Telugu Global
Sports

ఆసియాకప్ తొలిపోరులోనే సెంచరీల మోత!

2023 ఆసియాకప్ వన్డే టోర్నీ ప్రారంభమ్యాచ్ లోనే పాక్ బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 15 ఏళ్ల రికార్డును పాక్ కెప్టెన్ బాబర్ అజ‌మ్ తెరమరుగు చేశాడు.

ఆసియాకప్ తొలిపోరులోనే సెంచరీల మోత!
X

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా పాక్, శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఆసియాకప్ ప్రారంభమ్యాచ్ లోనే పాక్ బ్యాటర్లు సెంచరీలతో చెలరేగారు. ముల్తాన్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్- ఏ ప్రారంభమ్యాచ్ లో పసికూన నేపాల్ ను పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.

విరాట్ 9 ఏళ్ల రికార్డు తెరమరుగు..

మొత్తం ఆరుజట్ల ఈ టోర్నీ గ్రూప్- ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. పాక్ కెప్టెన్ కమ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ బాబర్ అజమ్, మిడిలార్డర్ ఆటగాడు ఇఫ్తీకర్ అహ్మద్ సెంచరీలతో డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. బాబర్ 131 బంతుల్లో 14 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 151 పరుగులు, ఇఫ్తీకర్ 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగుల స్కోర్లు సాధించారు. ఈ క్రమంలో బాబర్ అజమ్ వన్డేలలో తన 19వ శతకం బాదడం ద్వారా.. ఆసియాకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. 9 ఏళ్ళ క్రితం భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 2014 ఆసియాకప్ టోర్నీలో ఫతుల్లా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో సాధించిన 136 పరుగుల స్కోరు రికార్డును బాబర్ అధిగమించాడు. అంతేకాదు.. ఆసియాకప్ లో 150కి పైగా పరుగులు సాధించిన కెప్టెన్ గాను బాబర్ అజమ్ మరో రికార్డు సొంతం చేసుకొన్నాడు. 2000 ఆసియాకప్ టోర్నీలో భారత సారథిగా సౌరవ్ గంగూలీ 135 పరుగుల నాటౌట్ స్కోరుతో రికార్డు నెలకొల్పితే.. విరాట్ 136 పరుగుల స్కోరుతో అదే రికార్డును అధిగమించాడు. ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు విరాట్ పేరుతో ఉన్న రికార్డును బాబర్ అజమ్ తెరమరుగు చేయగలిగాడు.

నేడు శ్రీలంకతో బంగ్లా ఢీ..

గ్రూప్- బీ లీగ్ లో భాగంగా పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది. ఏడుసార్లు ఆసియాకప్ విజేత భారత్ తన ప్రారంభమ్యాచ్ ను పల్లెకెలీ వేదికగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోటీపడనుంది.

*

First Published:  31 Aug 2023 8:30 AM GMT
Next Story