మహిళా రెజ్లర్ల సమస్యను మోదీ పరిష్కరిస్తారన్న నమ్మకం లేదు.. - కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ
బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని, కానీ ఇప్పటివరకు ఆ కాపీలను బయటికి చూపించలేదని ప్రియాంక గుర్తుచేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంఘీభావం తెలిపారు. శనివారం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని వారిని ఓదార్చారు. వారితో కలిసి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ ఆమెకు తమ సమస్యలను వివరించారు.
అనంతరం ప్రియాంక విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్లంతా మరో గత్యంతరం లేకే ఇలా తమ నిరసన గళం వినిపిస్తున్నారని చెప్పారు. వీరి సమస్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారన్న నమ్మకం తనకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇప్పటివరకు వారితో ఎందుకు మాట్లాడలేదని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కనీసం వారిని కలవడానికి కూడా ప్రయత్నించలేదని విమర్శించారు.
ఎఫ్ఐఆర్ కాపీలను ఇంతవరకు బయటికి చూపలేదు..
బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని, కానీ ఇప్పటివరకు ఆ కాపీలను బయటికి చూపించలేదని ప్రియాంక గుర్తుచేశారు. అందులో ఏముందో ఎవరికీ తెలియదని ఆమె తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీలను ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు.
నేడు రెజ్లర్లను కలవనున్న కేజ్రీవాల్..
ఇప్పటికే తమ ఆందోళన సందర్భంగా రెజ్లర్లు రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి క్రమేపీ మద్దతు పెరుగుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆందోళన చేస్తున్న రెజ్లర్లను ఈరోజు కలిసి మద్దతివ్వనున్నట్టు సమాచారం.