Telugu Global
Sports

ఢిల్లీ ఢమాల్.. పంజాబ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవం!

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వైదొలగింది. పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ ఆశలు సజీవంగా నిలుపుకోగలిగింది.

ఢిల్లీ ఢమాల్.. పంజాబ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవం!
X

ఢిల్లీ ఢమాల్.. పంజాబ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవం!

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వైదొలగింది. పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ ఆశలు సజీవంగా నిలుపుకోగలిగింది.

పది జట్ల ఐపీఎల్ లీగ్ లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ ముగిసింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించిన తొలిజట్టుగా ఢిల్లీ నిలిచింది.

హోంగ్రౌండ్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ 31 పరుగుల ఓటమి చవిచూసింది. ప్లే-ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ ఒంటరిగా పోరాడి ఫైటింగ్ సెంచరీ సాధించగా..ఆల్ రౌండర్ సామ్ కరెన్ 20 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (7), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (5), షారుక్‌ ఖాన్‌ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.

60 లక్షల రూపాయల కాంట్రాక్టు పై పంజాబ్ కు ఆడుతున్న ప్రభు సిమ్రాన్ సింగ్..బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగా లేని ఢిల్లీ మందకొడి పిచ్ పై 65 బంతుల్లో10 ఫోర్లు, 6 సిక్సర్ల తో 103 పరుగులు సాధించాడు.

6వ అతిపిన్న వయస్కుడైన బ్యాటర్ ప్రభు సిమ్రాన్...

ఐపీఎల్‌లో ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్ తొలి శ‌త‌కం సాధించడం ద్వారా ఆరవ అతిపిన్న వ‌య‌స్కుడైన బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. ముంబై వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో సాధించిన 103 పరుగుల అజేయసెంచరీని అభిమానులు మరువక ముందే..కేవలం 20 గంటల వ్యవధిలోనే పంజాబ్ కింగ్స్‌ ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(103) సెంచ‌రీతో చెల‌రేగాడు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై విధ్వంస‌క బ్యాటింగ్ తో ప్రభ్ సిమ్రన్ మెరిశాడు. 61 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో వంద ప‌రుగులు కొట్టాడు. దాంతో, చిన్న వ‌య‌సులో శ‌త‌కం బాదిన ఆరో బ్యాటర్ గా గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో మ‌నీశ్ పాండే అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత సీజన్లో హ్యారీ బ్రూక్(స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్(కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్), య‌శ‌స్వీ జైస్వాల్(రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌), సూర్య‌కుమార్ యాద‌వ్(ముంబై ఇండియ‌న్స్‌) మాత్రమే సెంచరీలు బాదగా..వారిసరసన ప్రభ్ సిమ్రాన్ వచ్చి చేరాడు.

చెత్త బ్యాటింగ్ తో కుప్పకూలిన ఢిల్లీ...

మ్యాచ్ నెగ్గాలంటే 168 పరుగుల చేయాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (27 బంతుల్లో 54; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌), ఫిల్‌ సాల్ట్‌ (21) రాణించడంతో ఒక దశలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే..పంజాబ్ లెఫ్టామ్ స్పిన్నర్ హర్‌ప్రీత్‌ బ్రార్ (4/30), లెగ్ స్పిన్నర్ రాహుల్‌ చాహర్‌ (2/16) ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్‌ (3), రాసో (5), అక్షర్‌ (1), మనీశ్‌ పాండే (0) వెంటనే వెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ తేరుకోలేకపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్, సాల్ట్ కలిసి 75 పరుగులు సాధిస్తే..మిగిలిన బ్యాటర్లంతా కలసి 57 పరుగులు మాత్రమే చేయగలిగారు.సీమ్ బౌలర్ నేథన్‌ ఎలీస్‌ సైతం 21 పరుగులకే 2 వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ 130 పరుగులకే పరిమితమయ్యింది.

పంజాబ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

10జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో పంజాబ్ కు ఇది 6వ గెలుపు కాగా లీగ్ టేబుల్ 6వ స్థానానికి చేరుకోగలిగింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది 8వ ఓటమి కావడంతో ప్లే-ఆఫ్ రేస్ నుంచి వైదొలగక తప్పలేదు.

2021 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం.

ఈ రోజు జరిగే డబుల్ హెడ్డర్ సమరంలో....రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

First Published:  14 May 2023 2:10 PM IST
Next Story