Telugu Global
Sports

రేటింగ్ కాదు..పాయింట్లే ప్రధానం - రాహుల్ ద్రావిడ్!

ఆస్ట్ర్రేలియాతో ప్రస్తుత టెస్టు సిరీస్ లోని పిచ్ లకు ఐసీసీ నాసిరకం రేటింగ్ పాయింట్లు ఇవ్వటాన్ని తాము పట్టించుకోబోమని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తేల్చి చెప్పాడు.

రేటింగ్ కాదు..పాయింట్లే ప్రధానం - రాహుల్ ద్రావిడ్!
X

ఆస్ట్ర్రేలియాతో ప్రస్తుత టెస్టు సిరీస్ లోని పిచ్ లకు ఐసీసీ నాసిరకం రేటింగ్ పాయింట్లు ఇవ్వటాన్ని తాము పట్టించుకోబోమని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తేల్చి చెప్పాడు....

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ జట్లు ఆస్ట్ర్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని మొదటి మూడుటెస్టులకు ఉపయోగించిన పిచ్ లకు ఐసీసీ అతితక్కువ రేటింగ్ ఇవ్వటం, నాసిరకంగా ఉన్నాయంటూ వర్ణించడాన్ని భారతజట్టు ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తప్పుపట్టారు.

గెలుపు వికెట్లతోనే పాయింట్లు....

ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడు (నాగపూర్, ఢిల్లీ, ఇండోర్ ) టెస్టులు లోస్కోరింగ్ మ్యాచ్ లుగా మొదటి మూడురోజుల్లోనే ముగిసిపోడాన్ని క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులతో పాటు..ఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పైగా మొదటి మూడుటెస్టులకు సిద్ధం చేసిన పిచ్ లను నాసిరకంగా వర్ణిస్తూ అతితక్కువగా రేటింగ్ పాయింట్లు ఇచ్చింది.

అయితే..ఐసీసీ రేటింగ్ పాయింట్ల కంటే..తమకు టెస్టులీగ్ పాయింట్లు ప్రధానమని భారత ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తేల్చి చెప్పారు. తాము నిబంధనలకు అనుగుణంగానే పిచ్ లను స్వదేశీ సిరీస్ ల కోసం తయారు చేసుకొంటున్నామని, మిగిలిన జట్లు సైతం అదే చేస్తున్నాయన్న వాస్తవాన్ని ద్రావిడ్ గుర్తు చేశారు.

ఆతిథ్యజట్లకు అనువుగానే వికెట్లు...

అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం..సిరీస్ లకు ఆతిథ్యమిచ్చే జట్లకే తమకు అనువైన పిచ్ లను సిద్ధం చేసుకొనే వెసలుబాటు ఉంటుందని, ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తో పాటు మిగిలిన జట్లు సైతం తమ బలానికి సరిపడిన వికెట్లనే తయారు చేసుకొంటూ విజయాలు సాధిస్తున్నాయని ద్రావిడ్ అన్నారు.

దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా టూర్లలో తాము పరమ చెత్త పిచ్ ల పైనే ఆడామని..తాము అప్పుడు చెత్త పిచ్ లంటూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

ప్రపంచ టెస్టు లీగ్ ను పాయింట్ల ప్రాతిపదికన నిర్వహిస్తున్నారని, లీగ్ లో విజయవంతంగా నిలవాలంటే అత్యధిక పాయింట్లు సాధించాలని, పాయింట్లు రావాలంటే..విజయాలను అందించే పిచ్ లను తయారు చేసుకోక తప్పదని స్పష్టం చేశారు. పిచ్ లకు ఐసీసీ ఇచ్చే రేటింగ్ గా గురించి పెద్దగా పట్టించుకోవద్దని సూచించారు.

తమకు రేటింగ్ పాయింట్ల కంటే ఐసీసీ లీగ్ పాయింట్లు ప్రధానమని ద్రావిడ్ స్పష్టం చేశారు. భారత్ తరపున 164 టెస్టుమ్యాచ్ లు ఆడిన అపారఅనుభవం ద్రావిడ్ కు ఉంది.

2021 సిరీస్ లో భాగంగా కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ఆఖరిరోజున మ్యాచ్ నెగ్గాలంటే 9 వికెట్లు పడగొట్టాల్సిన భారత్ విఫలమయ్యిందని, తమ బౌలింగ్ కు అనువుగా పిచ్ ను తయారు చేసుకొని ఉంటే అలాజరిగి ఉండేది కాదని చెప్పారు.

2022 దక్షిణాఫ్రికా పర్యటనలో స్పిన్ బౌలర్లకు ఏమాత్రం అనువుకాని పిచ్ లను అక్కడి క్రికెట్ బోర్డు తయారు చేయటాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోడం తనకు వింతగా అనిపిస్తోందని చెప్పారు.

ఐసీసీ లీగ్ పాయింట్ల విధానం ప్రకారం..ఓ టెస్టులో విజేతగా నిలిచిన జట్టుకు 12 పాయింట్లు ఇస్తారని..అదే మ్యాచ్ ను డ్రాగా ముగిస్తే వచ్చేది 4 పాయింట్లు మాత్రమేనని..

అలాంటప్పుడు 12 పాయింట్ల వైపే మెుగ్గుచూపుతామని, పాయింట్లు రావాలంటే విజయాలను అందించే పిచ్ లను తయారు చేసుకోడం మినహా వేరేదారి లేదని అన్నారు.

బ్యాటింగ్ కు ..బౌలింగ్ కు అనువుగా ఉండే స్పోర్టివ్ పిచ్ లను తయారు చేసుకొంటే మ్యాచ్ లు నెగ్గలేమని, టెస్టులీగ్ లో విజయవంతం కాలేమని చెప్పారు.

భరత్ ను వెనకేసుకొచ్చిన ద్రావిడ్...

ప్రస్తుత టెస్టు సిరీస్ కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అందుబాటులో లేకపోడంతో..ఆ స్థానంలో ఆడుతున్న భరత్ బ్యాటింగ్ లో విఫలం కావడం పై వస్తున్న విమర్శలను ద్రావిడ్ తిప్పి కొ్ట్టారు.

నాగపూర్, ఢిల్లీ టెస్టుమ్యాచ్ ల్లో పరుగులు చేయటం అంతతేలిక కాదని, లోస్కోరింగ్ టెస్టుల్లో సైతం భరత్ రెండంకెల స్కోర్లు సాధించిన విషయాన్ని గమనించాలని, కీపర్ గా భరత్ అత్యుత్తమంగా రాణిస్తున్నాడని, తనవంతుగా పరుగులు చేయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ వెనకేసుకొచ్చారు. కుదురుకోడానికి తగిన సమయం ఇవ్వటం సముచితమని చెప్పారు.

ఆఖరిటెస్టులో ఓడితే ఫైనల్ రేస్ నుంచి అవుట్...

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి భారత్ చేరాలంటే..అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆఖరి టెస్టులో ఆస్ట్ర్రేలియాను ఓడించితీరాల్సి ఉంది. ఆఖరిమ్యాచ్ లో నెగ్గితే లభించే 12 పాయింట్లతో కలుపుకొని భారత్ విజయశాతం 60.29కి చేరుతుంది. దీంతో మూడోస్థానంలో 53.33 విజయశాతంతో ఉన్న శ్రీలంకకు అవకాశమివ్వకుండా భారత్ నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే..న్యూజిలాండ్- శ్రీలంకజట్ల రెండుమ్యాచ్ ల సిరీస్ తుదిఫలితం పైన భారత్ ఫైనల్ చేరేది లేనిదీ ఆధారపడి ఉంది. శ్రీలంక జట్టు భారత్ ను అధిగమించి ఫైనల్ చేరాలంటే రెండుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించాల్సి ఉంది. 1-1తో సిరీస్ ముగిసినా లేక 1-0తో సిరీస్ నెగ్గినా..భారత్ ఫైనల్ చేరుకోగలుగుతుంది.

ఇండోర్ టెస్టు తరహాలోనే అహ్మదాబాద్ టెస్టులో సైతం భారత్ చిత్తుగా ఓడితే మాత్రం..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ రేస్ నుంచి నిష్క్ర్రమించక తప్పదు.

First Published:  9 March 2023 9:47 AM IST
Next Story