Telugu Global
Sports

రాయల్స్ కొంపముంచిన నోబాల్, సన్ రైజర్స్ సంచలన విజయం!

టీ-20 క్రికెట్లో ఏదైనా సాధ్యమే. ఆఖరి బంతి పడేవరకూ అసాధ్యమన్నమాటకు చోటే లేదని రాజస్థాన్ రాయల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ రెండో అంచెమ్యాచ్ నిరూపించింది.

రాయల్స్ కొంపముంచిన నోబాల్, సన్ రైజర్స్ సంచలన విజయం!
X

రాయల్స్ కొంపముంచిన నోబాల్, సన్ రైజర్స్ సంచలన విజయం!

టీ-20 క్రికెట్లో ఏదైనా సాధ్యమే. ఆఖరి బంతి పడేవరకూ అసాధ్యమన్నమాటకు చోటే లేదని రాజస్థాన్ రాయల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ రెండో అంచెమ్యాచ్ నిరూపించింది....

ఐపీఎల్ -16వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..70 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ రెండో అంచెపోటీలు మరింతగా జోరందుకొన్నాయి. మ్యాచ్ మ్యాచ్ కూ, రౌండ్ రౌండ్ కూ పోటీలు రసవత్తరంగా సాగిపోతున్నాయి.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె హైస్కోరింగ్ పోరులో రెండుజట్లూ కలసి పరుగుల సునామీ సృష్టించాయి. ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా జరిగిన ఈ పోరులో..ఇన్నింగ్స్ ఆఖరిబంతి నోబాల్ కావడంతో నెగ్గాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడితే...ఓటమి చవిచూడాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజేతగా నిలిచింది.

40 ఓవర్లలో 429 పరుగులు....

ప్లే-ఆఫ్ రౌండ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ పోరులో..ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 214 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనింగ్ జోడీ యశస్వీ జైశ్వాల్- జోస్ బట్లర్ ఇన్నింగ్స్ తొలిబంతి నుంచే భారీషాట్లతో కదం తొక్కారు. ప్రస్తుత సీజ‌న్‌లో ఇప్పటికే రికార్డు సెంచరీతో జోరుమీదున్న యువ ఓపెనర్ య‌శ‌స్వీ జైస్వాల్ 35 పరుగుల స్కోరుకే వెనుదిరిగాడు. 54 పరుగుల స్కోరుకే రాజ‌స్థాన్ తొలివికెట్ నష్టపోయింది. యశస్వి 18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు సాధించాడు.

త‌ర్వాత క్రీజులోకి దిగిన కెప్టెన్ సంజు శాంసన్ వచ్చి ఓపెనర్ బ‌ట్ల‌ర్ తో జతకలిశాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

బట్లర్ చేజారిన శతకం..

ప్రస్తుత సీజన్లో అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో మాత్రం తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పాడు.

కేవలం 59 బంతుల్లో 10 బౌండ్రీలు, 4 సిక్సర్లతో సెంచరీకి చేరువై 95 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

డేంజర్ మాన్ బట్లర్ ను సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పడగొట్టాడు. అయితే కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాత్రం సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. న‌ట‌రాజ‌న్ వేసిన 20వ‌ ఓవ‌ర్లో సంజూ శాంస‌న్ థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా బౌండ‌రీ బాదాడు. దాంతో, రాజ‌స్థాన్ స్కోర్ 200 దాటింది. ఐదో బంతికి లాంగాన్‌లోకి సిక్స్, ఆఖ‌రి బాల్‌కు బౌండ‌రీ సాధించడంతో రాజ‌స్థాన్ జ‌ట్టు రెండు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది.

సంజు శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు, హెట్‌మెయిర్ (7) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, జాన్సెన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

సన్ రైజర్స్ ధనాధన్ బ్యాటింగ్...

215 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్‌, అభిషేక్ మొదటి వికెట్ కు అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

పవర్ ప్లే ఓవర్లలోనే మెరుపువేగంతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.

అన్‌మోల్‌ప్రీత్ సింగ్(33) అభిషేక్ శ‌ర్మ(55) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అన్ మోల్ ను లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పడగొట్టాడు.

ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్.. హాఫ్ సెంచ‌రీ కొట్టిన వెంట‌నే అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ధాటిగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్(26)ను చాహ‌ల్ పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత సూపర్ హిట్టర్ రాహుల్ త్రిపాఠి(47)ని, కెప్టెన్ మ‌ర్కరమ్ ను(6)ను ఒకే ఓవర్లో పెవీలియన్ దారి పట్టించాడు. దీంతో హైదరాబాద్ గెలుపు కష్టమనే పరిస్థితి వచ్చింది.

హ్యారీ బ్రూక్ స్థానంలో జట్టులోకి వచ్చిన గ్లెన్ ఫిలిఫ్స్ వరుస బంతుల్లో మూడు సిక్సర్లతో పాటు ఓ బౌండ్రీతో సహా 25 పరుగుల స్కోరు సాధించడం ద్వారా సన్ రైజర్స్ ను విజయం అంచులకు చేర్చాడు..

12 బంతుల్లోనే 41 పరుగులు...

యువ బ్యాటర్ల త్రయం రాణించడంతో రైజర్స్‌ పోటీలో నిలిచినా.. మిడిల్‌ ఓవర్స్‌లో అంతర్జాతీయ ఆటగాళ్లు తడబడటంతో గెలుపు కష్టమే అనిపించింది. 18 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 174/5తో నిలిచింది. విజయానికి 12 బంతుల్లో 41 పరుగులు అవసరం కాగా.. బ్రూక్‌ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న గ్లెన్‌ ఫిలిప్స్‌ శివమెత్తిపయాడు.

పేసర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6,6,6,4 బాది ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి జాన్సెన్‌ రెండు పరుగులు తీయడంతో సమీకరణం 6 బంతుల్లో 17కు చేరింది. సందీప్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి సమద్‌ ఇచ్చిన క్యాచ్‌ను మెక్‌కాయ్‌ వదిలేయగా.. రెండో బంతికి సమద్‌ భారీ సిక్సర్‌ దంచాడు. మూడో బంతికి రెండు పరుగుల రాగా.. ఆ తర్వాత బంతుల్లో భారీషాట్లు ఆడటంలో విఫలమయ్యారు.

ఆఖరి బంతికి సిక్సర్ తో గెలుపు...

మ్యాచ్ నెగ్గాలంటే సన్ రైజర్స్ ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన తరుణంలో రాయల్స్ పేసర్ సందీప్ శర్మ నోబాల్ వేయటంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైపోయింది. సమద్‌ కొట్టిన బంతిని లాంగాఫ్‌ ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో హైదరాబాద్‌ అభిమానులంతా నిరాశలో కూరుకుపోగా.. ఆ బంతి నోబాల్‌ అని అంపైర్ ప్రకటించారు. దీంతో చివరి బంతికి నాలుగు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. సమద్‌ బౌలర్‌ మీదుగా భారీషాట్ తో.. సూపర్‌ సిక్సర్‌ సాధించడం ద్వారా 4 వికెట్ల విజయాన్ని అందించాడు. సందీప్ శర్మ వేసిన నోబాల్ తోనే రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

హైదరాబాద్ సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగుల స్కోరుతో సంచలన విజయం సాధించింది.

హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ,రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) , చివర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 25; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), అబ్దుల్‌ సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు.

మూడు భారీసిక్సర్లతో మ్యాచ్ ను మలుపు తిప్పిన గ్లెన్ ఫిలిప్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

11 రౌండ్లలో రాజస్థాన్ రాయల్స్ కు ఇది 6వ ఓటమి కాగా..హైదరాబాద్ సన్ రైజర్స్ కు 10 రౌండ్లలో నాలుగో గెలుపు. ప్రస్తుత సీజన్ తొలి అంచె మొదటి ఐదుమ్యాచ్ ల్లో 4 విజయాలు, ఓ పరాజయం పొందిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాతి ఆరుమ్యాచ్ ల్లో వరుసగా మూడు పరాజయాలు చవిచూడటంతో లీగ్ టేబుల్ నాలుగోస్థానానికి పడిపోయింది.

గుజరాత్ టైటాన్స్ టాప్ గేర్.....

అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మరో పోటీలో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేయడం ద్వారా ప్లే- ఆఫ్ రౌండ్ కు గెలుపు దూరంలో నిలిచింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 226 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ఎదుట 227 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(94 నాటౌట్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో భారీస్కోరుకు మార్గం సుగమం చేశారు.

సాహా - గిల్ తొలి వికెట్‌కు 142 ప‌రుగుల రికార్డు భాగస్వామ్యం సాధించారు.ఈ జోడీని అవేశ్‌ఖాన్ వేరు చేయగలిగాడు. సాహా ఔటైన వెంటనే..మరో ఓపెనర్ గిల్ తో కలసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10) పరుగుల వేట మొదలు పెట్టాడు. అయితే..హార్థిక్ కేవలం 10 పరుగులతో వెనుదిరగడంతో మిల్ల‌ర్ మెర‌పు ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.


మేయర్స్,డి కాక్ పోరాడినా....

227 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నోకి ఓపెనింగ్ జోడీ క్వింట‌న్ డికాక్(70), కైల్ మేయ‌ర్స్(48) చక్కట ఆరంభాన్ని ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.

ప‌వ‌ర్ ప్లేలోనే మెరుపు బ్యాటింగ్ తో 72 ప‌రుగులు సాధించారు. అయితే.. మోహిత్ శ‌ర్మ ఓవ‌ర్లో ర‌షీద్ ఖాన్ అద్భుత క్యాచ్‌తో మేయ‌ర్స్‌ను పెవిలియ‌న్ దారి పట్టించాడు.

మేయర్స్ వికెట్ పడడంతో ల‌క్నో స్కోర్ నెమ్మదించింది. దీప‌క్ హుడా(11), స్టోయినిస్(4) సైతం విఫ‌ల‌మ‌య్యారు. ఆఖ‌ర్లో ఆదుకుంటాడ‌నుకున్న‌ నికోల‌స్ పూర‌న్‌(3) చేతులెత్తేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ఆయుష్ బ‌దొని(21) చివ‌ర్లో ధాటిగా ఆడాడు. దాంతో ల‌క్నో 171 ప‌రుగులు మాత్రమే చేయగలిగింది.

గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సీమర్ మోహిత్ శ‌ర్మ నాలుగు, ష‌మీ, నూర్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్ త‌లా ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఇప్పటి వరకూ జరిగిన 11 రౌండ్లలో గుజరాత్ టైటాన్స్ కు ఇది ఎనిమిదో గెలుపు కాగా..11 రౌండ్లలో లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది ఐదో ఓటమి.

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఈ రోజు జరిగే పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది.

First Published:  8 May 2023 1:09 PM IST
Next Story