Telugu Global
Sports

పాక్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో పాకిస్థాన్ ఓపెనర్లు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరాచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ-20 పోరులో మొదటి వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించారు.

పాక్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!
X

ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్ - మహ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయారు. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో తమ జట్టుకు ఎదురైన పరాజయానికి...కరాచీ వేదికగా జరిగిన రెండో పోరులో బదులు తీర్చుకొన్నారు. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తమదేశ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు పాక్ ఓపెనింగ్ జోడీ తమ ప్రతాపం చవిచూపించారు. పరుగుల వెల్లువలా సాగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు...పాక్ ఎదుట 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

బాబర్ అజమ్ సూపర్ సెంచరీ...

200 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన పాక్ జట్టుకు సూపర్ స్టార్ ఓపెనింగ్ జోడీ బాబర్ అజమ్- మహ్మద్ రిజ్వాన్ 203 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో 10 వికెట్ల విజయం అందించారు. కెప్టెన్ బాబర్ కేవలం 62 బాల్స్ లోనే తన రెండో టీ-20 శతకం పూర్తి చేయగా...వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ 51 బాల్స్ లో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 19.3 ఓవర్లలోనే పాక్ జట్టు విజయం సాధించడంలో ఓపెనింగ్ జోడీ ప్రధాన పాత్ర పోషించారు. గత సీజన్లో దక్షిణాఫ్రికాపైన సాధించిన 197 పరుగుల భాగస్వామ్య రికార్డును బాబర్ - రిజ్వాన్ జోడీ తెరమరుగు చేయడం ద్వారా తమ రికార్డును తామే అధిగమించగలిగారు.

టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌ల చరిత్రలో మొదటి వికెట్ కు అత్యధిక చేజింగ్ రికార్డు ఇదే కావటం విశేషం.

ఇటీవలే ముగిసిన ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో కంగుతిన్న పాక్ జట్టు...ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లోని తొలిమ్యాచ్‌లో సైతం పరాజయం చవిచూసింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత పాక్ జట్టు ఈ సంచలన విజయంతో తిరిగి పుంజుకోగలిగింది.

First Published:  23 Sept 2022 11:53 AM IST
Next Story