ప్రపంచకప్ లో ఖతర్ చెత్త రికార్డు!
ఫిఫా 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీని వందలకోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఖతర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకొంది
ఫిఫా 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీని వందలకోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఖతర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకొంది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత అధ్వాన్నమైన జట్టుగా మిగిలింది.....
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడోత్సవం ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్పోటీలకు ఆతిథ్యమిచ్చిన అత్యంత చిన్నదేశంగా, తొలి అరబ్ దేశంగా ఘనత దక్కించుకొన్న ఖతర్ ఓ అత్యంత చెత్త రికార్డును సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
కేవలం 30 లక్షల జనాభామాత్రమే కలిగిన అత్యంత బుల్లిదేశం ఖతర్...ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వడం కోసం వందలకోట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేసింది.
గత నాలుగేళ్లుగా పలు అత్యాధునిక స్టేడియాల నిర్మాణంతో పాటు..మెట్రో రైలును ఏర్పాటు చేయటానికి భారీమొత్తం లో వ్యయం చేసింది.
మొత్తం 32 అగ్రశ్రేణిజట్లు పాల్గొన్న ఈ టోర్నీని ఘనంగా నిర్వహించింది.
లీగ్ దశలోనే నిష్క్ర్రమణ...
ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్యజట్లే అత్యంత విజయవంతమైనజట్లుగా నిలిస్తే....ఖతర్ మాత్రం ఘోరంగా విఫలమైనజట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్, ఘనా, ఈక్వెడోర్ జట్లతో కూడిన గ్రూప్-ఏ లీగ్ లో ఆతిథ్యదేశం హోదాలో బరిలోకి దిగిన ఖతర్..మొత్తం మూడుకు మూడురౌండ్లలోనూ పరాజయాలు చవిచూసింది.
కోస్టారికాతో జరిగిన ప్రారంభమ్యాచ్ లో ఈక్వెడోర్ చేతిలో 2-0, నెదర్లాండ్స్ చేతిలో 2-0, ఘనా చేతిలో 3-1గోల్స్ తో ఓటమి చవిచూసింది. 2019 లో ఆసియాకప్ విజేతగా నిలిచిన ఖతర్ జట్టు ప్రపంచకప్ లో మాత్రం తేలిపోయింది. కనీసం ఒక్కమ్యాచ్ లోనూ విజేతకాలేకపోయింది. పైగా ఒక్కటంటే ఒక్కటి మాత్రమే గోల్ సాధించింది.
ప్రపంచకప్ నిర్వహణ కోసమే 200 బిలియన్ డాలర్లు వ్యయం చేసిన ఖతర్..సాకర్ ఫీల్డ్ లో మాత్రం వెలవెలపోయింది.
1930 నుంచి జరుగుతూ వచ్చిన 22 ప్రపంచకప్ టోర్నీలలో ఆతిథ్యజట్లు మెరుగైన ఆటతీరునే ప్రదర్శిస్తూ వచ్చాయి.
2010 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా సైతం గ్రూప్ లీగ్ లో విఫలమైనా..ఓ గెలుపు, ఓ డ్రా ఫలితాలను సాధించడం ద్వారా 4 పాయింట్లు దక్కించుకొని పరువు నిలబెట్టుకొంది.
జపాన్, కొరియాజట్లే నయం..
2002 ప్రపంచకప్ కు సంయుక్త ఆతిథ్యమిచ్చిన జట్లలో ఒకటైన జపాన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్లో పరాజయం చవిచూస్తే..1994 ప్రపంచకప్ ను నిర్వహించిన అమెరికాకు సైతం అదే ఫలితం ఎదురయ్యింది.
ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన దేశాలు ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి. 1998 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన ఫ్రాన్స్ సైతం ప్రపంచ టైటిల్ గెలుచుకోగలిగింది.
2018 ప్రపంచకప్ కు వేదికగా నిలిచిన రష్యాజట్టు క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరితే...2014 ప్రపంచకప్ ఆతిథ్యజట్టు బ్రెజిల్ 4వ స్థానంలో నిలిచింది.
2006 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన జర్మనీ 3వ స్థానం, 2002 ప్రపంచకప్ కు సంయుక్త ఆతిథ్యమిచ్చిన కొరియా 4వ స్థానం, 1990 ప్రపంచకప్ ఆతిథ్య దేశం ఇటలీ మూడు, 1986 ప్రపంచకప్ ఆతిథ్యజట్టు మెక్సికో క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగాయి.
1982 ప్రపంచకప్ కు వేదికగా నిలిచిన స్పెయిన్ గ్రూప్ దశ నుంచే నిష్క్ర్రమిస్తే..1978 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన అర్జెంటీనా విజేతగా నిలిచింది.
1974 ప్రపంచకప్ నిర్వహించిన జర్మనీ ట్రోఫీ అందుకొంటే..1970 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన మెక్సికో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. 1966 ప్రపంచకప్ నిర్వహించిన ఇంగ్లండ్ విజేత కాగలిగింది.
1962 ప్రపంచకప్ లో ఆతిథ్య చిలీ 3వ స్థానం, 1958 ప్రపంచకప్ లో ఆతిథ్య స్వీడన్ రన్నరప్, 1930 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే విన్నర్స్ స్థానాలు సాధించాయి.
1930 నుంచి 2022 ప్రపంచకప్ వరకూ మొత్తం 22 టోర్నీలలో కనీసం ఒక్క విజయమూ సాధించకుండా గ్రూప్ లీగ్ దశలోనే ఆఖరిస్థానంలో నిలిచిన తొలి, ఏకైకజట్టు అపఖ్యాతిని ఖతర్ మూటగట్టుకోవాల్సి వచ్చింది.
సొమ్మూపోయే శనిపట్టే అన్నమాట 2022 టోర్నీ ఆతిథ్య దేశం ఖతర్ కు అతికినట్లు సరిపోతుంది.