Telugu Global
Sports

ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రణయ్ సంచలనం!

2023 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ భారత్ కు ఓ పతకం ఖాయం చేశాడు. క్వార్టర్ ఫైనల్లో సంచలన విజయం సాధించాడు..

ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రణయ్ సంచలనం!
X

2023 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ భారత్ కు ఓ పతకం ఖాయం చేశాడు. క్వార్టర్ ఫైనల్లో సంచలన విజయం సాధించాడు..

డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత సింగిల్స్ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్ ఓ పతకం ఖాయం చేయడం ద్వారా పరువు దక్కించాడు. కాగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లోనే భారత టాప్ జోడీ రిత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టీలకు అనుకోని ఓటమి ఎదురయ్యింది.

సెమీఫైనల్లో ప్రణయ్...

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో 9వ ర్యాంకర్ గా ఉన్న భారత స్టార్ ప్లేయర్ ప్రణయ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో సత్తా చాటుకొన్నాడు. తన కెరియర్ లో తొలి ప్రపంచ సింగిల్స్ పతకాన్ని ఖాయం చేసుకోగలిగాడు.

పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ లో భారత ప్లేయర్లంతా ఓటమి పాలైన నేపథ్యంలో ప్రణయ్ ఒక్కడే పతకం రేస్ లో మిగిలాడు. కోపెన్ హాగెన్ బ్యాడ్మింటన్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ పోరులో ప్రణయ్ తుదివరకూ పోరాడి విజేతగా నిలిచాడు.

రెండుసార్లు విశ్వవిజేత, డెన్మార్క్ టాప్ ర్యాంక్ ప్లేయర్ విక్టర్ యాక్సెల్ సన్ తో జరిగిన మూడుగేమ్ ల పోరులో ప్రణయ్ స్థాయికి మించి రాణించి విజేతగా నిలిచాడు.

68 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో యాక్సెల్ సన్ తొలిగేమ్ ను 21-13తో అలవోకగా గెలుచుకోడం ద్వారా శుభారంభం చేశాడు. అయితే..

కీలక రెండోగేమ్ లో ప్రణయ్ పుంజుకొని ఆడి 21-15తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలువగలిగాడు. విజేతను నిర్ణయించే నిర్ణయాత్మక ఆఖరి, మూడో గేమ్ లో ప్రణయ్ 21-16తో గేమ్ ను 2-1తో మ్యాచ్ ను నెగ్గడం ద్వారా సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగలిగాడు.

ఈ విజయంతో ప్రణయ్ కనీసం కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగిరానున్నాడు. ఒకవేళ సెమీఫైనల్లో నెగ్గితే స్వర్ణ లేదా రజతాలలో ఏదో ఒకపతకం అందుకోగలగుతాడు అదే ఓడితే మాత్రం కాంస్య పతకం సాధించిన వాడవుతాడు.

భారత్ కు 14వ ప్రపంచ పతకం...

గతంలో భారత్ కు ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలో పతకాలు అందించిన వారిలో ప్రకాశ్ పడుకోన్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ, జ్వాలా గుత్త- అశ్వని పొన్నప్ప ఉన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కు 14వ పతకం అందించిన ఘనతను 31 సంవత్సరాల ప్రణయ్ దక్కించుకోబోతున్నాడు.

క్వార్టర్స్ లోనే డబుల్స్ జోడీ బోల్తా!

పురుషుల డబుల్స్ లో భారత్ కు ఏదో ఒక పతకం సాధించి పెట్టగలరని భావించిన రెండోర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురయ్యింది.

గత కొద్ది మాసాలుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారతజోడీ..అత్యుత్తమంగా రెండోర్యాంక్ కు చేరుకోగలిగారు. అయితే ప్రతిష్టాత్మక

ప్రపంచ బ్యాడ్మింటన్లో మాత్రం తేలిపోయారు.

గత ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన సాత్విక్- చిరాగ్ జోడీ ప్రస్తుత టోర్నీలో మాత్రం విఫలమయ్యారు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ కు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్ట్రుప్- యాండెర్స్ స్కరూప్ రాస్ మ్యూసెన్ వరుస గేమ్ ల్లో ప్రపంచ రెండోర్యాంక్ జోడీని చిత్తు చేయడం ద్వారా సంచలనం సృష్టించగలిగారు.

48 నిముషాలపాటు సాగిన ఈ పోరులో భారత జోడీ18-21, 19-21 పాయింట్లతేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్ర్రమించాల్సి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ ఓ టోర్నీ క్వార్టర్ ఫైనల్ దశలోనే పరాజయం పొందటం గత ఏడాదికాలంలో ఇదే మొదటిసారి.

First Published:  26 Aug 2023 7:00 AM GMT
Next Story