Telugu Global
Sports

నేటినుంచే ఒవల్ టెస్టు..టెస్టులీగ్ ఫైనల్స్ కు బౌన్సీ పిచ్!

2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరానికి లండన్ లోని ఓవల్ స్టేడియంలో బౌన్సీ పిచ్ సిద్ధంగా ఉంది. ఐదురోజుల ఈ పోరు పేస్- స్వింగ్ బౌలర్ల యుద్ధంలా సాగనుంది....

నేటినుంచే ఒవల్ టెస్టు..టెస్టులీగ్ ఫైనల్స్ కు బౌన్సీ పిచ్!
X

2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరానికి లండన్ లోని ఓవల్ స్టేడియంలో బౌన్సీ పిచ్ సిద్ధంగా ఉంది. ఐదురోజుల ఈ పోరు పేస్- స్వింగ్ బౌలర్ల యుద్ధంలా సాగనుంది....

టెస్టుహోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో తొలి ప్రపంచ టైటిల్ కోసం టాప్ ర్యాంకర్ భారత్, రెండో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఉరకలేస్తున్నాయి.

జూన్ 7 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ సమరం కోసం ఓవల్ స్టేడియం సకలహంగులతో ముస్తాబయ్యింది.

బౌన్సీపిచ్ పైన టైటిల్ పోరు...

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల టైటిల్ పోరు కోసం సిద్ధం చేసిన ఓవల్ పిచ్..బౌన్స్ కావడం తథ్యమని క్యూరేటర్ లీజ్ ప్రకటించారు. భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ కోసం ఓవల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లీజ్ పాల్గొన్నారు.

బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా ఉపకరించే పిచ్ లను తయారు చేయటంలో చేయితిరిగిన క్యూరేటర్ గా లీజ్ కు పేరుంది. రానున్న ఐదురోజులు ( జూన్ 7 నుంచి 11 వరకూ ) ఓవల్ పిచ్ పైన జరిగే టెస్టు లీగ్ ఫైనల్లో బౌన్స్ కావడం ఖాయమని లీజ్ స్పష్టం చేశారు.

దీంతో..తుదిజట్లలో ఇద్దరు స్పిన్నర్లుంటారా? లేక ఒక్క స్పిన్నర్ కు మాత్రమే చోటు ఉంటుందా? అన్న అంశాలపైన చర్చకు తెరలేచింది.

ఇటు అశ్విన్..అటు జడేజా..ఎవరికో చోటు?

టెస్టులీగ్ ఫైనల్లో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు పైన కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో కూడిన టీమ్ మేనేజ్ మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.

భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి లాంటి అపారఅనుభవం ఉన్న క్రికెట్ దిగ్గజాలు మాత్రం..తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లు ( అశ్విన్, జడేజా ) ఉండి తీరాల్సిందేనని, భారత్ బలమే స్పిన్ బౌలింగ్ అని చెబుతున్నారు.

ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లలో..ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ( మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ లేదా శార్దూల్ ఠాకూర్) ఇద్దరు స్పిన్నర్లు ( అశ్విన్, జడేజా )

ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

పైగా..మిడిలార్డర్లో అశ్విన్, జడేజాలు ఇద్దరూ నమ్మదగిన బ్యాటర్లు కావడంతో..ఈ ఇద్దరికీ తుదిజట్టులో చోటు కల్పించడం ద్వారా సమతూకం సాధించడం తేలికవుతుంది.

ఓవల్ పిచ్ ..స్పిన్ బౌలింగ్ కు అనుకూలం కాకుంటే..నలుగురు పేసర్లు, సింగిల్ స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం సైతం లేకపోలేదు. ఆ పరిస్థితిలో తుదిజట్టులో జడేజా లేదా అశ్విన్ లలో ఒక్కరికి మాత్రమే చోటు దక్కనుంది.

పేస్ బౌలింగే అస్త్ర్రంగా కంగారూ టీమ్..

పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా మాత్రం నలుగురు ఫాస్ట్ బౌలర్లు ( కమిన్స్, స్టార్క్, బోలాండ్, కామెరాన్ గ్రీన్ ) సింగిల్ స్పిన్నర్ (నేథన్ లయన్ )తో బరిలోకి దిగనుంది. రెండో స్పిన్నర్ ను తుదిజట్టులోకి తీసుకోవాల్సి వస్తే..యువఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి చోటు దక్కనుంది.

భారతజట్టుకు అనుకూలంగా ఓవల్ పిచ్...

ఓవల్ స్టేడియంలోని పిచ్, వాతావరణం..ఆస్ట్ర్రేలియా జట్టు కంటే..భారతజట్టుకే అనువుగా ఉంటుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సీమ్, స్వింగ్ బౌలింగ్ కు అనువుగా ఉండే ఇంగ్లండ్ లో స్పిన్నర్లకు అనుకూలించే ఏకైక పిచ్ ఓవల్ లో మాత్రమే ఉందని, భారత బ్యాటర్లు, బౌలర్లకు ఇక్కడి వాతావరణం అతికినట్లు సరిపోతుందని చెబుతున్నారు.

అయితే..ఓవల్ వేదికగా గత నాలుగుదశాబ్దాల కాలంగా భారత్ ఆడిన టెస్టుల్లో రికార్డు మాత్రం ఏమంత గొప్పగా లేదు. 1936 సిరీస్ నుంచి 2021 సిరీస్ వరకూ ఓవల్ వేదికగా 14 టెస్టులు ఆడిన భారత్ కు రెండంటే రెండు విజయాలు మాత్రమే ఉన్నాయి.

5 మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసిన భారత్ మరో 7 టెస్టులను డ్రాగా ముగించడం ద్వారా 14.39 విజయశాతం మాత్రమే సాధించగలిగింది. 1971లో అజిత్ వడేకర్ నాయకత్వంలోని భారతజట్టు 4 వికెట్లతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధిస్తే..2021 సిరీస్ లో విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో 157 పరుగుల భారీవిజయం నమోదు చేయగలిగింది.

ఆస్ట్ర్రేలియా రికార్డూ అంతంత మాత్రమే!

1882 నుంచి ఓవల్ వేదికగా ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టెస్టుమ్యాచ్ లు ఆడుతూ వచ్చిన అనుభవం కంగారూ టీమ్ కు ఉంది. మొత్తం 38 టెస్టుల్లో ఆస్ట్ర్రేలియా ఏడుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది. 17 పరాజయాలు, 14 డ్రాల రికార్డుతో 18.42 విజయశాతంతో ఉంది.

ఓవల్ తటస్థ వేదికగా జరుగుతున్న టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ నెగ్గినా లేదా ఆస్ట్ర్రేలియా విజేతగా నిలిచినా..అది సరికొత్త రికార్డే అవుతుంది. 2021 టెస్టు లీగ్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందిన భారత్..వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా ఐసీసీ టెస్టులీగ్ ట్రోఫీకి గురి పెట్టింది.

First Published:  7 Jun 2023 8:45 AM IST
Next Story