూ వర్షంతో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడం అంటూ లేనే లేకపోడం విశేషం.