Telugu Global
Sports

వర్షం పడొద్దు, ఇండియా గెలవాలి.. పాక్ అభిమానుల ప్రార్థనలు

సూపర్ 12 గ్రూప్ 2లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఇండియా 4 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నది. ఇక సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు చెరి మూడు పాయింట్లతో ఉన్నాయి.

వర్షం పడొద్దు, ఇండియా గెలవాలి.. పాక్ అభిమానుల ప్రార్థనలు
X

దేవుడా ఇండియా గెలవాలి.. దేవుడా పెర్త్‌లో రేపు వర్షం పడకూడదు.. దేవుడా ఈ మ్యాచ్ సక్రమంగా జరిగేలా చూడు.. ఇలా ప్రెయర్ చేస్తున్నారు. అయితే అలా ప్రార్థన చేస్తోంది భారత క్రికెట్ అభిమానులు కాదు. మన దాయాది దేశమైన పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో రేపు (అక్టోబర్ ౩౦) కీలకమైన మ్యాచ్ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్తాన్‌కు కీలకమైనది. ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్.. సెమీస్ చేరాలంటే ఇండియా ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.

సూపర్ 12 గ్రూప్ 2లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఇండియా 4 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నది. ఇక సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు చెరి మూడు పాయింట్లతో ఉన్నాయి. బంగ్లాదేశ్ తర్వాత స్థానంలో ఉండగా.. పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఆ జట్టు తర్వాత జరిగే మూడు మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌పై గెలవడమే కాదు.. అదే సమయంలో ఇండియా కూడా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేను ఓడించాలి. అంతే కాకుండా సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు వారికి మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలవాలి.

ఇవన్నీ సాధ్యం అయితే.. అప్పుడు ఇండియా 10 పాయింట్లతో, పాకిస్తాన్ 6 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. ఒక వేళ పైన పేర్కొన్న ఏ మ్యాచ్‌కు అయినా వర్షం అడ్డంకిగా నిలిచినా.. పాకిస్తాన్ ఆశలు అడియాశలే అవుతాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే ఇండియా మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవడం అసాధ్యమేమీ కాదు. కానీ సౌతాఫ్రికా మిగిలిన మూడింట ఒకటే గెలవడం అంటే పాక్ అభిమానులది అత్యాశే అవుతుంది.

గత టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్ దశలో ఇండియా పరిస్థితి ఎలా ఉన్నదో.. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం అలాగే మారిపోయింది. యూఏఈలో వర్షం బెడద లేదు. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం వరుసగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన కీలక మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సౌతాఫ్రికా కూడా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గెలవాల్సి ఉండగా.. మ్యాచ్ కారణంగా ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నది. మరి పాకిస్తాన్ అభిమానుల ప్రార్థనలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

First Published:  29 Oct 2022 7:44 PM IST
Next Story