Telugu Global
Sports

రెండేళ్ళ తర్వాత భారతజట్టులో పృథ్వీ షా!

దేశవాళీ క్రికెట్లో పరుగుల వీరుడు, ముంబై డైనమైట్ పృథ్వీ షాను ఎట్టకేలకు సెలెక్టర్లు కరుణించారు. రెండేళ్ల తర్వాత భారత టీ-20 జట్టులో చోటు కల్పించారు.

Prithvi Shaw in the Indian team after two years
X

పృథ్వీ షా

దేశవాళీ క్రికెట్లో పరుగుల వీరుడు, ముంబై డైనమైట్ పృథ్వీ షాను ఎట్టకేలకు సెలెక్టర్లు కరుణించారు. రెండేళ్ల తర్వాత భారత టీ-20 జట్టులో చోటు కల్పించారు.

దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన యవఓపెనర్లలో ఒకడైన పృథ్వీషాకు క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. దేశవాళీ ( రంజీ, విజయ్ హజారే, ముస్తాక్ అలీ )

క్రికెట్ టోర్నీలలో పరుగుల హోరు, సెంచరీల జోరుతో గత రెండేళ్లుగా చెలరేగిపోతూ వస్తున్నా సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా పక్కనపెడుతూ వస్తున్నారు.

గతంలో అండర్-19 ప్రపంచకప్ లో కెప్టెన్ గా భారత్ కు ప్రపంచ కప్ అందించిన ఘనత పృథ్వీ షాకు ఉంది.

అరంగేట్రం టెస్టులోనే శతకం..

2018లో వెస్టిండీస్ పై టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ తన తొలిమ్యాచ్ లోనే సెంచరీ బాదడం ద్వారా సంచలనం సృష్టించాడు. టెస్టు క్రికెట్లో శతకం బాదిన అతిపిన్నవయస్కుడైన భారత క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. రెండేళ్లక్రితం భారతజట్టులో చోటు కోల్పోకముందు వరకూ ఐదుటెస్టుల్లో పాల్గొన్నాడు.

2020 టెస్టు సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సున్నా స్కోరుకు, రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులకు అవుటైన తర్వాత భారతజట్టులో చోటు కోల్పోయాడు.

భారత్ తరపున ఆరు వన్డేమ్యాచ్ లు, ఓ టీ-20 మ్యాచ్ లో సైతం పాల్గొన్న రికార్డు పృథ్వీ షాకు ఉంది. అయితే..భారత్ తరపున తన చిట్టచివరి అంతర్జాతీయమ్యాచ్ 2021 జులైలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడి ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్న పృథ్వీ షాను గాయాలతో పాటు వివాదాలు, అనారోగ్యం కృంగదీశాయి. అయినా పట్టువిడవకుండా దేశవాళీ క్రికెట్ పోటీలలో పాల్గొంటూ పరుగుల సునామీ సృష్టించాడు.

రంజీమ్యాచ్ లో పృథ్వీ విశ్వరూపం..

2022-23 రంజీసీజన్ గ్రూప్ లీగ్ లో భాగంగా అసోంతో జరిగిన మ్యాచ్ లో పృథ్వీ విశ్వరూపం ప్రదర్శించాడు. 383 బంతుల్లో 379 పరుగుల రికార్డు స్కోరు సాధించాడు.

1990-91 సీజన్లో సంజయ్ మంజ్రేకర్ సాధించిన 377 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును పృథ్వీ 379 పరుగుల స్కోరుతో తెరమరుగు చేశాడు.

పృథ్వీ సాధించిన ఈ స్కోరును చూసి బోర్డు కార్యదర్శి జే షా సైతం ట్విట్టర్ ద్వారా అభినందించారు.మంచిరోజులొస్తాయంటూ సందేశం ఇవ్వడం ద్వారా మనోబలం పెంచారు.

ఇదే సమయంలో వెంకటేశ్ ప్రసాద్ లాంటి పలువురు మాజీ క్రికెట్ వ్యాఖ్యాతలు..సూపర్ ఫామ్ లో ఉన్న పృథ్వీని నిర్లక్ష్యం చేస్తే అది భారతజట్టుకే నష్టం అంటూ హెచ్చరించడంతో బోర్డు ఎంపిక సంఘంలో కదలిక వచ్చింది.

న్యూజిలాండ్ తో ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో పృథ్వీకి చోటు కల్పించారు. రాంచీ, లక్నో, అహ్మదాబాద్ నగరాలు వేదికగా జరిగే ఈ సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్ గాను, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గాను వ్యవహరిస్తారు.

కివీలతో జరిగే టీ-20 సిరీస్ లో పృథ్వీ ఇదే దూకుడు కనబరిస్తే..భారత టెస్టు, వన్డే జట్లలో చోటు దక్కించుకోడం ఏమంత కష్టం కాబోదు.

భారతజట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి పలువురు యువ ఓపెనర్ల నుంచి పృథ్వీ షాకు గట్టి పోటీ ఎదురుకానుంది.

సీనియర్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులు, వన్డేలలో ఓ ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేస్తుంటే..రెండో ఓపెనర్ స్థానం కోసం ఐదుగురు ప్రతిభావంతులైన యువఓపెనర్లు పోటీపడుతున్నారు.

First Published:  14 Jan 2023 5:21 PM IST
Next Story