ఎంత పని చేశావ్ పాండ్యా.. నీవల్ల ద్రవిడ్‌ను ఆడేసుకుంటున్నారుగా..!
నువ్వే విన్నింగ్ షాట్ కొట్టు అంటూ తనకొచ్చిన ఈజీ బాల్‌ను కూడా డిఫెండ్ చేసి స్ట్రైకింగ్ కోహ్లీకి ఇచ్చిన ధోనీని గుర్తు చేస్తూ కొందరు పాండ్యాను ఆడేసుకుంటున్నారు
వెస్టిండీస్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఓడి.. సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సాధించిన అద్భుత విజయం ఇప్పుడు జనం దృష్టిలో లేదు. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్ బాదేసి అతన్ని ఆ ఘనతకు దూరం చేశాడన్నదే ఇప్పుడు ఇంటర్నెట్‌లోనూ, క్రికెట్ ప్రపంచంలోనూ చర్చ. స్వార్థపరుడు హార్దిక్ పాండ్యా అని ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.
నువ్వే విన్నింగ్ షాట్ కొట్టు అంటూ తనకొచ్చిన ఈజీ బాల్‌ను కూడా డిఫెండ్ చేసి స్ట్రైకింగ్ కోహ్లీకి ఇచ్చిన ధోనీని గుర్తు చేస్తూ కొందరు పాండ్యాను ఆడేసుకుంటున్నారు. నాయకుడనేవాడు అలా ఉండాలంటూ ధోనీ, కోహ్లీలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అయినా అక్కడ కావాల్సినన్ని బాల్స్ ఉన్నాయి.. కొట్టాల్సింది రెండు పరుగులే అయినప్పుడు పాండ్యా సిక్స్ బాదేయాల్సిన అవసరం ఏముందని ఆకాశ్ చోప్రా లాంటి మాజీ ప్లేయర్లూ కామెంట్ చేస్తున్నారు.
మరికొంత మంది అయితే మరో అడుగు ముందుకేసి కోచ్‌కు తగ్గ కెప్టెన్ అంటూ ఈ వివాదంలోకి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌నూ లాగుతున్నారు. 2004లో పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ 194 పరుగుల మీద ఉండగా అప్పటి యాక్టింగ్ కెప్టెన్ ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎప్పుడో 20 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటనను బయటికి తీసి మరీ ఫ్యాన్స్ ద్రవిడ్‌నూ వాయించేస్తుంటే.. ఎంత పని చేశావూ పాండ్యా అంటూ ద వాల్ అభిమానులు నిట్టూరుస్తున్నారు.