హైదరాబాద్ బిర్యానీ లాగించాం.. అందుకే ఫీల్డింగ్ చేయలేకపోతున్నాం
ఎంతగా అంటే వాళ్లు మన హైదరాబాద్‌తోనూ, ఇక్కడి బిర్యానీతోనూ ప్యార్ మే పడిపోయామే అని బహిరంగంగా ప్రకటించేంత ప్రేమలో పడిపోయారు.
వరల్డ్‌కప్ పుణ్యమా అని చాలా సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన పాకిస్తాన్ క్రికెటర్లు మన ఆతిథ్యాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకు ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణం, ఇక్కడి బిర్యానీ తెగ నచ్చేస్తున్నాయి. ఎంతగా అంటే వాళ్లు మన హైదరాబాద్‌తోనూ, ఇక్కడి బిర్యానీతోనూ ప్యార్ మే పడిపోయామే అని బహిరంగంగా ప్రకటించేంత ప్రేమలో పడిపోయారు. తాజాగా ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం.
బిర్యానీ దెబ్బకు కదల్లేకపోతున్నాం
ఈ వామప్ మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లు కొన్ని సులువైన క్యాచ్‌లు వదిలేశారు. ఫీల్డింగ్‌లోనూ బద్దకంగా కనిపించారు. అదే మాట మ్యాచ్ ముగిశాక ఆ జట్టు వైస్ కెప్టెన్, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షాదాబ్ ఖాన్‌ను అడిగితే అవును మేం హైదరాబాద్ బిర్యానీని కాస్త ఎక్కువే లాగించాం.. అందుకే కాస్త బద్దకంగా కదులుతున్నామని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజూ హైదరాబాద్ బిర్యానీ తింటున్నామని చెప్పాడు.
హైదరాబాద్ బిర్యానీకి 10కి 20 మార్కులు
తమ కరాచీ బిర్యానీ కంటే హైదరాబాద్ బిర్యానీయే బాగుందని పాక్ క్రికెటర్ హసన్ అలీ చెప్పాడు. మరో క్రికెటర్ హరీస్ రవూఫ్ అయితే హైదరాబాద్ బిర్యానీకి ఏకంగా 10కి 20 మార్కులేసి ప్రేమ చాటుకున్నాడు.