మ్యాచ్ అంటే ఇదేరా..! భారత్ - పాక్ మ్యాచ్‌కు ప్రశంసల వెల్లువ!
టీ-20 ప్రపంచకప్‌లో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన దాయాదుల సమరంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అంటే ఇదేరా అంటూ క్రికెట్ ప్రియులు మాత్రమే కాదు... ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ సైతం కొనియాడుతున్నాడు.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ఏడాది పొడుగునా వందల కొద్దీ మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే.. కలకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌లు అతికొద్ది మాత్రమే ఉంటాయి. సమాన బలం కలిగిన రెండు జట్లు తలపడితే... ఆధిక్యం చేతులు మారుతూ, ఆఖరి ఓవర్ ఆఖరు బంతి వరకూ నువ్వానేనా అన్నట్లు పోరు సాగితే ఆ మ్యాచ్‌లో ఉన్న మజాయే వేరు. ఖచ్చితంగా అలాంటి మ్యాచ్‌ల జాబితాలోకి చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 ప్రారంభ మ్యాచ్ చేరిపోయింది.
మ్యాచ్‌లకే మ్యాచ్ ఇది...
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక. అందునా 90 వేల 293 మంది ప్రేక్షకులతో కిటకిటలాడిన మెల్బోర్న్ స్టేడియంలో భారత్ - పాకిస్థాన్ జట్లు ఢీ అంటే ఢీ అని బరిలో నిలిస్తే.. అది బ్లాక్ బస్టర్ ఫైట్ కాక మరొకటి కాదని మరోసారి రుజువయ్యింది. సూపర్ ఫామ్‌లో ఉన్న పాక్‌ను భారత్ 159 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్ తేలికగా ముగిసిపోతుందని భారత అభిమానులు భావించారు. అయితే..పాక్ బౌలర్లు చేలరేగిపోడంతో భారత సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. పవర్ ప్లే ఓవర్లలోనే భారత్ 45 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లో పడిపోయింది.
అలాంటి స్థితిలో విరాట్ - హార్థిక్ పాండ్యా జోడీ ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఆఖరి బంతి విజయం అందించారు. 5వ వికెట్ కు 113 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత్‌కు ఊపిరిపోశారు. ఆట ఆఖరి 3 ఓవర్లలో విజయానికి అవసరమైన 48 పరుగులను భారత్ సాధించిన తీరు నాటకీయంగా సాగింది. పైగా ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు, ఓ వైడ్, ఓ నోబాల్, మూడు బైస్‌తో మరింత ఉత్కంఠగా సాగింది. మాస్టర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరియర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ సమయోచితంగా ఆడి మ్యాచ్ కు తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.భారత్ విజయంతో దీపావళి పండుక తమకు ఒకరోజు ముందుగానే వచ్చినంతగా పొంగిపోయారు. సంబరాలు జరుపుకొన్నారు.
వయసు మరచిన సునీల్ గవాస్కర్..
పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అపూర్వ, అసాధారణ విజయాన్నిపిల్లలూ, పెద్దలూ, సగటు అభిమానులు మాత్రమే కాదు..విఖ్యాత కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సైతం పూర్తి స్థాయిలో ఆస్వాధించాడు. అశ్విన్ మ్యాచ్ ఆఖరి బంతిని విన్నింగ్ షాట్‌గా మలచిన వెంటనే 70 సంవత్సరాల సునీల్ గవాస్కర్ ఓ సాధారణ అభిమానిగా, కుర్రాడిగా మారిపోయి స్టెప్పులేస్తూ కేరింతలు కొట్టారు. మ్యాచ్ అంటే ఇదేనంటూ మురిసిపోయారు. మరో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వారేవ్వా...ఏమి గెలుపు అంటూ పొంగిపోయాడు.
ప్రపంచకప్‌ను ఇక నిలిపివేస్తే మంచిది - మార్ష్..
ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఏ స్థాయిలో జరుగుతాయో తెలియదుకానీ..భారత్ - పాక్ జట్ల మ్యాచ్ గొప్పగా, అత్యుత్తమంగా సాగిందని, ఇంత గొప్పమ్యాచ్ మరొకటి ఉంటుందని తాను అనుకోడం లేదని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ కొనియాడాడు. ప్రపంచకప్‌ను ఇక నిలిపివేస్తే మేలంటూ వ్యాఖ్యనించాడు. మిగిలిన మ్యాచ్‌లు..ఇదే స్థాయిలో జరుగుతాయన్న గ్యారంటీ ఏమీలేదన్నాడు. మెల్బోర్న్ వేదికగా ముగిసిన భారత్- పాక్‌ల సమరం కోట్లాది మంది అభిమానులకు జీవితకాలం గుర్తుండిపోతుందని, టీ-20 క్రికెట్లోని అసలు మజా ఏమిటో రుచిచూపించిందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్ అంత గొప్పగా సాగుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని..విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ అపూర్వం, ఆసాధారణం అంటూ పొంగిపోయాడు. రానున్న మ్యాచ్ ల్లోనూ కోహ్లి తరహా ఇన్నింగ్స్ ను చూడాలని తాను కోరుకొంటున్నట్లు చెప్పాడు. భారత్ - పాక్ జట్ల మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోటీ 80 లక్షల మంది, స్టేడియానికి వచ్చి 90 వేల 293 మంది వీక్షించడం కూడా టీ-20 ప్రపంచకప్‌లో ఓ రికార్డుగా నిలిచిపోతుంది.