Telugu Global
Sports

భారత చదరంగంలో బాల..రాజు!

మేధో క్రీడ చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రియశిష్యుడు ప్రజ్ఞానంద్ సంచలన విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

భారత చదరంగంలో బాల..రాజు!
X

మేధో క్రీడ చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రియశిష్యుడు ప్రజ్ఞానంద్ సంచలన విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వయసుకు మించిన ప్రతిభతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు. 16 ఏళ్ల వయసులోనే విశ్వవిజేత కార్ల్ సన్ ను మూడుకు మూడుసార్లు ఓడించాడు....

ఇతిహాస క్రీడ చదరంగంలో ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ ది ఓ ప్రత్యేక చరిత్ర. అనతోలీ కార్పోవ్, గారీ కాస్పరోవ్, గెల్ఫాండ్ లాంటి ఎందరో గొప్పగొప్ప సూపర్

గ్రాండ్ మాస్టర్ల ఆటకట్టించిన ఆనంద్...ప్రస్తుత ప్రపంచ విజేత మాగ్నుస్ కార్ల్ సన్ తో పోరులో విజేత కాలేకపోయాడు. అయితే..ఆనంద్ శిష్యుడు, భారత బాల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ ఆలోటును పూడ్చాడు. ఒకటి కాదు, రెండుకాదు..ఏకంగా మూడు వేర్వేరు గేమ్‌ ల్లో కార్లసన్ పై సంచలన విజయాలు సాధించడం ద్వారా ప్రజ్ఞానంద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

12 ఏళ్ల వయసుకే గ్రాండ్ మాస్టర్ హోదా..

చదరంగ క్రీడలో గ్రాండ్మాస్టర్ హోదా సాధించాలంటే తలపండిపోవాలనుకొనే రోజులు పోయాయి. వయసుకు, మేధకు, గ్రాండ్మాస్టర్ హోదాకు ఏమాత్రం సంబంధం లేదని బాలమేధావి ప్రజ్ఞానంద్ నిరూపించాడు.

తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఎత్తులు పై ఎత్తులతో సాగే చదరంగక్రీడలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం ఓ పెద్దపరీక్షే. ఐదేళ్ల వయసు నుంచే చదరంగం ఆడుతూ ఎన్నో సంచలన విజయాలు సాధించిన విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఆటగాడే...18 ఏళ్ల వయసులో కానీ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించలేకపోయాడు. అలాంటి ఘనతను తమిళనాడు చిచ్చర పిడుగు ప్రజ్ఞానంద కేవలం 12 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి...తన పేరును సార్థకం చేసుకొన్నాడు.


అమ్మ స్ఫూర్తి...అక్కప్రేరణ.....

విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీమూర్తి ఉన్నట్లే....వయసుకి మించి ప్రతిభకనబరచే చిచ్చర పిడుగుల వెనుక..అమ్మ లేదా అక్క ఉండితీరుతుంది. అదే విషయం పిల్లగ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విషయంలోనూ అనుభవమయ్యింది.

చెన్నై నగరంలోని ఓ మథ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రజ్ఞానంద...తన తల్లి నాగలక్షలక్ష్మి స్ఫూర్తి, అక్క వైశాలి ప్రేరణతో చురుకైన చదరంగ క్రీడాకారుడిగా రూపుదిద్దుకొన్నాడు. తన ఆరాధ్యదైవం విశ్వనాథన్ ఆనంద్ ఆటతీరు, వ్యూహాలను అనుసరిస్తూ...శిక్షకుడు ఆర్బీ రమేశ్ పర్యవేక్షణలో గ్రాండ్ మాస్టర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు. 12 సంవత్సరాల , 10 నెలల, 14 రోజుల వయసులో మూడో గ్రాండ్ మాస్టర్ నార్మ్ సాధించడం ద్వారా ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చరిత్రలోనే రెండో అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

భారత చెస్ ఎవర్ గ్రీన్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించి ఆ కాలంలో సంచలనం సృష్టిస్తే...ఆ తర్వాత మూడుదశాబ్దాలకు ఏళ్లకు...తమిళనాడుకే చెందిన ప్రజ్ఞానంద్ 12 ఏళ్ల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదాతో చరిత్ర సృష్టించాడు.

నాడు ఆనంద్...నేడు ప్రజ్ఞానంద్...

1980 దశకంలో ప్రపంచ చదరంగంలో బాలమేధావిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆనంద్ సాధించిన ఘనతలు, అధిరోహించిన విజయశిఖరాలు అన్నీఇన్నీకావు.

1988 లో విశ్వనాథన్ ఆనంద్ భారత చదరంగ తొలి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ముహూర్తబలం ఏమిటో కానీ....ఆ తర్వాతి కాలంలో 35 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు, ఎనిమిదిమంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 60 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఏడుగురు మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు తయారయ్యారు. అంతేకాదు...ప్రపంచ చదరంగంలోనే అత్యంత బలమైన పురుషుల, మహిళల జట్లు కలిగిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది.

అంతేకాదు...మహాబలిపురం వేదికగా ఇటీవలే ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్ పురుషుల విభాగంలో భారత- బీ జట్టు కాంస్య పతకం సాధించడంలో ప్రజ్ఞానంద్ ప్రధానపాత్ర వహించాడు. పురుషుల వ్యక్తిగత విభాగంలో సైతం ప్రజ్ఞానంద్ కాంస్య పతకం సాధించాడు.

ప్రజ్ఞానంద్ కు ఆనంద్ కితాబు...

12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ప్రజ్ఞానంద్ ను...సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసించడమే కాదు...తమ ఇంటికి ఆహ్వానించి మరీ అభినందించాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆటను ఆస్వాదిస్తూ సాగిపోమని సలహా ఇచ్చాడు.

ప్రత్యర్థి ఎంత పేరున్న, బలమైన ఆటగాడైనా పట్టించుకోకుండా ఆడటంలో ప్రజ్ఞానంద్ తర్వాతే ఎవరైనా అంటూ ఆనంద్ కితాబిచ్చాడు.

16 ఏళ్ల చిరుప్రాయానికే 2600 పాయింట్ల ఎలో రేటింగ్ కు చేరుకొన్న ప్రజ్ఞానంద్ రానున్నరోజుల్లో మరో వంద పాయింట్లు సాధించడం ద్వారా 2700 ఎలో రేటింగ్ తో సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలని కోరుకొందాం.

First Published:  31 Aug 2022 4:48 AM GMT
Next Story