వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జబేర్, మార్కెటా!
2023 వింబుల్డన్ మహిళల టెన్నిస్ టైటిల్ సమరానికి చెక్ సంచలనం మార్కెటా వోండ్రుసోవా, ట్యునీసియన్ థండర్ ఓన్స్ జబేర్ చేరుకొన్నారు.
2023 వింబుల్డన్ మహిళల టెన్నిస్ టైటిల్ సమరానికి చెక్ సంచలనం మార్కెటా వోండ్రుసోవా, ట్యునీసియన్ థండర్ ఓన్స్ జబేర్ చేరుకొన్నారు. సెమీస్ లో ఫైటింగ్ విజయాలు సాధించారు.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సెమీఫైనల్స్ లో 6వ సీడ్ ఓన్స్ జబేర్, చెక్ ప్లేయర్ మార్కెటా వోండ్రుసోవా విజయాలు సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టారు. అయితే..తొలిరౌండ్ నుంచి సంచలన విజయాలు సాధిస్తూ వచ్చిన పిల్లతల్లి, ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా, బెలారస్ స్టార్ అర్యానా సబలెంకాల పోరు సెమీస్ లోనే ముగిసింది.
జబేర్ వరుసగా రెండోసారి...
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో అసాధారణ విజయాలు సాధిస్తున్న తొలి అరబ్ మహిళ, ట్యునీసియాకు చెందిన ఓన్స్ జబేర్ వరుసగా రెండోసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.
గతేడాది రన్నరప్ జబేర్ 6వ సీడ్ హోదాలో ప్రస్తుత 2023 సీజన్ టోర్నీ బరిలో నిలిచింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన రెండో సెమీఫైనల్లో ఓటమి అంచుల నుంచి బయటపడి..బెలారస్ ప్లేయర్ అర్యానా సబలెంకాపై సంచలన విజయం సాధించింది.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఈ పోరులో జబేర్ 6-7, 6-4, 6-3తో సబలెంకాను అధిగమించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొంది.
2 గంటల 19 నిమిషాల పాటు సాగిన పోరులో జబేర్ మూడు ఏస్‌లే కొట్టింది.కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చింది. మరోవైపు 10 ఏస్‌లు, 39 విన్నర్లతో ప్రత్యర్థి కన్నా ఎంతో ముందు నిలిచిన సబలెంక..చివర్లో ఒత్తిడికి చిత్తైంది.
గత వింబుల్డన్ టైటిల్ పోరులో ఎలీనా రిబకినా చేతిలో పొందిన ఓటమి అనుభవంతో జబేర్ తుదివరకూ పోరాడింది. అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంది.వరుసగా రెండోసారి వింబుల్డన్ ఫైనల్స్ చేరిన ఏకైక అరబ్ మహిళగా జబేర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
అన్‌సీడెడ్‌గా ఫైనల్లో వొండ్రొసోవా
అంతకుముందు జరిగిన తొలిసెమీఫైనల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీకి దిగి..సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన ఎలీనా స్వితోలినాను ..అన్ సీడెడ్ గా బరిలో నిలిచిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వోండ్రుసోవా వరుస సెట్లలో చిత్తు చేసి తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది.
తద్వారా వింబుల్డన్ ఓపెన్ ఎరాలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా వోండ్రుసోవా సరికొత్త రికార్డు సృష్టించింది. వొండ్రొసోవా 6-3, 6-3తో ఎలీనా స్వితోలినాను కంగు తినిపించింది.
మార్కెటా వొండ్రొసోవాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వోండ్రుసోవా 4 ఏస్‌లతో పాటు 22 విన్నర్లు సాధించింది.
మరోవైపు..స్వితోలినా మాత్రం మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్ కూడా వేయలేకపోయింది. కేవలం 9 విన్నర్లకే పరిమితమై మూల్యం చెల్లించుకుంది.
ముగిసిన బోపన్న జోడీ పోరు...
43 సంవత్సరాల లేటు వయసులో వింబుల్డన్ డబుల్స్ బరిలోకి దిగిన భారత ఒకే ఒక్క ఆటగాడు రోహన్ బోపన్న జోడీ పోరు సెమీస్ లోనే ముగిసింది.
టాప్ సీడ్ జోడీ వెస్లీ-నీల్ తో జరిగిన పోరులో రోహన్- మాథ్యూల జోడీ 5-7, 4-6తో పరాజయం పాలయ్యారు.
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ తో డేనియల్ మెద్వదేవ్, నొవాక్ జోకోవిచ్ తో సిన్నర్ తలపడనున్నారు.