చెస్ వండర్ ప్రఙ్జానంద్ కు కానుకల వర్షం!
భారత చదరంగ నయా సంచలనం, ప్రపంచకప్ రన్నరప్ ప్రఙ్జానంద్ పై కానుకల వర్షం కురుస్తోంది. చెన్నై చేరుకొన్న ఈ చదరంగ మాంత్రికుడికి క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు.
భారత చదరంగ నయా సంచలనం, ప్రపంచకప్ రన్నరప్ ప్రఙ్జానంద్ పై కానుకల వర్షం కురుస్తోంది. చెన్నై చేరుకొన్న ఈ చదరంగ మాంత్రికుడికి క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు.
అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా ముగిసిన 2023 ప్రపంచకప్ చెస్ తొలి రౌండ్ నుంచి సెమీఫైనల్స్ వరకూ సంచలన విజయాలు సాధిస్తూ రన్నరప్ గా నిలిచి..స్వదేశానికి తిరిగి వచ్చిన యువగ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రఙ్జానంద్ కు చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తమ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన 18 సంవత్సరాల చదరంగ సంచలనానికి ఘనస్వాగతం పలకటానికి భారీసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.
తమిళనాడు ప్రభుత్వ నజరానా 30 లక్షలు...
చెన్నై నగరంలో తెలుగు మూలాలున్న ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి 12 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచ చదరంగంలోకి దూసుకొచ్చిన ప్రఙ్జానంద్ అత్యంత పిన్నవయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించడం తో పాటు చెస్ ఒలింపియాడ్ లోనూ పతకం సాధించాడు. అంతటితో ఆగిపోకుండా 2023 ప్రపంచకప్ చెస్ టోర్నీలో రన్నరప్ గా నిలవడం ద్వారా 2024 ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి సైతం అర్హత సంపాదించాడు.
ప్రపంచకప్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ ను ముప్పతిప్పలు పెట్టి రజత పతకంతో సరిపెట్టుకొన్న ప్రఙ్జానంద్ ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి ఉదయనిధి స్టాలిన్ అభినందించారు. తమిళనాడు రాష్ట్రంతో పాటు భారత్ కే గర్వకారణంగా నిలిచిన ప్రఙ్జానంద్ కు 30 లక్షల రూపాయల చెక్కును, ఓ జ్ఞాపికను అందచేసి సత్కరించారు.
ప్రపంచ రన్నరప్ గా 66 లక్షల ప్రైజ్ మనీ...
ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన ప్రఙ్జానంద్ కు 80వేల డాలర్లు ( 66 లక్షల 12వేల రూపాయలు ) ప్రైజ్ మనీ దక్కింది. అంతేకాదు..ప్రఙ్జానంద్ తల్లిదండ్రులకు ఆనంద్ మహేంద్ర ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్రఙ్జానంద్, అతని సోదరి వైశాలిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దటం కోసం తల్లిదండ్రులు భారీ మొత్తంలో అప్పులు చేసి ఒక విధంగా సాహసమే చేశారు. అయితే..ప్రఙ్జానంద్ సాధించిన ప్రపంచకప్ రన్నరప్ ట్రోఫీతో పాటు వివిధ రూపాలలో లభించిన ప్రైజ్ మనీతో తేరుకొనే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది జరిగే ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో పాల్గొనడం ద్వారా ప్రఙ్జానంద్ ఛాలెంజర్ రేస్ లో నిలువనున్నాడు.
♦