పారిస్ ఒలింపిక్స్ కు భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ అర్హత!
భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో బెర్త్ ఖాయం చేసుకొన్నాడు..
భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో బెర్త్ ఖాయం చేసుకొన్నాడు..
పారిస్ వేదికగా జులై- ఆగస్టు మాసాలలో జరుగనున్న 2024 వేసవి ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో భారత నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలలో గత ఏడాదిగా నిలకడగా రాణిస్తూ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకోడం ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగాడు.
95 నుంచి 71వ ర్యాంక్ కు...
ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 71వ స్థానంలో నిలవడం ద్వారా సుమిత్ ఒలింపిక్స్ బరిలో నిలవడానికి అర్హత సాధించాడు. గతంలో పురుషుల సింగిల్స్ 95వ ర్యాంక్ లో నిలిచిన సుమిత్ పలు గ్రాండ్ స్లామ్ టోర్నీలు, ఏటీపీ టూర్ పోటీలలో సంచలన విజయాలు సాధించడం ద్వారా ర్యాంకింగ్ ను అనూహ్యంగా మెరుగు పరచుకోగలిగాడు.
ర్యాంకింగ్స్ ప్రాతిపదికన వివిధ దేశాల ఆటగాళ్లకు ఒలింపిక్స్ బెర్త్ లను నిర్వాహక సంఘం కేటాయిస్తూ వస్తోంది. ఫ్రాన్స్ నాలుగు కు నాలుగు కోటా బెర్త్ లను సొంతం చేసుకోగా..భారత్ ఒకే ఒక్క స్థానాన్ని సుమిత్ రూపంలో దక్కించుకోగలిగింది.
జర్మనీ వేదికగా జరిగిన ఏటీపీ చాలెంజర్ టైటిల్ ను సుమిత్ నగాల్ సొంతం చేసుకోడం ద్వారా ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాక గలిగాడు.
ఒలింపిక్స్ సింగిల్స్ లో 64 మంది పోటీ...
పారిస్ ఒలింపిక్స్ పురుషుల, మహిళల సింగిల్స్ లో ర్యాంకింగ్స్ ఆధారంగా కేవలం 64 మంది అత్యుత్తమ క్రీడాకారులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. ఒలింపిక్స్ పురుషుల , మహిళల సింగిల్స్ , డబుల్స్ విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం 64 మంది క్రీడాకారులు, లేదా జట్ల నడుమ మాత్రమే పోటీజరుగుతుంది.
మొత్తం 64 మందిలో ముగ్గురు అదృష్టవంతులకు మాత్రమే ఒలింపిక్స్ పతకాలు సాధించే అవకాశం ఉంటుంది.
2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో పాల్గొన్న సమయంలో సుమిత్ ర్యాంక్ 138 కాగా.. ప్రస్తుత ఒలింపిక్స్ లో 71 కావడం విశేషం.
ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 56 స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు నేరుగా ఒలింపిక్స్ డ్రాలో తలపడే అవకాశం ఉంది. మిగిలిన 8 బెర్త్ లను వివిధ దేశాలు తమతమ కోటా కింద దక్కించుకోవాల్సి ఉంటుంది.
అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో లియాండర్ పేస్ పాల్గొని కాంస్య పతకం సాధించిన తరువాత..ఒలింపిక్స్ సింగిల్స్ బరిలో నిలిచిన మరో భారత ఆటగాడు 26 సంవత్సరాల సుమిత్ నగాల్ మాత్రమే.
పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న కు బెర్త్...
పురుషుల డబుల్స్ లో భారత సూపర్ స్టార్ రోహన్ బొపన్న ఒలింపిక్స్ కు అలవోకగా అర్హత సంపాదించాడు. పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ ప్రకారం 4వ స్థానంలో ఉండటం ద్వారా రోహన్ 44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ బరిలోకి దిగనున్నాడు.
ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల, మహిళల డబుల్స్ లో 32 జట్లు తొలిరౌండ్ నుంచి తలపడనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో 67వ ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీతో జంటగా 4వ ర్యాంకర్ రోహన్ బొపన్న తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
రోహన్ కు 201 లండన్, 2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొన రికార్డు ఉంది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి ముందే రోహన్ సన్నాహాల కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ కోటిరూపాయలకు పైగా వ్యయం చేసింది.
ఫ్రెంచ్ ఓపెన్ వేదిక రోలాండ్ గారోస్ క్లేకోర్టుల్లోనే పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ కు ముందు..జులై 1 నుంచి జరిగే 2024 వింబుల్డన్ గ్రాస్ కోర్టు సమరంలో సుమిత్ నగాల్ పాల్గోనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి.