Telugu Global
Sports

యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా సంచలనం!

ప్రతిష్టాత్మక 2023 యాషెస్ సిరీస్ ను ప్రపంచ టెస్టు చాంపియన్ ఆస్ట్ర్రేలియా సంచలన విజయంతో మొదలు పెట్టింది.

యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా సంచలనం!
X

యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా సంచలనం!

ప్రతిష్టాత్మక 2023 యాషెస్ సిరీస్ ను ప్రపంచ టెస్టు చాంపియన్ ఆస్ట్ర్రేలియా సంచలన విజయంతో మొదలు పెట్టింది. ఆతిథ్య ఇంగ్లండ్ పై 2 వికెట్ల విజయంతో తొలిటెస్టును సొంతం చేసుకోడం ద్వారా పైచేయి సాధించింది....

సాంప్రదాయ టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్, ప్రపంచ టెస్టు లీగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా ..బ్రిటీషుగడ్డపై తన విజయపరంపరను కొనసాగిస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ నాయకత్వంలోని కంగారూజట్టు..' బజ్ బాల్ స్టయిల్ ' పేరుతో నానాహంగామా చేస్తున్న ఇంగ్లండ్ జట్టును సిరీస్ లోని తొలిటెస్టులోనే కంగు తినిపించింది.

మాంచెస్టర్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా గత ఐదురోజులుగా నువ్వానేనా అన్నట్లుగా సాగుతూ వచ్చిన పోరులో ఆస్ట్ర్రేలియాజోడీ పాట్ కమిన్స్- నేథన్ లయన్ 9వ వికెట్ కు కీలక హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో అజేయంగా నిలవడం ద్వారా తమజట్టుకు 2 వికెట్ల సంచలన విజయం అందించారు.

ఉస్మాన్ క్వాజా షో.......

వరుణుడి దోబూచులాట నడుమ ఆఖరిరోజు ఆఖరి సెషన్ వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో 281 పరుగుల టార్గెట్ ను ఆస్ట్ర్రేలియా 8 వికెట్ల నష్టానికే చేరుకోగలిగింది.

యాషెస్ సిరీస్ లో గత 72 సంవత్సరాల కాలంలో నాలుగో ఇన్నింగ్స్ లో ఇంత పెద్ద లక్ష్యాన్ని కంగారూ జట్టు చేధించగలగటం ఇదే మొదటిసారి.

3 వికెట్లకు 107 పరుగుల స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆఖరిరోజున కొనసాగించిన ఆస్ట్ర్రేలియాను 9వ వికెట్ జోడీ పాట్ కమిన్స్- నేథన్ లయన్ 8 వికెట్లతో విజేతగా నిలిపారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన డాషింగ్ ఓపెనర్ ఉస్మాన్‌ క్వాజా..రెండో ఇన్నింగ్స్ లో సైతం కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 197 బంతుల్లో 7 బౌండ్రీలతో 65పరుగులతో విజయానికి చేరువ చేశాడు.

కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్‌ గ్రీన్‌ (28), అలెక్స్‌ కేరీ (20) అమూల్యమైన పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ 3, రాబిన్‌సన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి గెలుపు కష్టమే అనుకున్న దశలో ఆసీస్‌ గొప్పగా పోరాడింది. లియాన్‌ (16 నాటౌట్‌)తో కలిసి కమిన్స్‌ 9వ వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించడంతో కంగారూలు విజయం సాధించారు. ఉస్మాన్ క్వాజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఓడినా అదే దూకుడు- బెన్ స్టోక్స్....

తొలిటెస్టులో తమ వ్యూహం బెడిసి కొట్టినా సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ ల్లోనూ ' బజ్ బాల్ ' తంత్రాన్నే కొనసాగిస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను దూకుడుగా ఆడే విధానాన్ని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ బజ్ బాల్ వ్యూహం పేరుతో అనుసరిస్తూ వస్తోంది. తొలిటెస్టులో ఓడినా మిగిలిన టెస్టుల్లో కంగారూల పనిపడతామని ఇంగ్లండ్ కెప్టెన్ ధీమాగా చెబుతున్నాడు. సిరీస్ లోని రెండోటెస్టుమ్యాచ్..జూన్ 28 నుంచి జులై 2 వరకూ జరుగనుంది.

ఓవల్ వేదికగా ఇటీవలే ముగిసిన టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ను 209 పరుగులతో చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా నిలిచిన కంగారూజట్టు..యాషెస్ సిరీస్ ను సైతం గెలుపుతో ప్రారంభించడంతో ఇంగ్లండ్ తీవ్రఒత్తిడిలో పడిపోయింది.

First Published:  21 Jun 2023 6:30 PM IST
Next Story