ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇక లేరు.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూత
1940 అక్టోబర్ 23న బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాసియో అనే చిన్న పట్టణంలో జన్మించాడు. పీలే అసలు పేరు 'ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో'.
ఫుట్‌బాల్ క్రీడను శిఖరాల ఎత్తుకు తీసుకొని వెళ్లిన ఆటగాడు.. నల్లజాతీయులు ఎంతో వివక్ష ఎదుర్కుంటున్న రోజుల్లోనే భూజాలపైకి ఎత్తుకునేంత కీర్తిని సంపాదించిన దిగ్గజం.. జెర్సీ నెంబర్ 10కు అసలు సిసలైన హక్కుదారుడు.. పీలే, ఇక లేరు. ప్రపంచంలోనే అత్యంత మేటి ఫుట్‌బాలర్లలో ఒకడైన పీలే.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. గురువారం సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో కన్ను మూశారు. బ్రెజిల్‌కు చెందిన పీలే వయసు ప్రస్తుతం 82 ఏళ్లు. గత ఏడాది ఆయన క్యాన్సర్ బారిన పడగా.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే గురువారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు.
ఇవ్వాళ ప్రపంచమంతా ఫుట్‌బాల్ క్రీడ పాపులర్ అవడానికి కారణమైన ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటాడు. అందుకే ఆయనను ఫుట్‌బాల్‌కు వరల్డ్ అంబాసిడర్ అంటారు. బ్రెజిల్ తరపున నాలుగు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు ఆడిన పీలే.. వాటిలో మూడు గెలవడం విశేషం. ఇప్పటి వరకు ఏ ఫుట్‌బాలర్‌కు కూడా అలాంటి రికార్డు లేదు. రెండు దశాబ్దాల పాటు ఫుట్‌బాల్ మైదానాన్ని శాసించిన పీలే.. సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. బ్రెజిల్‌లోని శాంటోస్ క్లబ్, బ్రెజిల్ నేషనల్ జట్టు తరపున పీలే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ అత్యుత్తమ దేశంగా ఎదగడానికి పీలేనే కారణం. పీలే వల్లనే బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ ఒక మతంలా మారిపోయింది. పీలే తర్వాత దిగ్గజ ఆటగాళ్లు ఎవరంటే డిగో మారడోనా, లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లే వస్తాయి.
1940 అక్టోబర్ 23న బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాసియో అనే చిన్న పట్టణంలో జన్మించాడు. పీలే అసలు పేరు 'ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో'. పీలేకు తండ్రే ఆటలో తొలి గురువు. ఆయన తండ్రి కూడా ఫుట్‌బాల్ ప్లేయరే. అయితే మోకాలి గాయం కారణంగా కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. కానీ పీలే మాత్రం తండ్రి ఆశలకు తగ్గట్లుగా గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగాడు. 1956-74 వరకు సుదీర్ఘంగా సాంటోస్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక 1975-77 వరకు న్యూయార్క్ కాస్మోస్ తరపున ఆడాడు. బ్రెజిల్ నేషనల్ టీమ్ తరపున 1957 నుంచి 1971 వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1995 నుంచి 98 వరకు బ్రెజిల్ క్రీడా శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
పీలే ఎన్ని క్లబ్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. అతని వరల్డ్ కప్ రికార్డులనే అందరూ గుర్తు చేస్తారు. ఇప్పటి వరకు ఏ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా సాధించనంతగా.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచాడు. 1958, 1962, 1970లో వరల్డ్ కప్‌లు గెలుచుకున్నాడు. పీలే ఏ పొజిషన్‌లో అయినా ఆడి ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టగలడు. ఫార్వర్డ్, అటాకింగ్ మిడ్ ఫీల్డర్‌గా అతడి ఆటతీరు చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయే వారు. మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్టులోకి పంపడంతో పీలేను మించిన వాళ్లు లేరు. ఏ ఆటగాడికీ సాధ్యం కాని విధంగా.. రెండు కాళ్లతో బంత్రిని నియంత్రించే అసాధారణ ప్రతిభ పీలే సొంతం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల వ్యూహాలను, ఆలోచనను వెంటనే పసిగట్టి ఆట తీరును మార్చేసే చాకచక్యం పీలేకు ఉన్నాయి.
ఎదురుగా ఎంత మంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా.. పీలే డ్రిబ్లింగ్ చేయడం మొదలు పెడితే బంతి గోల్ పోస్టులోకి వెళ్లాల్సిందే. గాల్లో వేగంగా వచ్చే బంతిని కూడా ఒక్క స్టెప్ పడిన వెంటనే గోల్ పోస్టులోకి పంపగల సత్తా ఉన్నది. ఇప్పటి తరానికి పీలే గురించి పెద్దగా తెలియక పోయినా.. మునుపటి తరం పీలే అంటే ఎక్కడ లేని క్రేజ్ ఉండేది. 1970 వరల్డ్ కప్‌లో రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను 25 గజాల దూరం నుంచి డిఫెండర్లను తప్పించి గోల్ పోస్టులోకి కొట్టడం అతడి అభిమానులు ఇప్పటికీ మర్చి పోలేరు. 1958 ప్రపంచ కప్‌లో మోకాలి గాయంతోనే రాణించి.. జట్టుకు కప్‌ను అందించడమే కాకుండా ఉత్తమ ఆటగాడి అవార్డు కూడా గెలిచాడు. అయితే 1962, 1966 ప్రపంచ కప్‌లలో పీలే గాయం కారణంగా సరిగా రాణించలేక పోయాడు. అయితే 1970లో గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన పీలే.. అద్భుతంగా రాణించి వరల్డ్ కప్‌ను అందించడమే కాకుండా.. ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ సొంతం చేసుకున్నాడు. పీలే చివరిగా 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
పీలే తన కెరీర్‌లో 1,366 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, మిలటరీ సర్వీసులో భాగంగా ఆడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే అధికారిక టోర్నమెంట్స్‌లో 812 మ్యాచ్‌లు ఆడి 757 గోల్స్ చేశాడు. శాంటోస్ క్లబ్ తరపున 636 మ్యాచ్‌లు ఆడి 618 గోల్స్, న్యూయార్క్ కాస్మోస్ తరపున 37 మ్యాచ్‌లు ఆడి 64 గోల్స్ చేశాడు. ఇక బ్రెజిల్ జాతీయ జట్టు తరపున 77 అధికారిక మ్యాచ్‌లు ఆడి 92 గోల్స్ చేశాడు. ప్రపంచ కప్‌లలో 14 మ్యాచ్‌లు ఆడి 12 గోల్స్ చేశాడు. పీలే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. ఏడుగురు సంతానం కలిగారు. వీరిలో ఒకరు చనిపోయారు.