Telugu Global
Sports

నేడు భారత్ తో పాక్ పోరు, పొంచిఉన్న వానముప్పు!

2023- ఆసియాకప్ లీగ్ దశలోనే అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. పల్లెకెలీ వేదికగా ఈ రోజు జరిగే పోరులో ప్రపంచ నంబర్ వన్ టీమ్ పాకిస్థాన్ కు 3వ ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది.

నేడు భారత్ తో పాక్ పోరు, పొంచిఉన్న వానముప్పు!
X

2023- ఆసియాకప్ లీగ్ దశలోనే అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. పల్లెకెలీ వేదికగా ఈ రోజు జరిగే పోరులో ప్రపంచ నంబర్ వన్ టీమ్ పాకిస్థాన్ కు 3వ ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది...

క్రీడలు ఏవైనా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్లు తలపడితే అది ఓ భావోద్వేగాల సమరంలా సాగుతూ ఉభయదేశాల అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయటం

ఆనవాయితీగా వస్తోంది. ఆ పరంపరకు కొనసాగింపుగా ఈరోజు శ్రీలంకలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఆసియాకప్ గ్రూప్- ఏ లీగ్ పోరు సైతం హాట్ హాటుగా జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ కు వానముప్పు పొంచిఉంది.వర్షం కురిసే అవకాశాలు 60 శాతం వరకూ ఉన్నాయి, మ్యాచ్ జరిగే సమయమంతా ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలు కమ్మి ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

స్లోబౌలర్ల అడ్డాలో హోరాహోరీ.....

బ్యాటింగ్ కు, ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేయర్లకు అంతగా అనువుకాని పల్లెకెలీ స్లో పిచ్ పైన ఇటు పాకిస్థాన్, అటు భారత్ ఫాస్ట్ బౌలర్లతో పోటీకి సై అంటున్నాయి.

పాక్ జట్టులో షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, హారిస్ రవూఫ్ లాంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లుంటే..మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లతో భారత్ పోటీకి దిగుతోంది.

లోస్కోరింగ్ మ్యాచ్ లకు మరో పేరైన పల్లెకెలీ స్టేడియం పిచ్ పైన సంయమనంతో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నజట్టుకే విజయావకాశాలున్నాయి. పసికూన నేపాల్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, మిడిలార్డర్ ఆటగాడు ఇఫ్తీకర్ అహ్మద్ సెంచరీలతో చెలరేగిపోడం ద్వారా భారత్ తో పోరుకు సిద్ధమయ్యారు.

ఇక..భారత్ సైతం పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ లో తలపడిన తర్వాత ఈ రెండుజట్లూ తిరిగి మరో వన్డే మ్యాచ్ లో పోటీకి దిగటం ఇదే మొదటిసారి.

స్పిన్ బౌలర్ల్లే మ్యాచ్ విన్నర్లు!

మ్యాచ్ కు వేదికగా ఉన్న పల్లెకెలీ పిచ్ పైన రెండుజట్లలోని స్పిన్ బౌలర్లు కీలకం కానున్నారు. 2022 తర్వాత నుంచి రెండుజట్ల స్పిన్నర్ల గణాంకాలు చూస్తే..భారత్ దే పైచేయిగా కనిపిస్తోంది. 2022 సీజన్ నుంచి ప్రస్తుత 2023 సీజన్ వరకూ పాక్ స్పిన్నర్లు 5.3 ఎకానమీత 57 వికెట్లు పడగొడితే..భారత స్పిన్నర్లు మాత్రం5.1 ఎకానమీ 100 వికెట్లు పడగొట్టడం విశేషం.

పాక్ జట్టు లెగ్ స్పిన్నర్ షదాబ్ ఖాన్, లెఫ్టామ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ లపైన ఆధారపడి ఉంటే..భారత్ మాత్రం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ల జోడీ జడేజా, అక్షర్ పటేల్ లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.

రోహిత్ , విరాట్ లకు లెఫ్టామ్ బౌలర్ల టెన్షన్...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీలకు పాక్ ఓపెనింగ్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ టెన్షన్ పట్టుకొంది. 2021 సీజన్ నుంచి లెఫ్టామ్ పేసర్లను ఎదుర్కొన్న సమయంలో రోహిత్ సగటు 25.8కి మాత్రమే పరిమితమయ్యింది.

విరాట్ కొహ్లీకి లెఫ్టామ్ స్పిన్ బౌలర్లకు దొరికిపోడం ఓ బలహీనతగా మారింది. కొహ్లీ ఇటీవలి కాలంలో ఏడుసార్లు లెఫ్టామ్ స్పిన్ బౌలర్లకు చిక్కడం విశేషం. 14.57 సగటు మాత్రమే ఉంది. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం లెఫ్టామ్ స్పిన్ బౌలింగ్ లో ఐదుసార్లు అవుట్ కావడంతో పాటు 29 మాత్రమే సగటు ఉండడంతో..మహ్మద్ నవాజ్ ను తుదిజట్టులోకి పాక్ మేనేజ్ మెంట్ తీసుకొనే అవకాశం ఉంది.

అంతేకాదు..పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, వన్ డౌన్ ఫకర్ జమాన్ లను సైతం రెండేసిసార్లు పడగొట్టిన ఘనత భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ఉంది. కుల్దీప్ ప్రత్యర్థిగా బాబర్ కు 9, ఫకర్ జమాన్ కు 14 సగటు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పాక్ కెప్టెన్ కు అంతంత మాత్రమే రికార్డు..

వన్డేలలో నంబర్ వన్ బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కు భారత్ ప్రత్యర్థిగా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. భారత్ తో ఆడిన ఐదు వన్డేలలో బాబర్ 48 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 158 పరుగులు మాత్రమే సాధించి..31.60 సగటుతో ఉన్నాడు.

ఇక..భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాక్ ప్రత్యర్థిగా మూడుసార్లు 90కి పైగా స్కోర్లు సాధించడం విశేషం. పాక్ తో గత ఐదు వన్డే ఇన్నింగ్స్ లో రోహిత్ 91, 0, 52, 111 నాటౌట్, 140 స్కోర్లు నమోదు చేశాడు.

గణాంకాల సంగతి ఎలా ఉన్నా..పల్లెకెలీ స్లో పిచ్ పైన జరుగుతున్న ఈ తాజామ్యాచ్ ఆసక్తికరంగా సాగటం ఖాయం. అందులో సందేహమేలేదు. భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  2 Sept 2023 10:00 AM IST
Next Story