Telugu Global
Sports

భారత చీఫ్ కోచ్ సరికొత్త రికార్డు!

భారత క్రికెట్ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత మొత్తంలో వేతనం అందుకొంటున్న క్రికెట్ శిక్షకునిగా నిలిచాడు...

భారత చీఫ్ కోచ్ సరికొత్త రికార్డు!
X

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. క్రికెటర్‌గా సాధించలేనిది క్రికెట్ కోచ్‌గా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యధిక వేతనం అందుకొంటున్న శిక్షకుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఏడాదికి 12 కోట్ల రూపాయల జీతం...

భారత టెస్టు, వన్డే, టీ-20 జట్లకు ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ ఏడాదికి 12 కోట్ల రూపాయల చొప్పున జీతం చెల్లిస్తోంది. అంటే ద్రావిడ్ నెలకు కోటి రూపాయల చొప్పున వేతనం అందుకొంటూ తన సేవలు అందిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ అందుబాటులో లేని సమయంలో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌కు నెలకు 50 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తోంది.

రోహిత్, విరాట్‌లను మించిన ద్రావిడ్...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కమ్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీలను మించి రాహుల్ ద్రావిడ్‌కే బీసీసీఐ అధికంగా జీతం చెల్లిస్తోంది. బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయల చొప్పున రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వేతనంగా అందుకొంటున్నారు. అయితే గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో మ్యాచ్‌లు ఆడకపోయినా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. అదే భారత ప్రధాన శిక్షకుడిగా మాత్రం రాహుల్ ద్రావిడ్....రోహిత్, కొహ్లీల కంటే 5 కోట్ల రూపాయలు ఎక్కువగా ఆర్జిస్తున్నాడు.

గతంలో భారత్‌ చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే 7 కోట్ల రూపాయలు, రవిశాస్త్రి 9 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున వేతనం అందుకున్నారు. భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత..అత్యధిక వేతనం అందుకొన్న క్రికెట్ శిక్షకుడిగా ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ నిలిచాడు. లాంగర్ జీతం 4 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం మీద..భారత్ తరపున 100కు పైగా టెస్టులు, 200కు పైగా వన్డేలు ఆడిన సమయంలో సంపాదించలేని మొత్తాన్ని రాహుల్ ద్రావిడ్..రిటైర్మెంట్ తర్వాత చీఫ్ కోచ్‌గా సంపాదిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వేతనం అందుకొంటున్న ప్రధాన శిక్షకుడు ఎవరంటే రాహుల్ ద్రావిడ్ మాత్రమే అని చెప్పక తప్పదు.

First Published:  5 Sept 2023 6:04 PM IST
Next Story